అంచనాలు తప్పుతాయా? తెరాసకు ముప్పు. పోలింగ్‌పై TNI కథనాలు

1. అనుకున్నట్లే ప‌వ‌నాలు వీచాయి.
కేసీఆర్ చెప్పిన‌ట్లే .. టీఆర్ఎస్ దూసుకెళ్లుతున్న‌ది. ఇవాళ జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో .. కారు జోరుకు బ్రేక్ లేద‌ని తేలింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ స‌ర్వే .. పింక్ పార్టీకే ప‌ట్టం క‌ట్టింది. అసెంబ్లీని ర‌ద్దు చేసి ప్ర‌జాతీర్పుకు వెళ్లిన కేసీఆర్‌కే జ‌నం జేజేలు కొట్టార‌ని ఆ ఛాన‌ల్ పేర్కొన్న‌ది.
2. తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 11న తెలంగాణతో సహా ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగితా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలైన్లో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం క‌ల్పించారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 69శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 67 శాతం న‌మోదైన‌ట్లు సమాచారం.
3. కొడంగల్కు అదనపు భద్రతా సిబ్బంది
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు శాంతిభద్రతల అదనపు డీజీ, నోడల్ అధికారి జితేందర్ వెల్లడించారు. అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. గురువారం డీజీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి స్థానిక పరిస్థితులకు తగినట్లుగా బందోబస్తు కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర బలగాలు, ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన భద్రతా సిబ్బందిని కలుపుకొని మొత్తం 93 వేల మందిని ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. హైకోర్టులో ఎంబీటీ పార్టీ పిటిషన్ నేపథ్యంలో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 8 శాసనసభ స్థానాల్లో అక్రమాలకు తావివ్వని విధంగా చర్యలు తీసుకున్నట్లు జితేందర్ తెలిపారు. ఎన్నికల విధులకు సంబంధించి కొందరు పోలీసులపైనా ఆరోపణలు వస్తున్నాయని, వారిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. డబ్బులు తీసుకెళ్తూ దొరికితే అభ్యర్థులపైనా కేసులు నమోదు చేస్తామని జితేందర్ వివరించారు.
4. 15కల్లా బీసీ ఓటర్ల జాబితాలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం బీసీ ఓటర్ల వివరాలను మరోసారి సేకరించనున్నారు. గ్రామాల్లో ఇంటింటి గణన ద్వారా బీసీ ఓటర్ల వివరాలను రాబట్టి.. ఈనెల 15న వారి తుది జాబితాలను జిల్లాల్లో ప్రచురిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను జనవరి 10లోగా నిర్వహించాలంటూ హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అసెంబ్లీ తాజా ఓటర్ల జాబితాలకు అనుగుణంగా పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చింది. బీసీల గణనను కూడా చేపట్టాల్సిందిగా కోర్టు చెప్పడంతో, బీసీ ఓటర్ల వివరాలను సేకరించాలని పంచాయతీరాజ్ శాఖ తాజాగా జిల్లాల కలెక్టర్లకు సూచించింది. తుది జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరిస్తుంది. ఇలా బీసీ ఓటర్ల వివరాల సేకరణకు భారత ఎన్నికల సంఘం అనుమతించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. బీసీ ఓటర్ల జాబితాలను ప్రచురించాక ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. మూడు నెలల క్రితం కూడా బీసీ ఓటర్ల వివరాలను సేకరించి రిజర్వేషన్ల ఖరారుకు సిద్ధమవుతున్న దశలోనే న్యాయపర వివాదాలు ఉత్పన్నమై ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎన్నికల సన్నాహాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
5. ఈసీ ఆదేశాలు పాటించాల్సిందే
ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ఉమ్మడి హైకోర్టు తేల్చిచెప్పింది. డీజీపీ ఆధ్వర్యంలోని పోలీసు బలగంతో పాటు కార్యనిర్వాహక వర్గం ఆ ఆదేశాలను అతిక్రమించరాదంటూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల సూచనలను, ఎవరైనా హాజరుకావాలంటూ వారిచ్చే ఆదేశాలను అధికారులు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆదేశాలను ఉల్లంఘించిన వారి వివరాలను సీల్డ్ కవర్లో అందజేయవచ్చని ఎన్నికల సంఘానికి తెలిపింది.
