మమ్మల్ని విడగొట్టాలనుకున్నారు

కమల్‌హాసన్‌ను, తనను విడగొట్టేందుకు ప్రయత్నించారని అంటున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘2.ఓ’ చిత్రం గురువారం విడుదలై ఒక్కరోజులోనే బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక్కరోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో రజనీ శబరిమల వివాదం గురించి, తన రాజకీయ ప్రయాణం గురించి, కమల్‌హాసన్‌తో ఉన్న బంధం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘నేను, కమల్‌ ప్రత్యర్థులం అని ఎవరు చెప్పారు? ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన నాకు పోటీదారుడు అని కూడా చెప్పను. కమల్‌ నాకు మంచి సహనటుడు. చెప్పాలంటే.. డైలాగుల విషయంలో ఆయనే నాకు సాయం చేస్తుంటారు. నా కోసం తన సినిమా డేట్లను కూడా సర్దుబాటు చేసుకునేవారు. మేమిద్దరం రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కమల్‌ నాకు ఎప్పటికీ మంచి మిత్రుడే. మా కెరీర్‌ తొలినాళ్లలోనే రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. ఈ విషయంలో ఇండస్ట్రీ మమ్మల్ని వేరు చేస్తుందని తెలుసు. అనుకున్నట్లుగానే నన్ను, కమల్‌ను విడదీయాలని చూశారు. కానీ మా జాగ్రత్తలో మేమున్నాం.’ అని తెలిపారు. అనంతరం శబరిమల వివాదం గురించి మాట్లాడుతూ..‘కొన్ని ఆలయాలు, వాటి సంప్రదాయాల విషయాల్లో న్యాయస్థానాలే కాదు ఎవ్వరూ తలదూర్చకూడదు. ఎందుకంటే అవి చాలా సున్నితమైన అంశాలు. సంప్రదాయాల ప్రకారం నడుచుకోవడమే ఉత్తమం. రాజకీయాలను మతాలతో కలపకూడదు. ఈ విషయంలో నేను క్లారిటీగా ఉన్నా. మతం అనేది పూర్తిగా విభిన్నమైన అంశం.’ అని వెల్లడించారు ‘తలైవా’.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com