Agriculture

పోలీసు స్టేషన్లలో రైతు డెస్క్

పోలీసు స్టేషన్లలో రైతు డెస్క్

రైతుల కోసం జిల్లాకో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ దిశ సేవాడెస్క్‌ మాదిరి రైతుల కోసమూ ఒక డెస్క్‌ ఏర్పాటుచేసి వాటన్నింటికి జిల్లా స్థాయి పోలీస్‌స్టేషన్‌ కిందికి తేవాలని అధికారులకు సూచించారు. ‘దిశ’ అమలు, పటిష్ఠానికి తీసుకున్న చర్యలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ‘రైతు భరోసా కేంద్రాలు- పోలీసులు అనుసంధానమై పనిచేయాలి. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి దేశంలోని చాలా ప్రాంతాలకు రైతులు వెళ్తారు. అక్కడ ఏదైనా ఇబ్బందులొస్తే చట్టపరంగా రక్షణ వ్యవస్థ నిలబడాలి. రైతులు మోసాలకు గురికాకుండా చూడాలి. ఎంత త్వరగా స్పందించి అండగా నిలుస్తామన్నదే ముఖ్యం. ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలనే విషయమై మేధోమథనం చేసి కార్యాచరణ రూపొందించండి’ అని సీఎం ఆదేశించారు.