అయ్యప్ప సన్నిధానం ఇలా చేరుకుందాం-ఆధ్యాత్మికం

సన్నిధానం చేరుకుందామిలా.. – తదితర ఆద్యాత్మిక వార్తలు
అందమైన కొండలు, ఆకర్షించే జలపాతాలు కేరళ సొంతం. ఊరూరా కాల్వలు.. అందులో పడవలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడే 18 కొండల నడుమ ఓ అయ్య వెలిశాడు. 18 మెట్ల మీద కాళ్లకు పట్టబంధం వేసుకుని మరీ కూర్చున్నాడా అప్ప. ఈ అయ్యప్పను చూసేందుకు ‘‘పళ్లికట్టు శబరిమలైక్కు’’ అంటూ మహిమాన్వితమైన క్షేత్రానికి తండోపతండాలుగా తరలి వెళ్తుంటారు దీక్షధారులు. శబరిమలలో మళ్లీ అయ్యప్పల సందడి మొదలైంది. నవంబరు 16 నుంచి డిసెంబరు 27 వరకు మండల మహోత్సవం, మళ్లీ డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు మకర విళక్కు మహోత్సవం సందర్భంగా శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు స్వాములు పెద్దసంఖ్యలో బయలుదేరుతున్నారు.
1.అలమేలు మంగకిదే… నీరాజనం -డిసెంబరు 4 నుంచి పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు
ఆమె కరుణాంతరంగ… శ్రీవారి హృదయాంతరంగ… తన బిడ్డలకు వరాలిచ్చేందుకు ఆమె ఏడు కొండలూ దిగివచ్చారు… అల్లంత దూరంలో ఉండి వారి కోరికలను తన పతిదేవుడికి నివేదిస్తున్నారు… అంత ప్రేమ చూపుతారు కాబట్టే ఆమె దేవదేవుడి గుండెల్లో నిక్షిప్తమయ్యారు… జగాలేలే ఆ తండ్రి. నడి రేయి ఏ జామునో ఆమె కోసం ఏడు కొండలూ దిగి వస్తున్నారు… అంతటి తల్లి బ్రహ్మోత్సవం.. సకల జగాలకూ ఉత్సవమే కదా!
*ఆ ఉత్సవాలు బ్రహ్మాండం…
తిరుమల శ్రీనివాసునికి ఆశ్వయుజమాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగితే అమ్మవారికి కార్తిక మాసంలో కన్నుల పండువగా జరుగుతాయి.
అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించిన పంచమినాటికి ముగిసేలా తొమ్మిది రోజుల ముందు ప్రారంభించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తమిళ కార్తికమాసం శుక్లపక్ష పంచమికి ముగిసేట్లుగా ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి డిసెంబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. తిరుమలలో మాదిరిగానే తిరుచానూరు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
* ప్రారంభానికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. ప్రారంభం నాటి ఉదయం తిరుచ్చి వాహనాన్ని అధిరోహించి అమ్మవారు తిరు వీధుల్లో ఊరేగి ఆలయం చేరుకున్నాక ద్వజారోహణం జరుగుతుంది. ఆ నాటి రాత్రి నుంచి వాహన సేవలు జరుగుతాయి.
* బ్రహ్మోత్సవాల్లో తొలినాటి రాత్రి చిన్న శేషవాహనంపై, రెండోరోజు ఉదయం పెద్ద శేషవాహనంపై అమ్మవారు ఊరేగుతారు.
* అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజు అత్యంత ముఖ్యమైన గజ వాహన సేవ జరుగుతుంది. లక్ష్మీదేవి ఏనుగు కుంభ స్థలంలో నివసిస్తూ ఉంటుందని చెబుతారు. తాను నిత్యం నివసించే ఏనుగునే వాహనంగా చేసుకుని ఊరేగే అమ్మవారిని దర్శించడం పుణ్యప్రదమని భక్తులు భావిస్తారు.
