తెలంగాణ పోలింగ్‌లో భారీగా ఓటేసిన ప్రముఖులు-చిత్రాలు


1. ఓటు వేసిన మంత్రులు
తెలంగాణలోని 119 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేశారు. మంత్రి హరీశ్రావు సిద్దిపేటలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబంతో కలిసి సొంత గ్రామం చింతమడకలో ఉదయం 11గంటల నుంచి 12గంటల మధ్యలో ఓటు వేస్తారని తెలిపారు.
2.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఓటు వేశారు.
3.కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
4.పర్వతగిరిలో ఎర్రబెల్లి దయాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
5.సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
6.హైదరాబాద్లోని కుందన్బాగ్ 104 పోలింగ్ బూత్లో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి దానకిశోర్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
7. ఓటు వేసిన గవర్నర్‌ దంపతులు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌, ఆయన సతీమణి సోమాజిగూడ, రాజ్ నగర్‌లోని ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రం పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజును సెలవుగా భావించకుండా… ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగింటుకోవాలని నరసింహన్‌ పిలుపునిచ్చారు. ఓటు వేసినప్పుడే సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశముంటుందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు..* కూకట్‌పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుహాసిని నాంపల్లి హుముయూన్‌ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
8.పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు-కొన్నిచోట్ల ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభం
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాంకేతిక సమస్యల కారణంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. దీంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు.
9. గచ్చిబౌలి హైస్కూలులో ఏర్పాటు చేసిన 374 పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. సమస్య పరిష్కారానికి గంట సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
10. యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవపురంలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో 7గంటలకు అధికారులు పోలింగ్‌ ప్రారంభించలేకపోయారు.
11.కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్‌ పోలింగ్‌ కేంద్రంలోనూ సాంకేతిక కారణాల వల్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు తహసీల్దార్‌ వనజారెడ్డితో వాగ్వాదానికి దిగారు.
12.హైదరాబాద్‌ జియాగూడ ఇందిరా నగర్‌లో 31,32 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.
13.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్పూర్‌లో బూతు నెంబర్ 103, 104లో అరగంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. విద్యుత్‌ సమస్యతో పోలింగ్ నిలిపివేయడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.
14.నల్గొండ సావర్కర్ నగర్‌లోని 127 పోలింగ్ కేంద్రంతోపాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ 6వ కేంద్రంలో ఏజెంట్లు లేక ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. పెద్దఅడిశర్లపల్లిలోని 253 పోలింగ్ కేంద్రంలో 8 గంటల వరకు పోలింగ్‌ ప్రారంభం కాలేదు. నడిగూడెంలో 259, దామరచర్ల మండలం బొత్తలపాలెంలో 203 బూత్ లు సహా ఆలేరు నియోజకవర్గంలోని రాఘవపురంలో 3 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. అటు సంస్థాన్ నారాయణపురంతో పాటు భువనగిరి 7వ కేంద్రంలో ఈవీఎంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
15. పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్‌ ఆలస్యమయింది. ఏడు గంటలకే ఓటర్లు బారులు తీరగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో చాలా సేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. మంథని 84వ కేంద్రంలో ఈవీఎం పనిచేయని విషయాన్ని ఓటర్లే రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 85వ కేంద్రంలో ఈవీఎంలు సాంకేతిక లోపంతో 45 నిమిషాలు దాటినా ప్రారంభం కాలేదు. 90వ కేంద్రంలో ఏజెంట్లు రాకపోవడం, మాక్‌ పోలింగ్‌ ఆలస్యం వల్ల పోలింగ్‌ ఆరగంట ఆలస్యమయింది. ఓటర్లు అసహనానికి గురయ్యారు.
16.14రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్‌
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు పలువురు ప్రముఖులు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్విటర్‌ ద్వారా పిలుపునిచ్చారు. వీరిలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వసుంధర రాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, రాజస్థాన్‌ పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ ఉన్నారు. ఉదయం 9గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 6.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వర్గాలు ప్రక0టించాయి.
17. ఓటు వేసిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఇవి రెడ్డి కాలేజ్‌లోని బూత్ నెంబర్ 161లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓట వేశారు. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి పద్మావతి కూడా ఓటు వేశారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌‌లో పోటీ చేస్తుండగా, ఆయన సతీమణి పద్మావతి కోదాడలో ఎన్నికల బరిలో ఉన్నారు.
18. శేరిలింగంపల్లి నియోజకవర్గం నానకరాంగూడలో బూత్ నెంబర్ 17లో ఓటు హక్కును వినియోగించుకున్న సినీ నటులు కృష్ణ, విజయ నిర్మల దంపతులు, నరేశ్, వేణు తొట్టెంపూడి.
19. పాతబస్తీలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ భద్రతను కట్టుదిట్టం చేసింది. సమస్యాత్మక కేంద్రాల వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు చార్మినార్ నియోజకవర్గంలో 12 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
20. ఆరోగ్యం సహకరించకున్నా ఓటు వేశా: రోశయ్య
తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య హైదరాబాద్‌ అమీర్‌పేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సనత్‌ నగర్ నియోజకవర్గం అమీర్‌పేట డివిజన్‌లోని రహదారులు భవనాలశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు హక్కును వినియోగించుకోవాలని అది మనందరి బాధ్యత అన్నారు. తనకు ఆరోగ్యం సహకరించకున్నా ఓటు వేశానన్నారు.
21. హైదరాబాద్‌ నగర ఓటరు సిగ్గుపడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ 3గంటల సమయంలో హైదరాబాద్‌లో కేవలం 35 శాతమే పోలింగ్‌ నమోదవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ ట్వీట్‌ పెట్టారు. ‘హైదరాబాద్‌కు ఏమవుతోంది? 3 గంటల సమయంలోనూ ఇంకా 35 శాతమే పోలైందా? నగర ఓటర్లు సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 56.17 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా మెదక్‌ నియోజకవర్గంలో 75.75శాతం పోలింగ్‌ నమోదు కాగా, యాకుత్‌పురాలో అత్యల్పంగా 32శాతం నమోదవడం గమనార్హం.
22. తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన తర్వాత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ రాత్రి 7గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సర్వే ఫలితాలను ఆయన వెల్లడించనున్నారు. తెలంగాణలో పోలింగ్‌ సరళిని బట్టే ఫలితాలు ఉంటాయని, 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారంటూ ఇటీవల లగడపాటి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. పూర్తి సర్వే ఫలితాలను ఆయన ఈ రోజు వెల్లడిస్తానని ఇది వరకే ప్రకటించారు.More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com