నేత్రపర్వంగా అమ్మవారి బ్రహ్మోత్సవం–ఆధ్యాత్మిక వార్తలు

1.నేత్రపర్వం అమ్మవారి బ్రహ్మోత్సవం –తదితర ఆద్యాత్మిక వార్తలు
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ఉ. 8.30 నుంచి 8.50 మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. అంతకుముందు ధ్వజస్తంభంపై ఉన్న గజ ప్రతిమకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం గజ పటానికి ప్రత్యేక పూజలుచేసి ధ్వజస్తంభంపైకి ఎగురవేయడంతో 9రోజులు జరిగే బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం అమ్మవారికి మొదటి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. రాత్రి అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించారు.
2. ద్వారకా తిరుమలలో తొలి గిరి ప్రదక్షిణ
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో తొలిసారిగా గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఈ నెల 17న సాయంత్రం 2.30 గంటలకు (ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముందు రోజు) ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 10 కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు చెప్పారు.
3. శబరిమలకు వెళ్తున్నారా? -‘స్వైన్ ఫ్లూ’ పట్ల జాగ్రత్త
శబరిమలకు వెళ్లే రాష్ట్ర భక్తులు స్వైన్ఫ్లూ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సూచించింది. అక్కడకు తరలివెళ్లే భక్తులు లక్షల్లో ఉంటున్నందున వేగంగా వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి బాధితులు తగ్గే వరకు శబరిమలకు వెళ్లే విషయమై పునరాలోచన చేయడం మంచిదని సూచించింది. ముఖ్యంగా రక్తపోటు, చక్కెరవ్యాధి, గుండె జబ్బులు, శ్వాస సంబంధిత రుగ్మతలు ఉన్నవారికి ‘స్వైన్ఫ్లూ’ వైరస్ సోకే అవకాశం ఉందని పేర్కొంది. శబరిమల ప్రయాణంలో భక్తులకు ఆ వైరస్ సోకితే వెంటనే కేరళ ప్రభుత్వ వైద్య శిబిరాల్లో సేవలు పొందాలని సూచించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీచేసింది.
4. వెంకన్నకు కృష్ణమ్మ సేవ
…ఇక్కడ వేంకటేశ్వరుడి సేవలో ప్రతీది ప్రత్యేకమే. పూజారుల నుంచి సమర్పించే నైవేద్యం దాకా అంతా ఆసక్తికరమే. అడుగడుగునా ఆశ్చర్యపరిచే ఆచారాలకు నెలవు ఈ ఆలయం. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో కొలువై ఉన్న కురుమూర్తి శ్రీనివాసుని ఆలయం ప్రత్యేకతలివి…స్కాంద పురాణం ప్రకారం కుబేరుని అప్పుతీర్చలేక శ్రీనివాసుడు సతీసమేతంగా తిరుమల నుంచి బయలుదేరి మార్గం మధ్యలో ఇక్కడి కాంచన గుహలో సేదతీరాడని చెబుతారు. పాదుకలు లేకుండా ఉన్న శ్రీవారిని చూసి కృష్ణమ్మ పాదుకలను సమర్పించిందని అప్పటి నుంచి ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నట్లు వివరిస్తారు.
*ఇక్కడా ఏడు కొండలు
ఆ తిరుమలేశునికి ఏడుకొండలు ఉన్నట్లే ఇక్కడా శ్వేతాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, గణాద్రి, భల్లూకాద్రి, పతాకాద్రి, దేవతాద్రి అని ఏడుకొండలు ఉన్నాయి. ఇక్కడ కూడా శ్రీవారి పాద చిహ్నం ఉండడం, విఘ్నేశ్వరాలయం లేకపోవడం వల్ల దీన్ని తెలంగాణ తిరుపతి అని పిలుస్తారు. స్వామివారు గుహలో కురుమూర్తి పేరుతో వెలిశారు. గుహ ఆకారం దెబ్బతినకుండా నైపుణ్యంతో ఆలయాన్ని తీర్చిదిద్దారు.
*అందరి దేవుడు
మనుషులందరూ సమానమే అన్న భావనకు నిదర్శనమీ ఆలయం. ఇక్కడ స్వామివారి సేవచేసే వారు వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారుంటారు. ఆలయ సముదాయంలో ఉన్న చెన్నకేశవునికి పూజలు నిర్వహించేవారి దగ్గర నుంచి వాహన సేవల్లో పాల్గొనేవారు, కొండపై దీపం వెలిగించే వారి వరకు అందరూ వేర్వేరు కులాలకు చెందిన వారే.
*అన్నం, పచ్చిపులుసు…
నైవేద్యంలోనూ ప్రత్యేకత ఉంది. అన్నం, పచ్చిపులుసు కుండలో తయారుచేసి భక్తులు స్వామివారికి సమర్పిస్తారు. దీనిని ‘దాసంగం’ అంటారు.
