వడ్డీలు ఎవడు కడతాడు?

బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాలకు సంబంధించి అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తానని విజయ్‌ మాల్యా ప్రకటించారు. ఇదే సమయంలో ఇంచుమించు అసలుతో సమానంగా ఉన్న వడ్డీ సంగతిని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ‘దయచేసి బకాయిలు తీసుకోండి’ అంటూ బ్యాంకులు, భారత ప్రభుత్వానికి మాత్రం ట్వీటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాను ఎగవేతదారు కాదని మాల్యా చెబుతున్నారు. ‘బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని పారిపోయానని, నేను ఓ ఎగవేతదారునని మీడియా, రాజకీయ నాయకులు పదేపదే చెబుతున్నారు. ఇదంతా అబద్ధం. రుణాల చెల్లింపుల కోసం కర్ణాటక హైకోర్టు ముందు నేను రాజీ ప్రస్తావన తెచ్చాను. దాని గురించి ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు’ అని మాల్యా ట్వీట్‌ చేశారు. మరిన్ని ట్వీట్లలో.. ‘విమాన ఇంధన ధరలు ఎక్కువగా ఉండటంతో విమానయాన సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌ కూడా అలాంటి సమస్యల్లోనే చిక్కుకుంది. చాలా నష్టాలను చవిచూసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బు కూడా పోగొట్టుకున్నాం. కానీ నేను తీసుకున్న అసలు మొత్తాన్ని మాత్రం పూర్తిగా చెల్లిస్తానని చెబుతున్నా. దయచేసి తీసుకోండి. యూబీ మూడు దశాబ్దాల పాటు భారత్‌లోనే అతిపెద్ద మద్యం విక్రయాల సంస్థగా పేరొంది. దేశ ఖజానాకు రూ.వేల కోట్లు చెల్లించాం. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా కూడా రాష్ట్రాలకు చాలా మొత్తమే చెల్లించాం. బాగా నడిచిన ఎయిర్‌లైన్‌ నష్టాల్లో కూరుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. అయినా కూడా ఇప్పటికీ నేను డబ్బు చెల్లిస్తాననే చెబుతున్నా. ఎందుకంటే అది ప్రజల డబ్బు. దయచేసి ఆ బకాయిలు తీసుకోవాలని బ్యాంకులు, ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని మాల్యా చెప్పుకొచ్చారు. విజయ్‌ మాల్యా 2016లో రూ.4,000 కోట్లు చెల్లిస్తానంటూ న్యాయస్థానాల ఎదుట ప్రతిపాదన పెట్టారు. అప్పట్లో భారతీయ బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్న రుణాల మొత్తం కంటే ఇది చాలా తక్కువ. బ్యాంకర్ల కన్సార్టియం మాత్రం రూ.4,900 కోట్లు అయిన చెల్లిస్తే అసలు వస్తుందని అప్పట్లో తెలిపింది. కానీ మాల్యా రూ.2,000 కోట్లు ఒకసారి మిగిలిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం మరోసారి చెల్లిస్తానని చెప్పారు. అప్పటికే మాల్యా చెల్లించాల్సిన మొత్తం వడ్డీలతో సహా కలిపి దాదాపు రూ.9,000 కోట్లు వరకు ఉంటుంది. అంటే మిగిలిన రూ.5,000 కోట్లను బ్యాంకులు వదులుకోవాల్సిందేనా. కనీసం అసలు మొత్తాన్ని కూడా ఆయన ఇచ్చేందుకు అప్పట్లో ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది మొదట్లో కర్ణాటక హైకోర్టు ఎదుట యునైటెడ్‌ బ్రూవరీస్‌ సంస్థ మరో ప్రతిపాదన తీసుకొచ్చింది. దాదాపు రూ.13,900 కోట్లు విలువైన యూబీ ఆస్తులను ప్రభుత్వ పర్యవేక్షణలో విక్రయించి రుణాలు చెల్లిస్తానని ప్రతిపాదించాడు. కానీ హైకోర్టు మాత్రం ఎస్‌బీఐకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతోపాటు యుకే హైకోర్టులో కూడా మాల్యాకు చుక్కెదురైంది. దీంతోపాటు అతన్ని భారత్‌కు అప్పగించే విషయమై యుకే న్యాయస్థానంలో డిసెంబర్‌ 10న తీర్పు వెలువడనుంది. దీనిలో కూడా మాల్యాకు వ్యతిరేకంగా తీర్పురావచ్చని భావిస్తున్నారు. ఒక వేళ అదే జరిగితే ఆయన్ను భారత్‌ తీసుకొచ్చేందుకు ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌లో జైలును కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు యుకే న్యాయస్థానానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌లో తనపై సానుభూతి పెంచుకొనేలా చేసిన ట్వీట్లలో పొరబాటున కూడా వడ్డీ ఊసు ఎత్తకపోవడం గమనార్హం. వేలకోట్ల రూపాయాల ప్రజాధనాన్ని ఏళ్లకేళ్లు వాడుకొని వడ్డీ చెల్లించకపోయినా నూరుశాతం బకాయిలు చెల్లించినట్లు ఎలా అవుతుందనే విషయాన్ని బిజినెస్‌ టైకూన్‌ అయినా మాల్యానే వివరించాలి. 2016లో మాల్యా దేశం విడిచి లండన్‌ వెళ్లిపోయారు. అయితే అతడిపై మనీలాండరింగ్‌ కింద కేసు నమోదవడంతో గతేడాది లండన్‌ పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న మాల్యా.. భారత్‌లో కోర్టు అధీనంలో ఉన్న తన ఆస్తులను ఇచ్చేస్తే వాటిని విక్రయించి బకాయిలు చెల్లిస్తానని గతంలో పలుసార్లు చెప్పారు. అయితే దర్యాప్తు సంస్థలు అందుకు అంగీకరించలేదు. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై అక్కడి వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై న్యాయస్థానం తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మాల్యా వరుస ట్వీట్లలో తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com