6. మధుయాస్కీని అడ్డుకున్న కొమిరెడ్డి వర్గీయులు
మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీని గురువారం రాత్రి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రామ్లు వర్గీయులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న మధుయాస్కీ మార్గమధ్యలో మెట్పల్లిలో ఆగారు. పట్టణంలోని రాజకళా మందిర్ థియేటర్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన కారును కొమిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామాలతో మధుయాస్కీ వాహనాన్ని పక్కన నిలిపి సమీపంలో ఓ నాయకుడి ఇంట్లోకి వెళ్లి వచ్చే లోపు ఆందోళనకారులు ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు.
7. తెరాసది రాజకీయ దివాలాకోరుతనం- కిషన్రెడ్డి
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలనే ఉద్దేశంతో తెరాస విచ్చలవిడిగా డబ్బు పంపిణీతో రాజకీయ దివాలాకోరుతనానికి పాల్పడుతోందని భాజపా నేత జి.కిషన్రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమంగా వసూలు చేసిన డబ్బును నీళ్ల మాదిరిగా ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల పనితీరుపై తెరాసకు విశ్వాసముంటే విచ్చలవిడిగా డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. తెరాస నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు దిల్లీ, అమరావతిల నుంచి తీసుకువచ్చిన డబ్బును ప్రజాకూటమి నేతలు విపరీతంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గురువారం హైదరాబాద్ బర్కత్పురలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తెరాస నేతలు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ‘మీరు ఓటెయ్యండి-పది మందితో ఓటు వేయించాలి’ అనే నినాదంతో ముందుకు సాగాలని యువతకు విజ్ఞప్తి చేశారు.
8. మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ మద్దతు
పార్టీ మద్దతు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికేనని కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా కూటమి ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మల్రెడ్డి రంగారెడ్డికే ఓటేయాలని అభ్యర్థించారు.
9. తెలంగాణలో భాజపాకు అధికంగా సీట్లు
తెలంగాణలో భాజపాకు ఎవ్వరూ ఊహించని విధంగా గతంలో కంటే అధికంగా సీట్లు వస్తాయని ఏపీలో ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, తెదేపా కూటమి అనైతికమన్నారు. ప్రజా కూటమికి భాజపా మద్దతు ఇవ్వదని చెప్పారు. తెరాసకు భాజపా మద్దతు ఇస్తుందా?లేదా? అనేది అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు రోజున తెదేపాకు చెందిన కొందరు తీవ్రమైన బాధలో కూరుకుపోతారని, సీఎం చంద్రబాబు కాంగ్రెస్తో కలవడం చారిత్రక తప్పిదమని చెబుతారని వివరించారు. ఏపీలో కాంగ్రెస్ను దూరం పెడతారన్నారు. విశాఖ భూకుంభకోణానికి సంబంధించిన సిట్ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే రూ.35కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.
10. తెదేపా నాయకులపై చర్యలు తీసుకోండి: తెరాస
కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో డబ్బులు పంపిణీ చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ తెదేపా నాయకులపై చర్యలు తీసుకోవాలని తెరాస డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు దండే విఠల్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. కూకట్పల్లిలో ఏపీ తెదేపా నేత జూపూడి ప్రభాకర్రావు అనుచరులు డబ్బుతో దొరికిన విషయాన్ని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. ప్రచార గడువు ముగిసినా పక్కరాష్ట్ర నేతలు తెలంగాణలో తిష్టవేయడం, డబ్బులు పంపిణీ చేయడంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
11. కల్వకుర్తిలో వంశీచంద్‌రెడ్డిపై దాడి
నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పోలింగ్ జరుగుతోన్న సమయంలో గ్రామానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణతో భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు తనపై రాళ్లతో దాడి చేశారని వంశీచంద్‌రెడ్డి తెలిపారు. స్వల్ప గాయాలతో ఆయన ఆమనగల్లు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
12. 3,478 కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌
‘ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. మూడు నెలలపాటు 60వేల మందిమి కష్టపడి పనిచేశాం. అందరూ ఓట్లు వేస్తేనే, మేం పడిన కష్టానికి విలువ ఉంటుంది’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ అన్నారు. ఆయన గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 10శాతం పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్నాం. 31 జిల్లాల్లో 3,478 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను నేరుగా సీఈసీ పర్యవేక్షిస్తుంది. మిగిలిన చోట్ల పోలింగ్‌ను రికార్డు చేస్తాం. వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొనేందుకు తొలుత వచ్చిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చాం. నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతాన్ని రెండు గంటలకోసారి విడుదల చేస్తాం. కొడంగల్‌లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశాం. ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిపడా ఉన్నాయి. 1300 అదనపు కంట్రోల్‌ యూనిట్లను తీసుకొచ్చాం. 113 నియోజకవర్గాలకు ఈవీఎం, వీవీప్యాట్లు చేరుకున్నాయి’ అని వివరించారు.
