గంట ఎందుకు కొట్టాలి?

1.ఆలయంలో గంట ఎందుకు మోగిస్తారు?
సాధారణంగా అన్ని దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వేలాడుతూ కనిపిస్తాయి. భక్తులు ఆలయంలోకి వెళ్లగానే గంట మోగించి ఆ తర్వాతే దేవుడి దర్శనానికి ఉపక్రమిస్తారు. అసలు ‘గంట ఎందుకు మోగిస్తాం?’ అనే విషయం చాలా మందికి తెలియదు. గంట మోగించడం ద్వారా వెలువడే శబ్దాన్ని మంగళకరమైన ధ్వనిగా పరిగణిస్తారు. ఇది విశ్వానికంతా భగవన్నామమయిన ‘ఓంకార’ నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని దర్శనం పొందడానికి బాహ్య అంతరాల్లో పవిత్రత ఉండాలి. అందుకే గంట మోగిస్తాం. వైదిక క్రియా పరంగా హారతి ఇచ్చే సమయంలో కూడా గంట మోగిస్తారు. ఇది కొన్ని సమయాల్లో మంగళకరమైన శంఖారావాలతోనూ మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది. భక్తి పారవశ్యత, అంతరంగ శాంతి, ఏకాగ్రతలకు భంగం కలిగించే అమంగళ, అసంగతమైన శబ్దాలూ, వ్యాఖ్యానాలూ భక్తుల చెవులకూ తద్వారా మనసుకూ చేరకుండా ఘంటానాదం సహాయపడుతుంది.
2. లక్ష్మీనారాయణుల ఆవాసం… మార్గశిరం
మంచుతెరలు దాటి వీనులవిందుచేసే విష్ణుసహస్రనామ పారాయణలూ, మోక్షానికి దారిచూపే ఉత్తరద్వార దర్శనాలూ, ఆస్తికుల లోగిళ్లకు పండగవాతావరణాన్ని తీసుకొచ్చే నోములూ వ్రతాలూ, కర్మయోగాన్ని వివరించే గీతాప్రవచనాలూ… ఇలా మార్గశిర మాసంలో కనిపించే ప్రతి దృశ్యమూ మనోహరమైందే. ఆధ్యాత్మిక శోభను నలుచెరగులా ఇనుమడింపజేసేదే. చాంద్రమానం ప్రకారం మృగశిర నక్షత్రంలో పౌర్ణమి వస్తుండడంతో ఈ మాసాన్ని మార్గశిరమాసం అంటారు. ‘మాసానాం మార్గశీర్షోహం…‘అర్జునా! మాసాల్లో మార్గశిరం నేను’’ అని స్వయంగా గీతాచార్యుడు ప్రకటించుకున్నాడు. అందుకే ఈ మాసాన్ని విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైందని చెబుతారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లో శ్రేష్ఠమైందీ తలమానికమైందీ మార్గశిరమే. ఈ మాసంలో వచ్చే ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించినా, లక్ష్మీనారాయణులను అర్చించినా, గీతాపారాయణ చేసినా, కాలభైరవుడిని పూజించినా… మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం.
***రోజూ ప్రత్యేకమే…
మనిషిని భగవంతుడికి దగ్గరగా చేర్చేవీ, మంచి ఆలోచనలను ప్రేరేపించేవీ వ్రతాలూ పూజలూ. ఆ ప్రకారం… లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతి ఘడియా శుభప్రదమైందే. ప్రతిరోజూ విశేషమైందే. శుక్లపక్ష పాడ్యమి రోజు నదీ స్నానం చేసి దీపాలు వదలడం శ్రేష్ఠమని చెబుతారు.
