చిన్న తిరుపతిలో గిరి ప్రదక్షిణాలకు ఏర్పాట్లు

ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవారి గిరి ప్రదక్షిణను తొలిసారిగా ఈ ఏడాది నిర్వహించనున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముందు రోజున (ఈ నెల 17న) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆరు కిలోమీటర్ల మేర వేలాది మంది భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకొనేలా దేవస్థానం చర్యలు చేపట్టింది. దీనికి సుమారు 5 వేల మంది హాజరవుతారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.తమిళనాడులో అరుణాచలం, మన రాష్ట్రంలో సింహాచలం, అన్నవరం దేవస్థానాల్లో గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎంతో ఫుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే వేలాది మంది పోటీ పడి మరీ దీనిలో పాల్గొంటారు. ద్వారకాతిరుమల క్షేత్రంలో చినవెంకన్న మాలధారులు మాత్రమే ఏటా ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున గిరి ప్రదక్షిణలు చేసి ఆలయ ఉత్తరద్వారం గుండా శ్రీవారి నిజరూప దర్శనం చేసుకోవడం ఆచారంగా వస్తోంది. యాత్రికుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాలనే యోచనతో ఈ ఏడాది నుంచి మాలధారులతో పాటు సాధారణ భక్తులను సైతం గిరిప్రదక్షిణలో భాగస్వాములను చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ జరిగే దాదాపు ఆరు కిలోమీటర్ల మార్గానికి ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లు, తుప్పల తొలగింపు, రోడ్డు చదును చేసే పనులను ఇప్పటికే ప్రారంభించారు. భక్తులు పాదరక్షలు లేకుండానే ఈ మార్గంలో నడిచేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
**ఎంతో విశిష్టత..
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి ద్వారకాతిరుమల క్షేత్రంలో శేషాకృతిలో ఉన్న కొండపైన స్వయంభువుగా వెలిశారు. దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటి. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా తమ పాపాలను నశింపజేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని నమ్ముతున్నారు. అదే విధంగా శ్రీవారి ఆలయం నిర్మితమైన కొండ చుట్టూ ప్రదక్షిణకు కూడా ఎంతో విశిష్టత ఉందని.. దీనిని పూర్తిచేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు.
**మార్గం ఇలా..
ఈనెల 17న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ మెట్లపై హారతి వెలిగించి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. భక్తులు అక్కడి నుంచి బయలుదేరి దొరసానిపాడు, రాళ్లకుంట, శ్రీవారి పుష్కరిణి (మాధవానికుంట) మీదుగా తిరిగి శ్రీవారి ఆలయ మెట్ల వద్దకు చేరుకుంటారు. అనంతరం ఆలయంలో స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఈ వేడుక కనుల పండువగా జరగనుంది. శ్రీవారి ప్రచార రథం, గజలక్ష్మి (శ్రీవారి ఏనుగు), రెండు అశ్వాలు, కోలాట భజనలు ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు తెలిపారు.
**భక్తులకు సౌకర్యాలు
గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్యం అందించేందుకు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతారు. బీ భక్తులు మధ్యలో నడవలేక ఇబ్బంది పడితే వారిని తీసుకెళ్లేందుకు ఉచిత బస్సు కూడా వెంటే ఉంటుంది.బీ భక్తులకు, మాలధారులకు మార్గం మధ్యలో తాగునీరు అందించడంతో పాటు దాతల సహకారంతో పండ్లు పంపిణీ చేస్తారు.బీ యాత్ర మార్గం పొడవునా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తారు.
**పుణ్యకార్యం..
స్వామివారు స్వయంభువుగా వెలసిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎంతో పుణ్యకార్యం. ఈ ఏడాది తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముక్కోటి ఏకాదశి పవిత్రమైన రోజు. చినవెంకన్న మాలధారులు వివిధ ప్రాంతాల నుంచి ముందు రోజే శ్రీవారి క్షేత్రానికి చేరుకుంటారు. ఈనెల 17న జరిగే గిరి ప్రదక్షిణలో శ్రీవారి మాలధారులతోపాటు సాధారణ భక్తులు కూడా పాల్గొనే వెసులుబాటు కల్పించాం. గిరి ప్రదక్షిణ అనంతరం వారందరికీ స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తాం.