*తిరుమల నుంచి సారె…
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు జరిగే పంచమీ తీర్థంలో చక్రస్నానంనాడు తిరుమల నుంచి అమ్మవారికి సారె పంపడం ఆనవాయితీ. ఆ రోజు తిరుమల నుంచి అర్చకులు, ఆలయ అధికారులు కాలినడకన సారెను తీసుకువస్తారు. ఇందులో రెండు పట్టు చీరెలు, రెండు పట్టు రవికలు, పచ్చి పసుపు చెట్లు, పసుపు, చందనం ముద్దలు, పూల మాలలు, తులసి మాలలతో పాటు రెండు బంగారు నగలు ఉంటాయి. ఇంకా వివిధ పిండి వంటలు ఒక్కో పడి వంతున పంపుతారు. అంటే 51 పెద్ద లడ్డూలు, 51 వడలు, 51 దోసెలు సారెలో భాగంగా పంపుతారు. వీటిని ఏనుగు అంబారీపై ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు.
* తిరుచానూరులో పంచమీ తీర్థం ముగిశాకే తిరుమలలో స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.
అయ్యవారు – వేంకటేశ్వరుడు
అమ్మవారు – పద్మావతీదేవి
వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్షదైవం.. భక్తుల పాలిట కొంగు బంగారం. ఆపద మొక్కుల వాడు. అనాధ రక్షకుడు. శ్రీ పద్మావతీ దేవి. దేవేరుడికి ఏ మాత్రం తీసిపోని కరుణామయి. భక్తులపాలిట కల్పవృక్షం. భక్తుల విన్నపాలను, కోరికలను పతికి విన్నవించేందుకే వెలిసిన కరుణాంతరంగ!!
*ఆమె వ్యూహలక్ష్మి…
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని తమను రక్షించేందుకు భువికి వచ్చిన శ్రీమన్నారాయణుడిగా భక్తులు కొలుస్తారు. ఆగ్రహంతో విచక్షణ మరిచిన భృగు మహర్షిని అనుగ్రహించిన భర్తపై కోపంతో వైకుంఠం వదిలి భూమికి చేరిన శ్రీమహాలక్ష్మినే పద్మావతీదేవిగా భావిస్తారు. శ్రీనివాసుడు ఏడుకొండలను నివాసంగా చేసుకోగా, మహాలక్ష్మి ఆయన హృదయంపై కొలువుదీరింది. వ్యూహలక్ష్మి పేరుతో పూజలు, ఆరాధనలు అందుకునే అమ్మ భక్తులను అనుగ్రహించమని స్వామిని ప్రోత్సహిస్తూ ఉంటుందని చెబుతారని భక్తుల నమ్మకం. శ్రీ వేంకటేశ్వరుని హృదయ పీఠంపై పద్మాసన స్థితిలో వ్యూహలక్ష్మి ఉంటారు. ఈమెను దర్శించడం, ఆరాధించడం అందరికీ సాధ్యపడదు. అందుకే అందరికీ దర్శనమివ్వాలనే తలంపుతోనే అమ్మవారు సువర్ణముఖీ తీరంలో స్వతంత్ర వీరలక్ష్మిగా కొలువుదీరారని అంటారు. అంటే శ్రీనివాసుని హృదయ పీఠంపై ఉన్న దేవేరే తిరుచానూరులో ఉన్న పద్మావతీ దేవి.
