Politics

నేడు యాప్ విడుదల చేయనున్న నిమ్మగడ్డ

నేడు యాప్ విడుదల చేయనున్న నిమ్మగడ్డ

ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పారదర్శకతకు పాతరేశారు. ఎన్నికల పర్యవేక్షణ పేరుతో గుట్టుచాటుగా ప్రైవేట్‌ యాప్‌ రూపొందించుకుని ఆ బండారం బయటపడకుండా ఉండేందుకు ప్రభుత్వం నుంచి భద్రతాపరమైన అనుమతులు తీసుకోకుండానే ఎన్నికలలో వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా రహస్యంగా ఉంచిన ఆ యాప్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ కూడా ఇదే విషయాన్ని మీడియాకు చెప్పారు. ఇప్పటివరకు యాప్‌ వివరాలు ఏమాత్రం వెల్లడించకుండా ఆయన గోప్యంగా ఉంచారు. యాప్‌ తయారు చేసింది ఎవరు? కంట్రోల్‌ కేంద్రం ఎక్కడుంది? ఎవరు పర్యవేక్షిస్తారు? సిబ్బంది ఎవరు? ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తారు? తదితర వివరాలు బహిర్గతం కాకుండా గోప్యత పాటించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పూర్తి పారదర్శకతతో జరగాల్సిన ఎన్నికలకు ఉపయోగించే యాప్‌ను అనుమతులు లేకుండానే ఆవిష్కరించేందుకు నిమ్మగడ్డ ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. మరోవైపు యాప్‌లో అందే సమాచారాన్ని తొలుత తాను మాత్రమే చూసి ఆ తర్వాత ఎంపిక చేసిన డేటానే జిల్లా కలెక్టర్లకు పంపేలా నిమ్మగడ్డ ఇప్పటికే లాగిన్‌ ఏర్పాట్లు చేసుకున్నారు.