13. పల్లెకు ‘ఓటె’త్తిన జనం -ఏపీ నుంచీ తరలిన ఉద్యోగులు
తెలంగాణ పల్లెలు కళకళలాడుతున్నాయి.. సంక్రాంతి నెల రోజుల ముందే వచ్చినట్లు జనంతో గ్రామాలు కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలాది మంది తెలంగాణవాసులు ఓట్ల పండగకు తమ స్వస్థలాలకు బయల్దేరారు. అధికార, ప్రజాకూటమిలో మధ్య పోటాపోటీగా ఉండటం.. ప్రతి ఓటూ కీలకమే అని భావించిన కొందరు అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉంటున్న తమ నియోజకవర్గ ఓటర్లను గుర్తించి వారిని రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ జంటనగరాల నుంచి ప్రతిరోజు నడిచే 3,500 బస్సులకు అదనంగా తెలంగాణ జిల్లాలకు 1,200 బస్సులను నడుపుతోంది. హైదరాబాద్‌లో స్థిర నివాసముంటూ.. అమరావతిలో పని చేస్తున్న ఉద్యోగులు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏపీ సర్కారు ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది. దీంతో వారంతా గురువారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ బాట పట్టారు. విజయవాడ నుంచి వచ్చే రైళ్లు, బస్సులు కూడా కిటకిటలాడాయి.
14. ఓటు వేసేందుకు తెలంగాణకు తరలిన ఉద్యోగులు
తెలంగాణలో ఓటుహక్కు కలిగి ఏపీలో పనిచేస్తున్న అధికారులు దాన్ని వినియోగించుకునేందుకు తరలివెళ్లారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరారు. రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 15వేల మంది ఉద్యోగులకు తెలంగాణలో ఓటుహక్కు ఉంది.
15 జనగామలో ఉద్రిక్తత
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ ఓటు తొలిగించారని కొందరు బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, హన్మకొండ జాతీయ రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. బాధితుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అడ్డుకున్న పోలీసులతో బాధితులు వాగ్వివాదానికి దిగారు.
16. ఓటు హక్కు వినియోగించుకున్న హరీశ్‌రావు
తెలంగాణలోని 119 శాసనసభా నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వైపు అడుగులు వేశారు. మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేటలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబంతో కలిసి సొంత గ్రామం చింతమడకలో ఉదయం 11గంటల నుంచి 12గంటల మధ్యలో ఓటు వేస్తారని తెలిపారు.
17. గొల్లగూడెంలో ఓటు వేసిన తుమ్మల
రాజకీయ ప్రముఖులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఓటు వేశారు. సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి ఓటు వేయగా, హరీశ్‌రావు సిద్ధిపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
18. ఓటు హక్కు వినియోగించుకున్న ఎర్రబెల్లి
పర్వతగిరి మండలంలోని 244 పోలింగ్ కేంద్రంలో పాలకుర్తి తెరాస అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఎక్కడ ఉన్నా స్వస్థలమైన పర్వతగిరిలోని తన ఓటు హక్కు వినియోగించుకుంటానని ఆయన తెలిపారు. అలాగే, ఉప సభాపతి పద్మా దేవేందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్‌జిల్లా రామాయంపేట మండలంలోని కొనాయిపల్లిలో ఉదయం పోలింగ్‌ ప్రారంభం కాగానే ఓటు వేశారు.
