అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ మరణించిన సంగతి తెలిసిందే. అమెరికా జాతీయ జెండా కప్పి ఉంచిన శవ పేటిక పక్కన ఆయన పెంపుడు శునకం దీనంగా పడుకొని ఉన్న ఫొటో నెటిజన్లకు కన్నీరు పెట్టిస్తోంది. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేసిన హెచ్.డబ్ల్యూ.బుష్ శుక్రవారం మరణించారు. లాబ్రడార్ జాతికి చెందిన సల్లీ అనే శునకం రక్షణ నిమిత్తం ఆయనతో పాటే ఇంట్లో ఉండేది. అయితే రెండు సంవత్సరాల వయసున్న ఈ శునకం బుష్ శవపేటికను విమానంలో తరలించే సమయంలో దాని పక్కనే దిగాలుగా పడుకొంది. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోను చూసిన నెటిజన్లు ఉద్వేగానికి గురయ్యారు. 2009లో హడ్సన్ నది మీదుగా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. వెంటనే ఆ విమాన పైలట్ సల్లీ చురుగ్గా స్పందించి విమానాన్ని ప్రమాదం నుంచి తప్పించి, 155 ప్రయాణికులను కాపాడారు. అతని పేరునే ఈ శునకానికి పెట్టారు. దాన్ని ప్రత్యేకంగా 41వ అధ్యక్షుడి కోసమే తెప్పించారు. సీనియర్ బుష్ మరణంతో సల్లీని కొత్త ఇంటికి తరలించారు. అక్కడ భద్రతా దళాలతో కలిసి పనిచేయనుంది. ‘ఆ శునకాన్ని మేమెంతో కోల్పోతున్నాం. మాకు అందించిన ఆనందాన్నే కొత్త ఇంట్లోను పంచాలి’ అని సీనియర్ బుష్ కుమారుడు మాజీ అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ.బుష్ పోస్ట్ చేశారు. ‘బలవంతంగా మరో ప్రాంతానికి తరలిస్తే తప్ప ఓ శునకం తన యజమానిని వదిలిపోదు. నిఘా కోసం దానికి శిక్షణ ఇచ్చారు. ఇప్పుడదే చేస్తుంది’, ‘నిజంగా కన్నీరొస్తుంది. ఎప్పటికీ నిలిచి ఉండే స్నేహానికి ఈ ఫొటో గుర్తు’, ‘ఇప్పటికీ తనకు చెందిన వ్యక్తి గురించి జాగ్రత్త తీసుకుంటోంది’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.