తదియనాడు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. అందుకే మార్గశిరం మాధవుడికేకాదు మహేశ్వరుడికీ ప్రీతికరమైనదంటారు. శుద్ధ పంచమిని నాగపంచమిగా వ్యవహరిస్తారు. పగలనకా రాత్రనకా చేట్టూచేమల్లో తిరిగే తమ పిల్లలను కాపాడమంటూ నాగేంద్రుడిని పూజిస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం. లోకకంటకుడిగా మారిన తారకాసురుడిని స్కందుడు అంతమొందించింది కూడా ఈ రోజే. రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించినవారికి ఉత్తమమైన సంతానం లభిస్తుందని చెబుతారు. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి. కాలభైరవుడు అవతరించిన రోజు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ విశ్వేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తుల పాపపుణ్యాలను స్వయంగా లెక్కచూస్తుంటాడంటారు. కాలభైరవ స్వరూపమైన శునకాన్ని ఈ రోజు పూజించి, గారెలు దండగుచ్చి **వేస్తారు.ముక్కోటి ఏకాదశి
శుక్లపక్ష ఏకాదశినే మోక్షదా ఏకాదశీ, సౌఖ్యదా ఏకాదశీ అని కూడా అంటారు. ఆ రోజు వైకుంఠం ద్వారాలు తెరుచుకోవడంతో ముక్కోటి దేవతలూ శ్రీహరి దర్శనానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనికూడా అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం పరిపాటి. సంవత్సరం పొడవునా ప్రతి ఏకాదశికీ ఉపవాసం ఉండలేని వాళ్లు ముక్కోటి ఏకాదశి ఒక్కరోజైనా ఉపవాసం ఉంటే చాలు మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు అన్ని దేవాలయాల్లో జరిపే ఉత్తరద్వార దర్శనాలు అత్యంత శుభప్రదమైనవి. శ్రీకృష్ణపరమాత్మే స్వయంగా గీతామకరందాన్ని మానవాళికి అందించింది కూడా ఈ రోజే. సులభమైన పద్ధతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని ఇందులో వివరించాడు కృష్ణుడు. కర్మయోగం, భక్తియోగాలను తెలిపి జగత్తును జాగృతం చేశాడు.ఆ రోజు గీతాపారాయణ చేయడానికి అవకాశంలేనివాళ్లు భగవద్గీతలోని కనీసం పద్దెనిమిది శ్లోకాలనైనా పఠించాలని చెబుతారు. శుద్ధ నవమి రోజున త్రిరాత్రి వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. ఆ రోజు దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో స్వామిని ఆరాధిస్తారు.
శుద్ధ త్రయోదశిరోజున హనుమద్ వ్రతం చేయాలని చెబుతారు పండితులు. సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడు హనుమద్ వ్రతాన్ని ఆచరించిన తర్వాతే హనుమంతుడి సహాయాన్ని పొందాడన్న కథనం ప్రచారంలో ఉంది. మార్గశిర శుద్ధ పూర్ణిమ దత్తజయంతి. దీన్నే కోరల పూర్ణిమ, నరక పూర్ణిమ అని కూడా అంటారు. ఆ రోజు అగ్ని పురాణాన్ని దానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయంటారు. త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి అంశగా జన్మించిన దత్తుడు మౌనముద్రతోనే లోకానికి ఉపదేశంచేసి జగద్గురువయ్యాడు. అందుకే ఆ రోజు దత్తచరిత్రను పారాయణచేసి ఆయన్ను స్మరించుకుంటారు. వీటితోపాటు కృష్ణపక్షంలో అనఘాష్టమి, రూపనవమి, సఫల ఏకాదశి, మల్లి ద్వాదశి, యమత్రయోదశి… మొదలైన పర్వదినాలు వస్తాయి.
**గురువార వ్రతం
మార్గశిర మాసం శివకేశవులకే కాదు లక్ష్మీదేవికీ అత్యంత ఇష్టమైన మాసంగా చెబుతారు. ఈ నెలలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని అర్చించి, వ్రతకథను చదువుకుని, అందులో సూచించిన విధంగా మొదటి గురువారం పులగం; రెండో వారం అట్లూతిమ్మనం; మూడోవారం అప్పాలు, పరమాన్నం; నాలుగోవారం చిత్రాన్నం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ధనానికి లోటు ఉండదని భక్తుల నమ్మకం. నోములైనా వ్రతాలైనా పూజలైనా అభిషేకాలైనా మనలోని బద్ధకాన్ని వదిలించి, మన మనసులను ధర్మబద్ధం చేయడానికి పెద్దలు మార్గశిర మాసం రూపంలో ఏర్పాటు చేసిన విధివిధానాలే.!
3. దేవాలయాలు సహ చట్ట పరిధిలోకి రావు
దేవాలయాలు, చర్చిలు, మసీదులు సమాచార హక్కు (సహ) చట్ట పరిధిలోకి రావని ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. వాటికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం/నిధుల కేటాయింపు ఉండదు కాబట్టి మతసంస్థలు సహ చట్టం-2005 పరిధిలోకి రావని ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఇటీవల తీర్పు ఇచ్చారు. మతసంస్థలకు వివిధ మార్గాల్లో విరాళాల రూపంలో అపరిమితమైన సొమ్ము సమకూరుతున్న నేపథ్యంలో ఓ నిర్దిష్టమైన ఆదాయం కలిగి, రిజిస్టర్ అయిన దేవాలయాలు/మతసంస్థలను చట్టం పరిధిలోకి తేవాలని అభిప్రాయపడ్డారు. ఆ మేరకు చట్ట సవరణ జరగాలన్నారు. స.హ చట్టం పరిధిలోకి దేవాలయాలు వస్తాయని, దరఖాస్తుదారులు కోరిన సమాచారం ఇవ్వాలని దేవాదాయ కమిషనర్ 2007 నవంబర్ 27న ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల కార్యనిర్వహణాధికారులు /ట్రస్టీలు/ఛైర్పర్సన్లు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వారిలో కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్, చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు రాజేంద్రనాథ్గౌడ్ తదితరులున్నారు.
4. భద్రాద్రిలో ముక్కోటి సంరంభం
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శనివారం సీతారామ ఆలయంలో వైభవంగా ఆరంభమయ్యాయి. తొలిరోజున దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి, మంత్రోచ్చారణతో క్రతువును కమనీయంగా కొనసాగించారు. ఆధ్యాత్మికతను చాటే తిరువీధి సేవతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఆదివారం కూర్మావతారంతో దర్శనమూ ఉంటుంది. ఈ నెల 16 వరకు స్వామివారు రోజుకో రూపంలో దర్శనమిస్తారు. 17న తెప్పోత్సవం, ఏకాదశి మహోత్సవాల తర్వాతŸ రోజున ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటవుతుంది. ఈ కార్యక్రమాల పరంపర కారణంగా, నిత్య కల్యాణాలను 18 వరకు నిలిపివేసినట్లు ఈవో తాళ్లూరి రమేశ్బాబు తెలిపారు.
5. శ్రీపద్మావతీ అమ్మవారికి పల్లకీవాహనసేవ
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం పల్లకీవాహనసేవ జరిగింది. అమ్మవారు మోహినీ రూపంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించారు. అమ్మవారికి రాత్రి గజవాహనసేవ కనులపండువగా సాగింది. అమ్మవారికి జరిగే వాహన సేవల్లో గజవాహనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అమ్మవారు తనకు ఇష్టమైన గజంపై తిరుమల నుంచి తీసుకొచ్చిన శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని ధరించి శ్రీమహాలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వాహనసేవను చూసేందుకు తరలివచ్చిన భక్తులతో తిరువీధులు జనసందోహంగా మారాయి. ఆదివారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథోత్సవం, రాత్రి గరుడ వాహనసేవ జరగనుంది.
6. దిల్లీలో శ్రీకాళహస్తీశ్వర స్వామి కల్యాణోత్సవం
జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి కల్యాణోత్సవం దిల్లీ గోల్ మార్కెట్లోని బాలాజీ మందిర్లో శనివారం ఘనంగా నిర్వహించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు సురేశ్ గురుకుల్ ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. దిల్లీలోని తెలుగు వారు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు.
7. మస్కట్లో నారసింహుడి కల్యాణం
ఒమన్లోని మస్కట్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవాన్ని శనివారం నిర్వహించారు. అక్కడి దార్సేట్ పట్టణంలో తెలుగు ప్రజలు నిర్మించుకున్న శ్రీకృష్ణ ఆలయంలో స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని ఘనంగా జరిపారు. ఈ మహోత్సవంలో తెలుగు రాష్ట్రాల భక్తులు అధికంగా పాల్గొన్నారని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
8. కుంభమేళాను గ్రాండ్ సక్సెస్ చేస్తాం: యోగి
త్వరలో ప్రారంభం కానున్న కుంభమేళా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రయాగ్రాజ్ (అలహాబాద్) వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆథ్మాత్మిక, సాంస్కృతిక వేడుక ఇది… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కుంభమేళాను విజయవంతం చేస్తాం. కుంభమేళా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి…’’ అని వెల్లడించారు. కాగా కుంభమేళా ఏర్పాట్లపై ప్రధానితో చర్చించేందుకు యోగి గురువారం ఢిల్లీ వెళ్లివచ్చారు. 45 రోజుల పాటు సాగే కుంభమేళా వచ్చేనెల 15న ప్రారంభం కానుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది హిందువులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇక్కడికి రానున్నారు.
9. శబరిమలకు పోటెత్తిన భక్తులు
ఏటా భక్తజన సందోహం భారీ ఎత్తున సంబరంలా జరుపుకొనే ఆలయసందర్శనం మొదలై 20 రోజులైంది. అయితే ఇన్నాళ్లూ పలచగా కనిపించిన శబరిమల పరిసరాలు, ఎట్టకేలకు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. పోలీసులు నిబంధనలు సడలించటంతో పాటు, ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పునకు సంబంధించిన హడావిడి కాస్త సద్దుమణగడంతో భక్తులు, అయ్యప్ప దర్శనంకోసం పోటెత్తుతున్నారు.ఆలయవర్గాల సమాచారం ప్రకారం, శుక్రవారం 61వేలమందికి పైగా భక్తులు, శబరిమల దర్శనానికి తరలివచ్చారు. నవంబరు 16న ఆలయాన్ని భక్తజనం కోసం తెరచినప్పటికీ, కేవలం 28,717మంది మాత్రమే దర్శనానికి వచ్చినట్టు లెక్క తేలింది. ఆగస్టులో సంభవించిన భారీ వరదల కారణంగా సరైన ఏర్పాట్లు లేకపోవడం, వసతి గృహాల కొరత, ప్రైవేటు వాహనాలపై నిషేధం, మంచినీటి ఎద్దడి వంటి అనేక కారణాల వలన భక్తుల తాకిడి తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com