భారత మహిళల జట్టు కోచ్‌గా రమేష్ పొవార్‌ను కొనసాగించాలని కోరుతూ టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బీసీసీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. జట్టులో కోచ్ పాత్రను పెంచడానికి హర్మన్ ప్రయత్నిస్తోందని అన్నాడు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసి ముందుకు సాగాలని సూచించాడు. ‘పొవార్ కోచ్‌గా లేని సమయంలో టీమిండియా వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. టైటిల్ కూడా గెలిచేది. ఈ విషయాన్ని హర్మన్‌ప్రీత్ గుర్తుంచుకోవాలి. పొవార్‌ను కోచ్ పదవి నుంచి తీసేస్తే, అక్కడి నుంచి కొత్తగా మొదలు పెట్టాలి. అంతేగాని కోచ్ పదవీ కాలాన్ని పెంచుకుంటూ పోకూడదు’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ‘టీ20 కెప్టెన్‌గా, వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా పొవార్‌ను కోచ్‌గా కొనసాగించాలని కోరుతున్నాను. ఆయన జట్టులో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఆయణ్ని మరొకరితో భర్తీ చేయడం కష్టం. టీ20 ప్రపంచ కప్‌కు మరో 15 నెలల సమయమే ఉన్నందున, ఈ సమయంలో కోచ్‌ను మార్చడం సరైన నిర్ణయం కాదు’ అని హర్మన్ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. టీ20 జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సైతం కోచ్‌ను కొనసాగించాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాసింది.