Movies

దివిసీమలో ఘనంగా వేటూరి జన్మదిన వేడుకలు

Veturi Birthday Celebrations In Avanigadda-Theepi Patala Tene Manishi Book

దివిసీమలోని పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించి సినీ సాహిత్య వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొంది, తెలుగు భాషా నేపథ్యంలో జాతీయ పురస్కారం పొందిన డా.వేటూరి సుందర రామ్మూర్తి 85వ జన్మదిన వేడుకలు అవనిగడ్డ గాంధిక్షేత్రంలో ఘనంగా జరిగాయి. దివి ఐతిహాసిక పరిశోధన మండలి మరియు దివి లలిత కళాసమితి ల ఆధ్వర్యంలో పూర్వపు ఉపసభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ చల్లపల్లి రథసారథి డా. దాసరి రామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినిపరిశ్రమకు కావ్య గౌరవం కల్పించిన మహా కవి పుంగవుడు డా.వేటూరి సుందర రామమూర్తి మన దివిసీమ లో పుట్టడం దివి ప్రజలకు గర్వకారణమని, అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలు అవనిగడ్డలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా పెదకళ్ళేపల్లి లో సుసార్ల దక్షిణామూర్తి, వేటూరి ప్రభాకర శాస్త్రి ల గురించి, వారి విశిష్ఠతల గురించి కొనియాడారు. 1999 సంవత్సరంలో వేటూరిని తొలిసారిగా కలిశానని, ఆయనతో కలిసి దక్షిణ కాశీగా పేరొందిన పెదకళ్లేపల్లి గ్రామంలో 3 రోజులపాటు సంగీత సాహిత్య వసంతోత్సవాలు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గానగందర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, కె.విశ్వనాధ్, తనికెళ్ళభరణి లాంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు విచ్చేసినట్లు తెలిపారు. ఆయన మరణానంతరం ఆయన స్వగ్రామంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం చేతులమీదుగా వేటూరి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. వేటూరి పాటలు, ఎస్పీ బాలు గళంలో ఎంతో ప్రసిద్ధి చెందయని, వేటూరితో బాలు కి ఉన్న అన్యోన్య మైత్రి గురించి కొనియాడారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం కూడా యావత్తు ప్రపంచాన్ని కుదిపేసిందని, వేటూరి జన్మదినం సందర్భంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు అక్షర నివాళిగా, స్వచ్ఛ చల్లపల్లి రథసారథి డా.డి.ఆర్.కె ప్రసాద్ చేతులమీదుగా “తీపి పాటల తేనె మనిషి” ఎస్పీ బాలసుబ్రమణ్యం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డా.డి.ఆర్.కె ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ చల్లపల్లి తో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. అనంతరం దివిసీమ లలిత కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరిలో గాయనీ గాయకులు పాల్గొని వేటూరి-బాలు పాటలను పాడి వినిపించారు. గాయనీ గాయకులకు డా.మండలి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధిక్షేత్రం కమిటీ కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, దివి లలిత కళా సమితి అధ్యక్ష కార్యదర్సులు పుప్పాల వీరంజనేయులు, చంద్రశేఖర్, జ్యోతి, మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.