*ఆ సరోవరంలో…
లక్ష్మీదేవి అలిగి భూలోకం చేరాక ఆమెను వెదుకుతూ స్వామి కూడా వచ్చేశారు. ఆయన ప్రస్తుత తిరుచానూరులో పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేసుకుని పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు. కార్తిక మాసంలో పంచమి శుక్రవారం నాడు సరోవరంలోని బంగారు పద్మంలో అమ్మ ప్రత్యక్షమయ్యారు. అలా పద్మంలో నుంచి వచ్చారుకాబట్టి ఆమె పద్మావతి అయిందని అంటారు. మరో కథ ప్రకారం సంతానం కోసం యజ్ఞం చేసిన నారాయణవనాన్ని పరిపాలించే ఆకాశరాజు యజ్ఞ భూమిని దున్నుతున్న సమయంలో ఓ పెట్టె దొరికింది. అందులో వెయ్యి రేకులున్న తామర పుష్పంలో స్త్రీ శిశువు దర్శనమిచ్చింది. ఆమెను బిడ్డగా స్వీకరించిన ఆకాశరాజు పద్మంలో లభించినందువల్ల పద్మావతి అని పేరు పెట్టి పెంచుకుని యుక్త వయసు రాగానే శ్రీనివాసునికిచ్చి వివాహం జరిపించారని అంటారు.
*అలమేలు మంగ ఎవరు?
పద్మావతీ అమ్మవారిని అలమేలు మంగాదేవి అనికూడా పిలుస్తారు. దీనికో కథ చెబుతారు. పూర్వం శుక మహర్షి హిమాలయాల నుంచి బయల్దేరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వర్ణముఖీనదీ తీరంలోని ప్రస్తుత క్షేత్రానికి చేరి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నివసించసాగారు. తర్వాత అక్కడ ఒక ఊరు ఏర్పడింది. దీన్ని మహర్షి పేరుమీదే శ్రీ శుకనూరు అని పిలిచేవారు. తర్వాత అది తిరుగచ్చనూరు అయింది. అది కాల క్రమంలో తిరుచానూరు అయింది. తిరుచానూరులో అమ్మవారు పద్మంపై ఆశీనురాలై ఉంది. తమిళంలో అమ్మవారిని అలర్మేల్ మంగై అని అంటారు. అంటే తామర పువ్వుపై ఉన్న దేవత అని అర్థం. అందువల్లనే పద్మావతీదేవికి అలమేలు మంగా దేవి అని, తిరుచానూరుకు అలమేలు మంగాపురం అని పేర్లు వచ్చాయి.
*ముందుగా అమ్మ దర్శనం…
సాధారణంగా పిల్లలు ముందు తల్లి వద్దకు వెళ్లి గోముగా అడుగుతారు. ఆ తర్వాతే తండ్రి వద్దకు…! ఇక్కడా అంతే. తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించిన తర్వాత స్వామి చెంతకు వెళ్లాలని నియమం. అయితే తిరుమల కంటే ముందు తిరుచానూరు చూడాలని చెబుతారు. కొండపైకి వెళ్లే ముందు దిగువున కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని, ప్రార్థించి తమ కోరికలను విన్నవించుకోవాలి. తర్వాత కొండకు చేరి అయ్యవారిని వేడుకోవాలి.
*అందుకేనేమో
32 వేలకు పైగా కీర్తనల్లో శ్రీనివాసుడిని అర్చించిన పదకవితా పితామహుడు అన్నమాచార్య తొలిసారిగా అమ్మవారి పైనే శతకాన్ని రచించారు. కీర్తనలతో అర్చించారు.
‘చొచ్చితి తల్లీ! నీ మరుగు
సొంపుగ నీ కరుణాకటాక్షమెట్లబ్బెదో
నీకు నేడు పరమేశ్వరీ!
యోయలమేలు మంగ…’ అంటూ
ఆ తల్లిని గురించి తొలిసారిగా శతకం రచించారు.
