చికాగో కాన్సులేట్‌లో పాస్‌పోర్టు సేవలు ప్రారంభం

పాస్‌పోర్ట్‌ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. పాస్‌పోర్ట్‌ విధానాలను సరళతరం చేయడమే కాకుండా పాస్‌పోర్ట్‌ సేవలను ప్రజల చెంతకే తీసుకువచ్చినట్టు స్పష్టం చేసింది. భారత్‌లోని అన్ని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లలో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అందులో భాగంగా ఇప్పటివరకు 236 పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని.. మరికొన్ని సేవా కేంద్రాలు కూడా త్వరలో వినియోగంలోకి రానున్నాయని తెలిపింది. దేశంలో ఉన్న పాస్‌పోర్ట్‌ ఆఫీసులు, గతంలో ఉన్న పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలను కలుపుకుంటే.. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నపాస్‌పోర్ట్‌ కార్యాలయాల సంఖ్య 365కు చేరిందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో, కాన్సులేట్‌లలో పాస్‌పోర్ట్‌ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపింది. అందులో భాగంగా తొలుత లండన్‌లోని భారత్‌ హైకమిషన్‌ కార్యాలయంలో ఈ ప్రోగ్రామ్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టి.. ఆ తర్వాత బర్మింగ్‌హామ్‌, ఎడిన్‌బర్గ్‌లలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయాల్లో దీనిని విజయవంతంగా చేపట్టినట్టు పేర్కొంది. యూఎస్‌ విషయానికి వస్తే.. వాషింగ్టన్‌ లోని భారత రాయబార కార్యాలయంలో, న్యూయార్క్‌, శాన్‌ఫ్రానిస్కో, అట్లాంటా, హోస్టన్‌లలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయాలలో ఈ పోగ్రామ్‌ను చేపట్టినట్టు ప్రకటించింది. చికాగోలో ప్రారంభించిన పాస్‌పోర్ట్‌ సేవా కార్యక్రమం ద్వారా అక్కడి ఎన్‌ఆర్‌ఐలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపింది. ఈ నూతన పద్దతిలో ప్రజలు సులువుగా దరఖాస్తులు సమర్పించడమే కాకుండా, డిజిటల్‌ పరిశీలన, భద్రతోపాటు అప్లికేషన్‌ ట్రాకింగ్‌ కూడా అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో అన్ని భారత రాయబార కార్యాలయాల్లో పాస్‌పోర్ట్‌ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com