1.శ్రీశైల భ్రమరాంబాదేవికి బంగారు పళ్లెం కానుక
శ్రీశైల భ్రమరాంబాదేవికి గురువారం హైదరాబాద్కు చెందిన పి.వి.లక్ష్మీ ప్రతాప్రెడ్డి బంగారు పళ్లాన్ని కానుకగా సమర్పించారు. ఇది 700 గ్రాముల బరువు రూ.21,28,407 విలువ కలిగినట్లు దాత తెలిపారు. బంగారు పళ్లాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు. దాతకు ఆలయ అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
2. తలనీలాల ద్వారా తితిదేకు రూ.10.07 కోట్ల ఆదాయం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల విక్రయం ద్వారా తితిదేకు గురువారం రూ.10.07 కోట్ల ఆదాయం లభించింది. ప్రతినెలా మొదటి గురువారం తలనీలాలను ఈ-వేలం ద్వారా తితిదే విక్రయిస్తుంది. వివిధ రకాల వెంట్రుకలను విక్రయించడం ద్వారా ఈ ఆదాయం సమకూరింది.
*డయల్ తితిదే ఈవో రద్దు
తిరుమలలో ప్రతినెల మొదటి శుక్రవారం నిర్వహించే ‘డయల్ తితిదే ఈవో’ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఈసారి రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఫోన్ ఇన్ నిర్వహించలేకపోతున్నట్లు వివరించారు.
3. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జారీ నేడు
తిరుమల శ్రీవారికి మార్చి నెలలో నిర్వహించే ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు ఆన్లైన్లో సేవా టిక్కెట్లను తితిదే శుక్రవారం విడుదల చేయనుంది. మొత్తం 70,512 టికెట్లను ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం సేవలకు సంబంధించి 11,537 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి బుకింగ్కు నాలుగు రోజుల పాటు గడువు ఉంటుంది. అనంతరం భక్తులను ఎలక్ట్రానిక్ లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆన్లైన్లో నగదు చెల్లించాలి. కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవకు సంబంధించి 58,975 టిక్కెట్లను నేరుగా బుక్ చేసుకోవచ్చు. వీటికి లాటరీ విధానం ఉండదు.
4. మస్కట్లో రేపు లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
గల్ఫ్ దేశమైన ఒమన్లోని మస్కట్ దార్సేట్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయ సన్నిధిలో శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం జరగనున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
5. వైభవంగా కొండ మెట్ల దీపోత్సవం
విశాఖ జిల్లా పద్మనాభం క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీఅనంత పద్మనాభస్వామి కొండ మెట్ల దీపోత్సవం గురువారం వైభవంగా జరిగింది. అనంతుని గిరికి ఉన్న 1285 మెట్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన దీపాల్ని భక్తులు సాయంత్రం వెలిగించి పరవశులయ్యారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపూటి అశోక్గజపతి రాజు సతీసమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. తొలి దీపాన్ని వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. సుమారు 2.5 లక్షల మంది భక్తులు హాజరయ్యారని అంచనా.
6. ధర్మానిదే అంతిమ విజయం
‘మొదట్లో కష్టాలు ఎదురైనా చివరకు ధర్మానిదే అంతిమ విజయం. పవిత్ర హృదయాలతో మీరు చేస్తున్న పూజలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తాయి. తెలుగు ప్రజలందరి ముఖాల్లో అంతులేని ఆనందం చూడటమే నా అంతిమ లక్ష్యం. అందుకోసమే నా శ్రమ అంతా. త్వరలో నా ఆశయం సిద్ధిస్తుంది’ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి విజయవాడ ఇందిరాగాంధీ క్రీడామైదానంలో కోటి దీపోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోటి వత్తులతో ఏర్పాటు చేసిన దీపాన్ని వెలిగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంకేతికపరంగా ఎంతగా అభివృద్ధి చెందినా ప్రకృతితో అనుసంధానమై జీవించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షలు రాసే పిల్లల మాదిరిగా రాష్ట్రాభివృద్ధి కోసం తాను నిత్యం పరిపాలన, అభివృద్ధి అనే పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం సాధించని రీతిలో రెండంకెల అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి మన్మోహన్‌సింగ్‌, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ ఛైర్మన్‌ చుండూరి సీతారామాంజనేయప్రసాద్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య, కృష్ణా జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు సామూహికంగా దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తిని చాటారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com