భారతదేశంలోకి ప్రవాసులు పంపిన సొమ్ము రూ.5 లక్షల కోట్లు

ఉపాధి కోసం విదేశాలకు… ప్రధానంగా గల్ఫ్‌ దేశాలకు వలసపోయే భారతీయులు లక్షల్లో ఉన్నారు. ఇక ఉద్యోగాల కోసమో, ఉన్నతావకాశాల కోసమే వెళ్లే వారి సంఖ్యా… తక్కువేమీ కాదు. భావోద్వేగాలు భారతీయులకు ఒకింత ఎక్కువే. అందుకనే సుదూర దేశాలకు వెళ్లిన వారంతా మాతృదేశంలో, పుట్టినూరిలో తమకోసం ఎదురుచూస్తుండే తమవాళ్ల కోసం పదోపరకో పంపిస్తూనే ఉన్నారు. అంతేనా… అనేయకండే. అలా పంపించిన మొత్తం ఎంతో తెలిస్తే వామ్మో! అంటూ గుండెలపై చేయి వేసుకోవడం ఖాయం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) లెక్కల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిన సొమ్ము మొత్తం 6,900 కోట్ల డాలర్లు. అంటే, సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలు. దీనిలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది 20 వేల కోట్లు. ఆర్‌బీఐ ప్రతీ ఏడాది ‘ఇండియాస్‌ ఇన్‌వార్డ్‌ రెమిటెన్స్‌ సర్వే’ పేరుతో ఓ నివేదికను విడుదల చేస్తుంది. దీనిలో ఆ ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఆర్‌ఐలు తమ మాతృదేశానికి ఎంత సొమ్ము రెమిటెన్స్‌ చేశారు? దేశంలోని ఏ రాష్ట్రానికి ఎంత వచ్చింది? ఏ మార్గాల్లో వచ్చింది? వచ్చిన సొమ్ము ఏ రూపంలో ఖర్చు అయ్యింది? వంటి వివరాలన్నింటినీ సవివరంగా పేర్కొంటుంది. ప్రపంచంలోని పలు దేశాల లెక్కలను పరిగణలోకి తీసుకొంటే విదేశాలలో స్థిరపడి స్వదేశానికి సొమ్ములు పంపిస్తున్న దేశాలలో 2012 నుంచి భారతదేశమే అగ్రస్థానంలో ఉంది. దేశంలోకి వస్తున్న సొమ్ములో సింహభాగం ప్రైవేటు బ్యాంకుల ద్వారా… 74.2 శాతం వస్తూంటే ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా 17.3శాతం, విదేశీ బ్యాంకుల ద్వారా 8.5శాతం దేశంలోకి వచ్చింది. దేశంలో ఏ రాష్ట్రానికి ఎంత వచ్చింది అన్న లెక్కలను పట్టిక రూపంలో నివేదికలో ఆర్‌బీఐ పొందుపరిచింది. 19శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉండగా వరుసగా మహరాష్ట్ర 16.7, కర్ణాటక 15.0, తమిళనాడు 8.0, ఢిల్లీ 5.9, ఆంధ్రప్రదేశ్‌ 4.0, ఉత్తరప్రదేశ్‌ 3.1, పశ్చిమ బెంగాల్‌ 2.7, గుజరాత్‌ 2.1, పంజాబ్‌ 1.7శాతంలో మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. 15.5శాతం సొమ్ము… అంటే 75వేల కోట్ల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రానికి చేరిందో స్పష్టత లేకపోవడంతో దానిని ఇతరాల్లో ఆర్బీఐ పేర్కొంది. దేశంలోకి వస్తున్న రెమిటెన్స్‌లో 46శాతం సొమ్ము, 3174 కోట్ల డాలర్లు అంటే… సుమారుగా 2,30,900 కోట్ల రూపాయిలు నాలుగు దక్షిణాది రాష్ట్రాలకే వస్తోంది. స్వదేశానికి ఎక్కువగా నగదు పంపుతున్న ఎన్‌ఆర్‌ఐల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులో, లేక ఇతర ఉన్నతస్థాయి ఉద్యోగులో ఉన్నారనుకుంటే పొరబడినట్లే. అధికశాతం రెమిటెన్సులు నైపుణ్యం లేని కార్మికుల నుంచే వస్తున్నాయి. ‘భారతదేశానికి అందుతున్న రెమిటెన్సుల్లో 53.5 శాతం గల్ఫ్‌ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్‌, కువైత్‌, ఒమన్‌ నుంచి అందుతోంది. ఇక్కడ పనిచేస్తున్న భారతీయుల్లో 90 శాతం మందికిపైగా పాక్షిక నైపుణ్యం లేదా నైపుణ్యం లేని కార్మికులే. అంటే భారతదేశానికి విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సుల్లో అధికశాతం నైపుణ్యం లేని కార్మికులు పంపేదే’ అని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. అత్యధికంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి 26.9 శాతం సొమ్ము దేశంలోకి వస్తోంది. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా… అమెరికా 22.9, సౌదీ అరేబియా 11.6, ఖతార్‌ 6.5, కువైత్‌ 5.5, ఒమన్‌ 3.0, బ్రిటన్‌ 3.0, మలేసియా 2.3, ఇతరదేశాల నుంచి 18.30 శాతం వస్తోంది. ఎన్‌ఆర్‌ఐలు పంపుతున్న రెమిటెన్స్‌ల్లో 59.2 శాతం మొత్తాన్ని కుటుంబ అవసరాల కోసం వినియోగిస్తున్నట్టు ఆర్బీఐ సర్వేలో వెల్లడైంది. 20శాతం నగదును బ్యాంకుల్లో డిపాజిట్లుగా దాచుకుంటుండగా, 8.3శాతం మొత్తాన్ని రియల్‌ ఎస్టేట్‌, షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడుతున్నారు. భారతదేశానికి డబ్బులు పంపుతున్న ఎన్‌ఆర్‌ఐల్లో 70.3 శాతం మంది 500 డాలర్లు అంతకు మించిన మొత్తాలను పంపుతుండగా 2.7 శాతం మంది 200 డాలర్లు అంతకన్నా తక్కువ మొత్తాలను పంపుతున్నారు. 200 నుంచి 500 డాలర్ల మధ్య నగదు పంపేవారు 27శాతం ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com