19. శేరిలింగంపల్లిలో తెదేపా శ్రేణుల ఆందోళన
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెదేపా ఏజెంట్‌ను అధికారులు పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించలేదు. తెదేపా అభ్యర్థి ఏజెంటు భానుప్రసాద్‌ సంతకం బదులుగా శ్రీనివాసరావు సంతకం చేశారని లోపలికి పంపడం కుదరదంటూ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి.
20. కొడంగల్‌ ప్రశాంతంగా పోలింగ్‌
ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవటానికి భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువ ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. తెరాస అభ్యర్థి నరేందర్ రెడ్డి… కొడంగల్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకోవటానికి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారనీ.. గతంలో కంటే అధిక సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఉపాధి కోసం ముంబయి, బెంగళూరు పట్టణాలకు వెళ్లిన వారు సైతం అధిక సంఖ్యలో వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
21. ఓటు వేసిన సీఎం కేసీఆర్‌ దంపతులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్‌లో సైతం ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు.
22. 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌
తెలంగాణలో 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందుగానే పోలింగ్‌ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఐదు, ఖమ్మం జిల్లాలో ఐదు, వరంగల్‌ జిల్లాలో రెండు, కరీంనగర్‌ జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని ఎన్నికల సంఘం అధికారులు సమస్యాత్మక స్థానాలుగా గుర్తించి 4గంటలకే పోలింగ్‌ను ముగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
23. గెలుపు మనదే, విశ్వాసంతో వెళ్లండి
‘‘తెలంగాణ ప్రజలు ప్రజా కూటమికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు బాగా ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా వెల్లడైంది.అభ్యర్థులు విశ్వాసంతో ముందుకు వెళ్లాలి’’ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.గురువారం కాంగ్రెస్ సహా కూటమి పార్టీల అభ్యర్థులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన పలు అంశాలు ప్రస్తావించి, కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. పోలింగ్ రోజు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఉదయం నుంచే పోలింగ్పై పూర్తి దృష్టిసారించి పార్టీకి వచ్చే చివరి ఓటు వరకూ పోలయ్యేలా చూడాలని సూచించారు.
24.కూకట్ పల్లిలో గరంగరం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపద్యంలో నకిలీ ఓటర్ల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లు ఉన్నాయన్న వాదనకు బలం చేకూరుస్తూ కూకట్ పల్లి నియోజకవర్గంలోని భారత్ నగర్ లో ఒఅటర్లు జాబితాలో అక్రమాలు బయటపడ్డాయి. ఎవరులేని ఓ ఇంట్లో 68 మరో ఇంట్లో 72 ఓట్లు ఉండటం కలకలం రేపింది. ఈ ఇల్లు పాడుబడిపోయాయని వీటిలో ఎవరూ నివసించడం లేదని స్థానికులు తెలిపారు. ఇంతకూ ముందు ఇక్కడున్న వారు మరోచోట ఓటు నమోదు చేసుకున్నారా లేదా అనేది వెల్లడి కాలేదు. ఒకవేళ మరోచోట ఓటరుగా నమోదై ఉంటె ఈ ఓట్లను ఎందుకు తొలగించలేదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
25. పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాంకేతిక సమస్యల కారణంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గచ్చిబౌలి హైస్కూలులో ఏర్పాటు చేసిన 374 పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. సమస్య పరిష్కారానికి గంట సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవపురంలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో 7గంటలకు అధికారులు పోలింగ్ ప్రారంభించలేకపోయారు.కాగజ్నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ పోలింగ్ కేంద్రంలోనూ సాంకేతిక కారణాల వల్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు తహసీల్దార్ వనజారెడ్డితో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ జియాగూడ ఇందిరా నగర్లో 31,32 పోలింగ్ కేందా్రల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com