*పంచమీ తీర్థం
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైంది పంచమీ తీర్థం. ఇది బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరుగుతుంది. అమ్మవారు ఆవిర్భవించిన పద్మ సరోవరంలో ఆమె ఆవిర్భవించిన రోజు జరిగే సేవ ఇది. పద్మ సరోవరం వద్ద అమ్మవారికి స్నపన తిరుమంజనం జరుగుతుంది. తర్వాత చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంలో లక్షలాది మంది భక్తులు పంచమీ తీర్థంలో స్నానం చేస్తారు. ఆనాటి రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
*ఆ తల్లి అక్కడుంది…
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి ఇద్దరు దేవేరులు. శ్రీదేవి, భూదేవి. శ్రీవారి మూలవిరాట్టుపై శ్రీదేవి శాశ్వత స్థానాన్ని పొందగా, భూదేవి రూపాన్ని స్వామి వక్ష స్థలంపై అలంకరిస్తారు. వ్యూహలక్ష్మి తిరుచానూరులో కొలువుదీరి ఉన్న పద్మావతీదేవి కాగా, భూదేవి ఎక్కడ కొలువుదీరారనే సందేహం కలుగుతుంది. ఈ విషయాన్ని వరాహ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యం వివరిస్తుంది. స్వామి వారి ఆనంద నిలయాన్ని నిర్మించింది తొండమాన్ చక్రవర్తి. ఆయన ఒకసారి నేరుగా శ్రీవారి ఏకాంత మందిరంలోకి వచ్చినప్పుడు, హఠాత్తుగా ప్రవేశించిన ఆయనను చూసి శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దాక్కుంటే, భూదేవి ఆలయంలోని బావిలో దాక్కు,న్నారు. ఆ బావే ఇప్పటి సంపంగి ప్రదక్షిణంలో ఉన్న పూలబావి అని చెబుతారు. తర్వాత రామానుజులు తిరుమల సందర్శించినప్పుడు ఈ గాథ తెలుసుకుని ఆ బావిలోనే అమ్మను ప్రతిష్ఠించి నివేదనలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. స్వామి వారి పూలమాలలను కూడా ఆ బావిలోనే వేసే ఏర్పాట్లు చేసినట్లు చెబుతారు..
*పూర్వం అయ్యవారి ఆరాధన ఇక్కడే…
సుమారు 9, 10 శతాబ్ధాలకంటే ముందే తిరుచానూరులో ఎక్కువ మంది అయ్యవారిని ఆరాధించేవారట. అందుకే తిరుచానూరులో కూడా శ్రీ వేంకటేశ్వరుడి మూర్తిని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతారు. కాగా తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు కూడా తిరుచానూరులోనే జరుగుతుండేవి. అప్పట్లో తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ధ్వజారోహణ ఉత్సవం మాత్రమే జరిగేది. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే జరుగుతుండేవి. రామానుజాచార్యుల కాలం నుంచి కొండపై ఉత్సవాలను నిర్వహించారు.

2. ..ఏ దోషం రాదు.
ఉప్పు, నూనె, నువ్వులు, కారం చేతికి తీసుకుంటే దోషం వస్తుందంటారు.. నిజమేనా?
ఉప్పు, నూనె, నువ్వులు, కారం వంటివి చేతికి సరాసరి తీసుకోవడం దోషమని మన పెద్దలు చెప్పారు. మనం కొంచెం వివేచన చేసి పరిశీలిస్తే, ఆ పదార్థాలు ప్రత్యక్షంగా చేతికి తీసుకోవడంలో కొంత అసౌకర్యం ఉన్నదని గమనించవచ్చు. అంతేకాక ఉప్పుకారాలు అంటిన చేయి కంటికి తగిలితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక నూనె జిడ్డు పదార్థం. జారిపోయే అవకాశం ఉంటుంది. ఈ దృష్టితో నూనెను నేరుగా తీసుకోరాదనే నియమం వచ్చి ఉంటుంది. నువ్వులు ప్రధానంగా పితృకార్యాలలో వినియోగిస్తారు. అశుభ సందర్భంలో ఉపయోగించే నువ్వులు ఒకరి చేతి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాదని ఈ విధానం వాడుకలోకి వచ్చింది. కానీ, నువ్వులు చేతికి తీసుకున్నంత మాత్రాన దోషాలు వస్తాయని అనుకోవాల్సిన పనిలేదు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

3. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఇస్రో ఛైర్మన్ శివన్ బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. సహచర శాస్త్రవేత్తలతో కలిసి స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. శ్రీహరికోట నుంచి గురువారం ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ-సీ43 ఉపగ్రహం నమూనాను ఈ సందర్భంగా స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేేశారు.

