కుంగుబాటు (డిప్రెషన్) నేరమూ కాదు, శాపమూ కాదు. వ్యక్తిగత వైఫల్యానికి చిహ్నమూ కాదు. అయినా కూడా చాలామంది కుంగుబాటు అనగానే బెంబేలు పడిపోతుంటారు. దీని గురించి చెప్పుకోవటాన్ని చిన్నతనంగా భావిస్తుంటారు. బయటకు తెలిస్తే నలుగురు ఏమనుకుంటారోనని చికిత్సకు వెనకాడుతుంటారు. ఇక కుంగుబాటును తగ్గించే మందుల (యాంటీడిప్రెసెంట్స్) విషయంలోనైతే లేనిపోని భయాలు, అపోహలు ఎన్నెన్నో. నిజానికి అవసరమైనప్పుడు కుంగుబాటు మందులు వేసుకోవటం తప్పనిసరి. వ్యాయామం, ధ్యానం, ప్రకృతి మధ్య గడపటం వంటి జీవనశైలి మార్పులు తాత్కాలికంగా మానసిక స్థితిని మెరుగుపరచొచ్చు. హుషారును కలిగించొచ్చు. అయితే మందులు వేసుకోవటం మాత్రం చాలా కీలకం. ఇవి మెదడులోని రసాయనాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తాయి. ఇలా కుంగుబాటు లక్షణాలు ప్రేరేపితం కాకుండా చేస్తాయి. కాబట్టి మందులు వేసుకోవటానికి సిగ్గుపడాల్సిన పనిలేదు. లేకపోతే సమస్య జటిలమై తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది. వైకల్యానికి దారితీస్తున్న కారణాల్లో కుంగుబాటు కూడా ఒకటని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంటుండటం గమనార్హం!
కుంగుబాటును మందులతో కుంగదీయండి
Related tags :