*మైమరిపించే ఉత్సవాలు
ఏటా దీపావళి అమావాస్య నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆఖరుదైన గరుడవాహనసేవ రోజు ‘ఉద్దాల ఉత్సవం’ ఘనంగా నిర్వహిస్తారు. అంటే స్వామివారికి పాదుకులను సమర్పించడం అన్నమాట. ఈ పాదుకలను వడ్డేమాన్ దళితులు వారం రోజులు ఎంతో నిష్ఠతో తయారు చేస్తారు. మద్యమాంసాలు ముట్టరు. ఉపవాస దీక్షలో ఉంటారు. రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్యమైన తోలుతో తయారుచేసి, అక్కడి నుంచి ఊరేగింపుగా స్వామి సన్నిధికి తీసుకువస్తారు. ఈ జాతరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తారు.
*చేరుకునేదిలా…
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి 50 కి.మీ.ల దూరంలో ఈ ఆలయం ఉంది. దీంతో హైదరాబాద్-బెంగళూరు జాతీయరహదారి 44కు ఆనుకొని ఉన్న కొత్తకోట నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. ప్రధాన గుడికి చేరుకోవడానికి కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉంది. ఘాట్ రోడ్డు సదుపాయం లేదు.
5. ఏడాది తర్వాత శ్రీవారి దర్శనభాగ్యం
శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఏడాది తర్వాత దర్శించుకునే భాగ్యం దక్కిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం మరోమారు సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాసంప్రోక్షణ అనంతరం శ్రీవారి ఆలయం సరికొత్తగా కనిపిస్తోందని, ముఖ్యంగా ఆలయ ధ్వజస్తంభాన్ని వీక్షించే భాగ్యం కల్పించారని ప్రశంసించారు. రంగనాయకుల మండపంలో శిల్పకళా సంపదను యాత్రికులు వీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారని, క్షేత్ర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గవర్నర్కు తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు.
6. పెద్ద శేషవాహనంపై ఊరేగిన తిరుచానూరు అమ్మవారు
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారు పెద్దశేషవాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా మువ్వగోపాలుడు రూపాన్ని ధరించి భక్తులకు కనువిందు చేశారు. రాత్రి అమ్మవారికి హంసవాహన సేవ జరిగింది. శ్రీపద్మావతీ దేవి వీణను చేతపట్టుకుని చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో సాక్షాత్కరించారు. గురువారం ఉదయం ముత్యపు పందిరి వాహనసేవ, రాత్రి సింహ వాహనసేవ జరగనుంది.
7. రామయ్య హుండీ ఆదాయం రూ.54 లక్షలు
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయం మొత్తం రూ.1,59,07,823 వచ్చింది. మొత్తం 36 హుండీల్లో 27 హుండీల లెక్కింపు గత నెల 29న నిర్వహించారు. అప్పు డు 27హుండీల ద్వారా రూ.1.05కోట్ల ఆదా యం వచ్చింది. ప్రధాన ఆలయంలో ఉన్న తొమ్మిది హుండీల లెక్కింపును బుధవారం దేవస్థానం అధికారులు నిర్వహించారు. ఇందులో రూ.54,07,823 ఆదాయం వచ్చింది. బంగారం 110 గ్రాములు, వెండి 800 గ్రాములతో పాటు పలు ఇతరదేశాల కరెన్సీ కాగా హుండీ లెక్కింపును స్థానిక చిత్రకూట మండపంలో నిర్వహించగా దేవస్థానం ఈవో టి. రమేష్ బాబు, ఏఈవో శ్రావణ్కుమార్ పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఈ ఆదాయం రెండునెలల 18రోజులకు సంబంధించినది.