4. అందాల అరబిక్ తీరం గోకర్ణం
అరేబియా సముద్రతీరం.. తీరాన ఉన్న నల్లరాళ్ల గుట్టలను సుతిమెత్తగా తాకే అలలు… అరబిక్ కడలి ఇంత అందంగా ఉంటుంది అని చెప్పకనే చెప్తుంటాయి. గోకర్ణ, గజకర్ణ విద్యల మాటేమో కానీ ఇక్కడ నేల ఆవు చెవి ఆకారంలో ఉందని ఈ ప్రదేశానికి గోకర్ణం అని నామకరణం చేసేశారు మనకంటే వందల ఏళ్ల ముందు పుట్టిన వాళ్లు. ఈశ్వరుడు భూమి నుంచి ఆవు చెవిని వెలికి తీశాడని భక్తిగా కళ్లు మూసుకుంటారు భక్తులు. ఇక్కడికి వచ్చే పర్యాటకులను రెండు రకాలుగా కాదు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. గోకర్ణం పట్టణానికి ఉత్తర శివారున ఉన్న గోకర్ణం బీచ్లో భక్తులు కనిపిస్తారు, దక్షిణం వైపున్న ఓమ్ బీచ్, కుడ్లె బీచ్, హాఫ్మూన్ బీచ్లో హాలిడేని ఆనందంగా గడపాలనుకునే జాలీ పీపుల్ కనిపిస్తారు. ప్యార డైజ్ బీచ్లో అడవి మధ్యలో ట్రెక్కింగ్ చేస్తూ మరో తీరానికి చేరడంలో థ్రిల్ ఎంజాయ్ చేసే సాహస యాత్రికులు కనిపిస్తారు. హాయిగా గడపడానికి వచ్చి బీచ్కి పడవలో చేరుతుంటారు.
**గోకర్ణం బీచ్…
ఇక్కడ పర్యాటకులను అలరించే నల్ల రాతి గుట్టలు దూరం నుంచి ఎంత అందంగా ఉంటాయో దగ్గరకు వెళితే ‘మెత్తగా’ భయపెడతాయి. ఈ రాళ్ల మీద అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా అడుగువేస్తే మెత్తగా జారి నీటిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడొక బీచ్ సంస్కృత ఓంకారం ఆకారంలో ఉండటంతో ఆ పేరే వాడుకలోకి వచ్చేసింది. ఈ ఆకారం ఏరియల్ వ్యూలో తీసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి సర్ఫింగ్, స్కీయింగ్, బనానా బోట్ ఉన్నాయి. తీరాన ఉన్న గుడిసెల్లో వేడి టీ తాగుతూ అలలను చూడటం అందమైన అనుభూతి. దీనికి దగ్గరల్లోనే హాఫ్మూన్ బీచ్ ఉంది. ఇది చాలా చిన్న తీరం. ఓమ్ బీచ్కి- హాఫ్మూన్ బీచ్కి మధ్య ఉన్న మట్టి కొండలు ప్రకృతి చేసిన మరో అద్భుతం. నీటి ప్రవాహం తాకిడికి నేల ఒరుసుకుపోయి అర్థచంద్రాకారంలో తీరం ఏర్పడడంతో పాటు గట్టిగా ఉన్న నేల ఇలా కొనదేలిన మట్టి శిఖరాలుగా మారిపోయింది. కుడ్లె బీచ్కి గోకర్ణం బీచ్ నుంచి రిక్షాలుంటాయి. తీరం వెంబడి చిన్న గుడిసెలుంటాయి. ఇవి జనావాసాలేమో అనుకుంటే పొరపాటే. అన్నీ టీ దుకాణాలే. లోపల ఆధునిక సౌకర్యాలుంటాయి, పైకి మాత్రం స్థానిక పురాతనల నివాసాలను పోలి ఉంటాయి.