అగస్టా వెస్ట్‌ల్యాండ్ ముడుపుల కేసులో కీలక నిందితుడు క్రిస్టియన్ మిచెల్‌ను అధికారులు విజయవంతంగా భారత్ రప్పించడంతో… ఇక ఇప్పుడు అందరి దృష్టి యూకేలో తలదాచుకుంటున్న ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాపై పడింది. యూఏఈ ప్రభుత్వం మిచెల్‌ను భారత ప్రభుత్వానికి అప్పగించిన నేపథ్యంలోనే మాల్యా ‘‘దారికొస్తున్నాడంటూ’’ విమర్శలు రావడంతో ఇవాళ ఆయన మరోసారి ట్విటర్లో స్పందించారు. మిచెల్ పేరు ప్రస్తావించకుండా అతడి అప్పగింతకు, తన రాజీ ఆఫర్‌కు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.‘‘నా అప్పగింత నిర్ణయంతో లేదా దుబాయ్ అప్పగింత నిర్ణయంతో… రాజీ కోసం నేను ఇచ్చిన ఆఫర్‌ను విమర్శకులు ఎలా ముడిపెడుతున్నారో అర్థం కావడం లేదు. భౌతికంగా నేను ఎక్కడ ఉన్నా నా విజ్ఞప్తి ఇదే.. ‘‘దయచేసి డబ్బులు తీసుకోండి’’. నన్ను దొంగలాగా చూపించింది చాలు. ఇక ఈ ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్నాను…’’ అని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు.