మార్చిలోజాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
ముస్తాబౌతున్న సూర్యాపేట
మంత్రి జగదీష్ రెడ్డి స్థల పరిశీలన
సందర్శించిన జాతీయ కబడ్డీ అసోసియేషన్
మార్చినెలలో జరుపతలపెట్టిన జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు సూర్యాపేట ముస్తాబౌతుంది.జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు ఆతిధ్యం ఇస్తున్న సూర్యాపేటలో పోటీలు ఎక్కడ నిర్వహించాలనేది రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గురువారం ఉదయం స్థల పరిశీలన జరిపారు.జిల్లా కేంద్రంలోని ఎస్ పి కార్యాలయం అందుకు అనువైన వేదికగా నిర్ణయించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో కబడ్డీ పోటీల పై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశం నలుమూలల నుండి తరలి వస్తున్న క్రీడాకారులకు కావలసిన వసతి సౌకర్యాలతో పాటు పోటీలు జరుగుతున్న సమయంలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో రెండవ మారు జరుగుతున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల నిర్వహణలో ఎక్కడ లోపం లేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. యింకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్ పి భాస్కరన్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు రాష్ట్ర కార్యదర్శి కూడా అయిన జగదీష్ యాదవ్,ఆల్ ఇండియాకోచ్ జగన్మోహన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ గౌడ్,జిల్లా చైర్మన్ మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు రామచందర్ గౌడ్,కార్యదర్శి నామా నరసింహారావు లతో పాటు నంద్యాల దయాకర్ రెడ్డి,ఇమామ్,రమేష్ కుమార్ వెంకటేశ్వర్లు,రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.