ఇక్కడ ఓపెన్ రెస్టారెంట్లు ఉంటాయి. సముద్రపు ఆహారాన్ని నిప్పుల కుంపటి (బార్బిక్యూ) మీద కాల్చి ఇస్తారు. సముద్రంలో ఈత కొట్టిన దేహం వేడి వేడి టీ కోసం చూస్తుంటే.. అప్పుడే కాల్చిన చేపలు, రొయ్యలు ఘుమఘుమలాడుతుంటాయి. సముద్ర తీరాల్లో విహరించిన తర్వాత ఇక్కడ ఇంకా చూడాల్సినవి ఏమేం ఉన్నాయని ఆరా తీస్తే… జాబితాలో మొదట నిలిచేది మహాబలేశ్వర్ ఆలయం. మహాబలేశ్వరాలయం ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటుంది. నలుచదరపు సాలిగ్రామ పీఠం మీద ఉంటుంది ఆత్మలింగం. పై అంతస్తుకి వెళ్లి చిన్న రంధ్రం నుంచి చూస్తే ఆత్మలింగం శిఖరం కనిపిస్తుంది. మహాబలేశ్వర్ ఆలయాని కంటే ముందు గణపతి ఆలయానికి వెళ్లాలని ఇక్కడ నిబంధన. అది కూడా కొద్ది దూరంలోనే ఉంది. గోకర్ణానికి కిలో మీటరు దూరంలో భద్రకాళి ఆలయం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మిగిలింది గంగావళి, అఘానాశిని నదులు అరేబియా సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం. దీనిని చూస్తే ఈ ప్రదేశానికి గోకర్ణం అనే పేరు రావడానికి కారణాన్ని మనమే కనుక్కున్నంత ఉద్వేగం కలుగుతుంది. భౌగోళిక పరిజ్ఞానం పెంచుకున్న భావనతో పాటు ఇక్కడ తిన్న రుచులను గుర్తుచేసుకుంటూ తిరుగు ప్రయాణం కావచ్చు.

5. 4 రోజులు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని డిసెంబరు 17నుంచి 20వరకు ప్రత్యేక దర్శనాలను రద్దుచేస్తున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వెల్ల్లడించారు. డిసెంబరు 18న వైకుంఠఏకాదశి, 19న వైకుంఠ ద్వాదశిఏర్పాట్లపై అధికారులతో కలిసి ప్రణాళికను గురువారం రూపొందించారు. స్వయంగా వచ్చిన ప్రముఖులను గుర్తించి వసతి, టిక్కెట్ల కల్పనకు చర్యలు తీసుకుంటామని, సిఫారసు లేఖలు స్వీకరించబోమని జేఈవోచెప్పారు. వైకుంఠద్వాదశి రోజునఉదయం బ్రేక్దర్శనాన్ని రద్దు చేస్తున్నామని 2రోజులకు కలిపి 43నుంచి 44గంటల పాటు సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

6. కళల తీరానికి
ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి. జగన్నాథుడి దర్శనం కోసం, రథయాత్ర వైభవాన్ని చూసి తరించేందుకు జూన్‌-జులై నెలల్లో లక్షల మంది యాత్రికులు పూరి క్షేత్రానికి వస్తుంటారు. డిసెంబరులోనూ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పూరి తీరం కళల కాణాచిగా మారిపోతుంది. కడలి అంచున చంద్రభాగ తీరంలో ఐదు రోజుల పాటు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. దేశవిదేశాలకు చెందిన సుప్రసిద్ధ సైకత శిల్పులు ఇందులో పాల్గొంటారు. తమ ఊహల్లో పురుడు పోసుకున్న రూపాలకు ఇసుకతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. సైకత శిల్పాలు మాత్రమే కాదండోయ్‌.. విభిన్న కళలు, విలక్షణమైన సంస్కృతి, వీరోచితమైన ఆటలు.. వినోదాన్నిచ్చే అన్ని వేడుకలకూ పూరి తీరం వేదికగా నిలుస్తుంది. సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు బోటు రేసులు, కబడ్డీ పోటీలు, బీచ్‌ పార్టీలు, ఫ్యాషన్‌ షోలు అదరహో అనిపిస్తాయి.
