కాల్చి పారేయమన్న కలెక్టర్

ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లోకి నిబంధనలు ఉల్లఘించి ఎవరైనా ప్రవేశించాలని చూస్తే కాల్చివేయాలంటూ రేవా జిల్లా కలెక్టర్‌ సూచించినట్లు ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఆమె గది బయట ఉన్న భద్రతా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వివాదాస్పదంగా మారిన ఈ వీడియోపై మధ్యప్రదేశ్‌ ఎన్నికల ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నవంబరు 28న మధ్యప్రదేశ్‌(ఎంపీ) అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఈ వీడియో బయటకు వచ్చింది. అదికాస్తా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ వివాదాస్పద వీడియోలో రేవా కలెక్టర్ ప్రీతి అక్కడి సిబ్బందికి సూచనలు చేస్తూ కనిపించారు. ‘ఈ ఘటనపై నివేదిక కోరాం. భారత ఎన్నికల సంఘానికి పంపనున్నాం’ అని చీఫ్ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ వీఎల్ కాంతారావు మీడియాకు తెలిపారు. ఎన్నికల సమయంలో సంబంధిత జిల్లాకు కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. ఆ జిల్లా ఎన్నికల ప్రక్రియను వారే పరిశీలిస్తారు. అభ్యర్థులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్న భద్రతను కలెక్టర్ పరిశీలించే సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ‘నా కెరీర్‌ను ఇబ్బందుల్లో పెట్టుకోను. మీరు అతడిని నమ్మండి(గార్డ్ వైపుకు తిరిగి). నీ మాట వినకుండా, నిబంధనలను ఉల్లంఘించిన వారిని కాల్చివేయ్‌’ అని అందులో కలెక్టర్‌ అభ్యర్థులు, గార్డ్‌ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరో ఘటనలో..ఈవీఎంల భద్రతపై ఇప్పటికే ఒకవైపు విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, సత్నా జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్ ప్రహరీ గోడను ఎస్‌యూవీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో గోడ కొద్దిమేర ధ్వంసమైంది. ఆ ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ వాహనాన్ని సీజ్‌ చేశారు. నవంబరు 30న కూడా సత్నా జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్ గోడ కొద్దిమేర పగిలిపోయి కనిపించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com