ప్రియాంక వాద్రాపై TNI కధనం

‘‘ప్రియాంకా లావో, కాంగ్రెస్‌ బచావో’’ – ఈ నినాదం కొంతకాలం క్రితం నుంచి కాంగ్రెస్‌ శ్రేణుల్లో అంతర్గతంగా నానుతోంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పేరిట అదిప్పుడు ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తోంది. ఆ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున స్టార్‌ క్యాంపెయినర్లుగా 40 మందితో కూడిన జాబితా సిద్ధం చేయగా అందులో ప్రియాంక పేరు చేర్చారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇదిలా ఉంటే ‘‘ప్రియాంక కంటే అందగత్తెలు ఎందరో ఉన్నా’’రంటూ బిజెపి నాయకుడు చేసిన కామెంట్‌కు నవ్వుతూనే దీటైన జవాబిచ్చి తోటి మహిళల్ని అందనంత ఎత్తున నిలిపిందామె.నాన్నమ్మ ఇందిరా గాంధీ పోలికలకి దగ్గరగా ఉండడం వల్లనో… రాజీవ్‌, సోనియా గాంధీల కూతురు కావడం వల్లనో మాత్రమే ప్రియాంకకు ఇంత పేరులేదు రాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోయినప్పటికీ పరోక్షంగా కాంగ్రె్‌సపార్టీ అంతర్గత వ్యవహారాల్లో చురుకుగానే పాల్గొంటున్నారు ప్రియాంక. ఆమె వ్యవహారశైలిని దగ్గరగా గమనించిన వారు ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఎన్నో ప్రతిపాదనలు తెచ్చినా ఆమె ఎన్నడూ ఆసక్తి కనబరచలేదు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవచ్చు. అదేంటంటే… 1999 ఎన్నికల్లో అమేథీ నుంచి తల్లి సోనియా మొదటిసారి పోటీచేసినప్పుడు ఆమె తరపున ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. అప్పుడు బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ ‘‘రాజకీయాల పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అయితే నన్ను ఈ దిశగా నడుపుతోంది ప్రజలే కాని రాజకీయాలు కాదు. రాజకీయాల్లో లేకపోతేనేం నేను ప్రజల కోసం పనిచేస్తాను’’ అని చెప్పారు. రాజకీయాల్లో చేరడం నాకు ఇష్టంలేదని కొన్ని వేలసార్లు ఆమె నోటి నుంచి విన్నప్పటికీ తల్లీ, సోదరుల నియోజకవర్గాలు రాయ్‌బరేలి, అమేథీలను ఆమె క్రమం తప్పకుండా పర్యటిస్తుంటారు. ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రజలతో మమేకమై మాట్లాడతారు. ఆ నియోజకవర్గాల్లో ఆమెకున్న ప్రజాదరణ చాలా ఎక్కువ. ఆమె ఎక్కడికి వెళ్లినా జనసందోహం తరలుతుంది. అందుకే కాబోలు అమేథీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ‘‘అమేథీ నుంచి పలుకుతున్న ఆహ్వానం ప్రియాంక కోసమే’’ అనే నినాదం మారుమోగుతుంటుంది. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తల్లికి క్యాంపెయిన్‌ మేనేజర్‌గా ఉంటూనే,అన్నయ్య రాహుల్‌ గాంధీ ప్రచారాన్ని సూపర్‌వైజ్‌ చేశారామె. ఈ ఎన్నికలప్పుడు జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ ‘‘రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయడమే. ఇప్పటికే నేనా పనిచేస్తున్నాను’’ అన్నారు. 2007లో జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షిస్తూనే… అమేథీ రాయ్‌బరేలిల్లోని పది సీట్ల మీద దృష్టి పెట్టారు. రెండు వారాలపాటు అక్కడే ఉండి సీట్ల కేటాయింపులో పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు తలెత్తకుండా సర్దుబాటుచేశారు. ఆమె ఎంత కష్టపడినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి అంతకుముందెన్నడూ లేని విధంగా 402 సీట్లలో 22 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రియాంకలోని ఆర్గనైజేషనల్‌ స్కిల్స్‌ అందరి దృష్టినీ ఆకర్షించాయి. అలాగే తమ ఖాతాల్లోకి ఎలా ఓట్లు తెచ్చుకోవచ్చో తెలిసిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారామె. ఎన్నికలప్పుడు ప్రచారకర్తగా ఉండడమే కాకుండా పార్టీలో జరిగే వ్యూహాత్మక చర్చల్లో పాల్గొనడం, ప్రచారం ఎలా ఉంటే బాగుంటుందనే అంశాల గురించి యోచించడం వంటివి చేస్తుంటారామె. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రతి సమావేశంలో ఉన్నతస్థాయిలో కీలక భూమిక వహిస్తున్నారామె. రాష్ట్ర స్థాయి రివ్యూ మీటింగ్‌లు ఆమె ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కొన్నిసార్లు కాంగ్రెస్‌కు సంబంధించి సీనియర్‌ నాయకులు ఎవరూ లేకపోయినప్పటికీ సమావేశాలకు ఆమే నాయకత్వం వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ఆ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌గాంధీ అధికారిక నివాస గృహం చిరునామాగా మారింది. ఇవన్నీ గమనిస్తే కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఎందరో ముఖ్య నాయకులకంటే ప్రియాంక గాంధీకి ఫాలోయింగ్‌ ఎక్కువ అనే విషయం అంగీకరించాల్సి వస్తుంది. దీంతోపాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకంజ వేయని తత్వం ఉన్న నాయకురాలు వచ్చిందనే వ్యాఖ్యలకు రాజకీయంగా ఆమెకి ఒక వేదిక ఏర్పడిందనే చెప్పొచ్చు. సమాజ్‌వాది, కాంగ్రెస్‌ పార్టీల కూటమి ఏర్పాటులో ప్రియాంక కీలక పాత్ర పోషించారట. ప్రియాంక ఇలా ఎంటర్‌ అవ్వడం ద్వారా కాంగ్రె్‌సకి మంచే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 105 సీట్లు ఉంటే ఎస్పీకి 298 సీట్లు ఉన్నాయి. అమేథీ, రాయ్‌బరేలి, చందౌలి, ఘజియాబాద్‌, సహరాన్‌పూర్‌లలో ఎన్నికల ప్రచారం చేస్తారు ప్రియాంక. ఇదిలా ఉంటే తల్లి ఆరోగ్యం బాగోలేక పోవడం వల్లనే ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టిందనేవారు లేకపోలేదు. ఆరోగ్య కారణాల రీత్యా 2018 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు అన్నకి సపోర్టు పిల్లర్‌గా నిల్చొన్న ప్రియాంక 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలి వేదికగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి విడత ఫిబ్రవరి 11 న మొదలై మార్చి 8న ముగుస్తాయి. మార్చి 11వ తేదీన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ప్రియాంక జనవరి 12, 1972న జన్మించారు. ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త రాబర్ట్‌ వాద్రాను హిందూ సంప్రదాయ పద్ధతిలో 1997 ఫిబ్రవరి 18వ తేదీన వివాహమాడారు. వీళ్లకి ఇద్దరు పిల్లలు. ప్రియాంక గాంధీ బౌద్ధతత్వాన్ని అనుసరిస్తారు. ఎన్‌ ఎన్‌ గోయెంకా దగ్గర నేర్చుకున్న విపాసనను ప్రాక్టీసు చేస్తారు.‘‘ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రియాంక స్టార్‌ క్యాంపెయినర్‌ అవుతుందని అనుకోవడంలేదు. ఎందుకంటే ఆమెకంటే అందంగా ఉన్న ప్రచారకర్తలు ఎందరో ఉన్నారు’’ అని బిజెపికి చెందిన వినయ్‌ కతియార్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక దీటుగా జవాబిచ్చారు. ‘‘బిజెపి మైండ్‌సెట్‌ ఎలా ఉంటుందో ఆయన మాటలు బహిర్గతం చేశాయి. బలమైన, ధైర్యంగల, అందమైన నా సహోద్యోగులు రాజకీయాల్లో నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, కష్టనష్టాలు ఓర్చి ఉంటారు. కాని అంతటి ధీశాలులైన ఆడవాళ్లలో అందాన్ని మాత్రమే చూస్తున్నారంటే వాళ్ల ఆలోచనలు చూసి నాకు నవ్వొస్తోంది’’ అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com