***నాట్య తరంగం
పూరి సమీపంలోని ప్రత్యక్ష నారాయణుడి క్షేత్రం కోణార్క్‌ కూడా సంప్రదాయ వేడుకకు వేదిక కానుంది. పూరి బీచ్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న రోజుల్లోనే కోణార్క్‌లో నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. సుప్రసిద్ధ నృత్యకారుల లాస్యవిన్యాసాలు సంస్కృతి ఆరాధకులకు కన్నులవిందు చేయనున్నాయి.
ఎప్పుడు: డిసెంబరు 1 నుంచి 5 తేదీ వరకు
***ఇలా వెళ్లాలి
* విజయవాడ, విశాఖపట్టణం నుంచి పూరీకి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా, భువనేశ్వర్‌ వెళ్లే రైలు ఎక్కి ఖుర్ధా రోడ్‌ జంక్షన్‌లో దిగాలి. అక్కడి నుంచి పూరి 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్యాక్సీలు, బస్సుల్లో వెళ్లొచ్చు.
* హైదరాబాద్‌, విశాఖపట్టణం నుంచి భువనేశ్వర్‌కు నాన్‌స్టాప్‌ విమానసర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భువనేశ్వర్‌ నుంచి ట్యాక్సీలు, బస్సుల్లో పూరి (62 కి.మీ) చేరుకోవచ్చు.
* పూరి నుంచి కోణార్క్‌ 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.

7. దుర్గగుడి హుండీ ఆదాయం రూ.1.66 కోట్లు
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు 16 రోజుల్లో వేసిన కానుకలను లెక్కించగా రూ.1,66,98,984 ఆదాయం వచ్చింది. 32 హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో గురువారం లెక్కించారు. కానుకలతోపాటు 430 గ్రాముల బంగారు వస్తువులు, 5.450 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపును దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబు, ఈవో కోటేశ్వరమ్మ పర్యవేక్షించారు. వన్‌టౌన్‌ పోలీసులు, ఎస్పీఎఫ్‌, ఏజెల్‌ సెక్యూరిటీ సిబ్బంది హుండీ ఆదాయం లెక్కిస్తున్న ప్రాంతమైన మహా మండపంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, సెక్యూరిటీ విధులు నిర్వర్తించారు.

8. శుభమస్తు
తేది : 30, నవంబర్ 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(నిన్న రాత్రి 6 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 57 ని॥ వరకు
నక్షత్రం : పూర్వఫల్గుణి
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 22 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 18 ని॥ వరక
యోగము : వైదృత
కరణం : బాలవ
వర్జ్యం :
(ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 31 ని॥ వరక
అమ్రుతఘడియలు :
(ఈరోజు రాత్రి 10 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 42 ని॥ వరకు
దుర్ముహూర్తం :
(ఉదయం 8 గం॥ 42 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 26 ని॥ వరకు)(ఉదయం 12 గం॥ 26 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 10 ని॥ వరకు
రాహుకాలం :
(ఉదయం 10 గం॥ 40 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 7 గం॥ 52 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 15 ని॥ వరకు)
యమగండం :
(మద్యాహ్నం 2 గం॥ 51 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 14 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 29 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 39 ని॥ లకు
సూర్యరాశి : వృచ్చికము
చంద్రరాశి : సింహము

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com