దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం.. మరోవైపు టీకా పంపణీ మొదలు కావడంతో కేంద్ర హోం శాఖ ఇప్పటివరకూ విధిస్తూ వస్తున్న ఆంక్షలను మరింత సడలించడానికి సిద్ధమైంది. సినిమా హాళ్లు, ఇతర థియేటర్లలో ప్రస్తుతం అనుమతిచ్చిన 50% సీటింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి అనుమతివ్వబోతున్నట్లు బుధవారం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇప్పటివరకూ క్రీడాకారులకే అనుమతి ఉన్న ఈత కొలనుల్లో అందరిని అనుమతించనున్నట్లు ప్రకటించింది. కేవలం బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్ల వరకే ఉన్న అనుమతులను అని రకాల ఎగ్జిబిషన్ హాళ్లకూ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మూడు కార్యకలాపాలకు సంబంధించిన ప్రామాణిక నిర్వహణా నిబంధనల(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్)ని సంబంధిత శాఖలు త్వరలో విడుదల చేస్తాయని పేర్కొంది. మరోవైపు కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్టం కింద జారీ చేసిన మార్గదర్శకాల కాల పరిమితి జనవరి 31తో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు అమలు చేసే కొత్త నిబంధనలను జారీ చేసింది. కంటెయిన్మెంట్ జోన్ల బయట అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.
*** కొత్త నిబంధనలు
* ఇప్పటివరకూ సామాజిక/మతం/క్రీడలు/వినోదం/విద్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే హాళ్లలో 50% సీటింగ్ సామర్థ్యంతో కానీ, లేదంటే నాలుగు గోడల మధ్య అయితే గరిష్ఠంగా 200 మంది వ్యక్తులతో, బహిరంగ ప్రాంతాల్లో ఆ మైదానం వైశాల్యానికి అనుగుణంగా కానీ జనాభాను అనుమతిచ్చిన కేంద్రం ఇప్పుడు ఇలాంటి చోట్ల ఎంతమందికి అనుమతివ్వాలనే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే నిబంధనలకు అనుగుణంగా జనాభాను అనుమతివ్వనున్నట్లు పేర్కొంది.
* సినిమాహాళ్ల సీట్ల సామర్థ్యాన్ని 50%కి మించి పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ, మంత్రిత్వశాఖ హోంశాఖతో సంప్రదించి ఎస్ఓపీ జారీ చేస్తుందని తెలిపింది. ఈత కొలనుల్లోకి సాధారణ ప్రజలను అనుమతించినప్పుడు అనుసరించాల్సిన నిబంధనలపై క్రీడా మంత్రిత్వ శాఖ, ఎగ్జిబిషన్ల నిర్వహణ సమయంలో పాటించాల్సిన పద్ధతులపై వాణిజ్యశాఖ హోం శాఖతో సంప్రదించి నిబంధనలను జారీ చేయనున్నట్లు పేర్కొంది.
* అంతర్జాతీయ విమాన సేవల ప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ.. హోంశాఖతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.
* రైళ్లు, విమానాలు, మెట్రోరైళ్లలో ప్రయాణికుల రాకపోకలు, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు, వినోద పార్కులు, యోగా, వ్యాయామ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన ఎస్ఓపీలను ఎప్పటికప్పుడు నవీకరించనున్నట్లు పేర్కొంది.
* రాష్ట్రాల మధ్య కానీ, ఒకే రాష్ట్రంలో ఒకచోట నుంచి మరోచోటికి వెళ్లడంపై కానీ, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా దేశ సరిహద్దుల మధ్య జరిగే వాణిజ్యంపె ఆంక్షలు విధించకూడదని పేర్కొంది.
* కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రజలు మాస్కుల వినియోగం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి.