అరబిందో ఫార్మాపై అమెరికాలో కేసు

మలినాలు ఉన్న ‘ఇర్బెసార్టాన్’ ఏపీఐ ఔషధాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణతో అగ్రశ్రేణి ఔషధ సంస్థ అయిన అరబిందో ఫార్మాపై అమెరికాలోని ఫ్లోరిడా ఫెడరల్ న్యాయస్థానంలో పిటీషన్ (క్లాస్ యాక్షన్ సూట్) దాఖలైంది. దీంతో దేశీయ స్టాక్మార్కెట్లో అరబిందో ఫార్మా షేర్ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. గురువారం నాడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచీలు బాగా నష్టపోయాయి. దీనికి తోడు న్యాయవివాదం ఎదురుకావటంతో అరబిందో ఫార్మా షేరు ఇంకా నష్టపోయింది. బీఎస్ఈ (బాంబే స్టాక్ఎక్స్ఛేంజీ)లో క్రితం రోజు ముగింపు కంటే రూ.46.75 (5.87%) నష్టపోయి రూ.750 ముగింపు ధర నమోదు అయింది. ఎన్ఎస్ఈలోనూ 5.78% శాతం నష్టంతో రూ.750.38 ముగింపు ధరను నమోదు చేసింది. అరబిందో ఫార్మా కొద్దికాలం క్రితం 22 బ్యాచ్ల ఇర్బెసార్టాన్ ఔషధాన్ని మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించుకుంది. ఎన్డీఈఏ (ఎన్ నైట్రోసొడైథైలమైన్) అనే మలినాలు ఇందులో కనిపించటం దీనికి కారణం. అధిక రక్తపోటును అదుపు చేయటానికి వినియోగించే పలు ఔషధాల విషయంలో ఇటీవల కాలంలో ఇదే జరిగింది. హైదరాబాద్కే చెందిన మరొక ఔషధ కంపెనీ తాను విక్రయించిన వల్సార్టాన్ అనే ఔషధం బ్యాచ్లను వెనక్కి తెప్పించింది. ఇజ్రాయిల్, యూఎస్కు చెందిన అగ్రగామి జనరిక్ ఔషధ కంపెనీలైన తెవా ఫార్మాసూటికల్స్, మైలాన్ లేబొరేటరీస్ మనదేశంలోని కొన్ని ఔషధ కంపెనీల నుంచి సేకరించిన వల్సార్టాన్ ఏపీఐ విషయంలో ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి. ఫలితంగా కొన్ని బ్యాచ్ల ఔషధాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఇప్పుడు అరబిందో ఫార్మా ఏకంగా క్లాస్ యాక్షన్ సూట్ను ఎదుర్కొనాల్సి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడా ఫెడరల్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైనట్లు సమాచారం తెలియటమే కానీ, తనకు లీగల్ నోటీసు రాలేదని అరబిందో ఫార్మా స్పష్టం చేసింది. నోటీసు వచ్చిన తర్వాత పరిశీలించి సంబంధిత సమాచారాన్ని వెల్లడిస్తామని కంపెనీ ప్రతినిధి తెలియజేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com