8. 16 నుంచి శ్రీక్షేత్రంలో ధనుర్మాస సేవలు
విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో ఈనెల 16 నుంచి ధనుర్మాస సేవలు ప్రారంభం కానున్నాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు జనవరి 13 వరకు ‘పొహలి భాగొ’(పొంగలి) అర్పణమవుతుంది. ధనుస్సు సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు పురుషోత్తమునికి ప్రత్యేక(గోప్య) సేవలు జరుగుతాయి. ఉదయం 6.15 గంటలకు(నెలరోజులు) పొంగలి నైవేద్యమవుతుంది. 6.50 గంటలకు ఇది ఆనందబజారులో భక్తులకు అందుతుంది. పూరీ జగన్నాథుని ధనుర్మాసం ప్రసాదం ఆరోగ్యకరమైనది, ఔషధీయ గుణాల కలది. దీనికోసం ఏడాది కాలం నిరీక్షిస్తారు. మంగళవారం రాత్రి శ్రీక్షేత్ర సబ్‌ కమిటీ సమావేశం ఏర్పాటైంది. స్వామి ప్రత్యేక సేవలకు సంబంధించి కూలంకషంగా చర్చ జరిగింది. అనంతరం పాలనాధికారి ప్రదీప్తకుమార్‌ మహాపాత్ర్‌ విలేకర్లతో మాట్లాడుతూ ధనుర్మాసం నేపథ్యంలో నెలరోజుల పాటు తెల్లవారు జాము 3 గంటలకు ఆలయం తలుపులు తెరిచే సేవాయత్‌లు సేవలు నిర్వహిస్తారన్నారు. కాగా రాత్రి 11 గంటలకు పురుషోత్తముని పవళింపు సేవతో ప్రధాన ద్వారం మూతపడుతుందని, నిర్ణీత వేళల్లో ముగ్గురు మూర్తుల సేవలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
**త్వరలో ఆన్‌లైన్‌ దర్శన వ్యవస్థ
శ్రీక్షేత్ర యంత్రాంగం స్వామి దర్శనాలకు ఆన్‌లైన్‌ టిక్కెట్‌ సేవలు ప్రారంభించాలని ధ్యేయంగా పెట్టుకున్న సంగతి విధితమే. కాగా దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. పక్షం రోజుల్లో పూర్తి వివరాలు అధికారులు ప్రకటించనున్నారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ధరల నిర్ధారణకు సంబంధించి అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయ సమాచార శాఖాధికారి లక్ష్మీధర పూజాపండ బుధవారం మాట్లాడుతూ ఆనందబజారులో స్వామి ప్రసాదాల ధరల పట్టిక, ఆన్‌లైన్‌ టిక్కెట్ల వెల ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.
9. దుర్గగుడి మెమెంటో స్కాంలో పురోగతి
విజయవాడ దుర్గగుడి మెమెంటో కుంభకోణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మెమెంటోల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. ఇందులో నలుగురికి ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో మెమెంటోల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 1200 మెమెంటోలు కొనుగోలు చేసి 2వేల మెమెంటోలు కొనుగోలు చేసినట్లు బిల్లు పెట్టి అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఏఈవో అచ్యుతరామయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ సునీత, అక్కడ పనిచేసే సైదా, గోపీచంద్‌పై కేసు నమోదు చేశారు. వారిపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఈవో, సీనియర్‌ అసిస్టెంట్‌ను దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ సస్పెండ్‌ చేశారు.
10. శుభమస్తు
తేది : 6, డిసెంబర్ 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చతుర్దశి
(నిన్న ఉదయం 12 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ వరకు)
నక్షత్రం : అనూరాధ
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 36 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 36 ని॥ వరకు)
గము : సుకర్మము
కరణం : శకున
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 7 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 26 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు సాయంత్రం 5 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 26 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 10 గం॥ 14 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 58 ని॥ వరకు)(మద్యాహ్నం 2 గం॥ 41 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 25 ని॥ వరకు)
రాహుకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 29 ని॥ నుంచి మద్యాహ్నం 2 గం॥ 52 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 9 గం॥ 18 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 41 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 12 గం॥ 5 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 28 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 32 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యరాశి : వృచ్చికము
చంద్రరాశి : వృచ్చికము
11. అయ్యప్ప స్వాములకు ఏపీ ఆరోగ్య శాఖ హెచ్చరికలు!
దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉంటే ప్రయాణం వాయిదా వేసుకోండి
తగు జాగ్రత్తలు తీసుకున్నాకే వెళ్లిరావాలని సలహామండలం రోజులు మాలధారణ చేసి, శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుని వచ్చే స్వాములకు ఏపీ ప్రజారోగ్య శాఖ కొన్ని హెచ్చరికలు చేసింది. కేరళలో స్వైన్ ఫ్లూ అధికంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, లక్షలాది మంది భక్తులు వెళ్లే శబరిమలలో స్వైన్ ఫ్లూ వైరస్ త్వరగా వ్యాపిస్తోందని, భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఎవరికైనా జ్వరం, దగ్గు, గొంతునొప్పి ఉంటే, అవి తగ్గే వరకూ శబరిమలకు వెళ్లవద్దని, ఈ విషయంలో పునరాలోచించుకుని, అవి తగ్గిన తరువాత ప్రయాణం పెట్టుకోవాలని సూచించింది.కవేళ ప్రయాణంలో ఈ లక్షణాలు కనిపిస్తే, కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చింది. బీపీ, షుగర్, గుండె జబ్బులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్న భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, ప్రజారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
12. ముత్యపుపందిరిపై శ్రీ‌కృష్ణాలంకారంలో అల‌మేలుమంగ‌
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ‌కృష్ణుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశాడు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి ఈఓ శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్ ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com