Business

ఇండియాలో పేపాల్ కనబడదు-వాణిజ్యం

ఇండియాలో పేపాల్ కనబడదు-వాణిజ్యం

* ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటు, రివర్స్‌ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్‌బీఐ పరపతి ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను గవర్నర్‌ శక్తికాంతదాస్‌ శుక్రవారం వెల్లడించారు. 2021-22లో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉండనున్నట్లు ఆర్‌బీఐ అంచనా వేసింది.

* తాము తయారుచేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ భారత్‌లో చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్‌ వెల్లడించింది. భారత్‌లో కరోనా టీకా వినియోగానికి దరఖాస్తు చేసుకున్న తొలి సంస్థ ఫైజరే కావడం గమనార్హం. యూకే, బహ్రైన్‌లో అనుమతి రాగానే ఫైజర్‌ భారత్‌పై ఆసక్తి చూపింది.

* దేశీయంగా ఏప్రిల్‌ 1 నుంచి తమ సర్వీసులు నిలిపేయనున్నట్లు డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం పేపాల్‌ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘ భారత వ్యాపారాల్లో మా పెట్టుబడులు పెట్టనున్నాం. ఇకపై భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తాం.’’ అని వారు తెలిపారు. గతేడాదిలో 1.4 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన 3.6 లక్షల వ్యాపారాలను పేపాల్‌ నిర్వహించిందని వెల్లడించారు. వినియోగదారులకు అవసరమైన సేవలను అందిస్తూ భారత్‌ ఆర్థిక వృద్ధిలో పాలుపంచుకుందని పేపాల్‌ ప్రతినిధులు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు దృష్టి పెడతామన్నారు. అమెరికాకు చెందిన పేపాల్‌ సంస్థ భారత్‌లో స్విగ్గీ, బుక్‌మై షో వంటి ప్లాట్‌ఫాంలకు చెల్లింపులు చేసేందుకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఇది ఈబే అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.

* దేశీయ మార్కెట్లు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అయినా వరుసగా ఐదో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించడంతో రికార్డు స్థాయి లాభాల్లోకి వెళ్లిన సూచీలు సాధారణ లాభాలకు పరిమితమయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు రాణించగా.. ఆటో, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. నిఫ్టీ 14,900 పాయింట్ల పైన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.93గా ఉంది.

*కొత్త జంటలకు స్వర్గ ధామంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుపొందిన మాల్దీవులకు హైదరాబాద్ నుండి విమాన సర్వీసులు రాబోతున్నాయి. ఫిబ్రవరి 11నుండి గోఎయిర్ విమానయాన సంస్థ మాల్దీవులకు హైదరాబాద్ నుండి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది. వారంలో నాలుగురోజుల పాటు ఈ సర్వీసులను నడపనున్నారు.

* డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కన్సాలిడేటెడ్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.20 శాతం తగ్గి రూ.6,257.55 కోట్లుగా నమోదైంది. స్టాండ్‌ఎలోన్‌ లాభం 7 శాతం తగ్గుదలతో రూ.5,196.22 కోట్లకు పరిమితమైంది.

* ఫార్మా మేజర్ ఫైజర్ సంచలన విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో తన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 3న జరిగిన భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ ఈ విషయాన్ని ప్రకటించింది.

*రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రివ్యూలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గవర్నరు శక్తి కాంతదాస్‌ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించిందని ఆయన ప్రకటించారు.

*డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.9.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.6.81 కోట్లతో పోలిస్తే 40 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం రూ.39.5 కోట్ల నుంచి రూ.59.3 కోట్లకు చేరింది.

*పన్ను మినహాయింపు ప్రయోజనం ఉండే ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌)ని ఉన్నతోద్యోగులు బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈపీఎఫ్‌ ఖాతాలు ఉన్న 4.5 కోట్ల మందిలో దాదాపు 1.23 లక్షల చందాదారుల ఖాతాల్లో ప్రస్తుతం రూ.62,500 కోట్లు ఉన్నా యని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

*ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై) గ్లోబల్‌ చైర్మన్‌గా హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ తైలం ఎన్నికయ్యారు. టై చైర్మన్‌ గా ఒక హైదరాబాదీ ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. టై గ్లోబల్‌ 14 దేశాల్లో 61 చాప్టర్లు కలిగి ఉంది. 15 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. బోస్టన్‌లో ఉంటున్న ప్రవీణ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌, ఇన్వెస్టర్‌, స్టార్టప్‌ సలహాదారుగా టై సభ్యులకు సుపరిచితులని టై హైదరాబాద్‌ పేర్కొంది. 2018లో టై గ్లోబల్‌ వైస్‌ చైర్మన్‌గా ప్రవీణ్‌ బాధ్యతలు నిర్వహించారు.

*దూరంగా ఉండి నియంత్రించే ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థ (ఆర్‌పీఏఎ్‌స)లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీతో ఎయిర్‌బస్‌ చేతులు కలిపింది. ఒప్పందం ప్రకారం ఏవియేషన్‌ శిక్షణలో తనకున్న అనుభవాన్ని ఎయిర్‌బస్‌ వినియోగిస్తుంది.

*త్వరలో యూప్ టీవీ స్కోప్ ప్లాట్‌ఫాంఆవిష్కృతం కానుంది. ఈ క్రమంలో… బీఎస్‌ఎన్‌ఎల్(భారత్ సంచార్ నిగం లిమిటెడ్)తో యూప్ టీవీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

*ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు విస్తరించడానికి విదేశీ కంపెనీలతో భారత్‌ డైనమిక్స్‌ (బీడీఎల్‌) ఒప్పందాలు కుదుర్చుకోనుంది. బీడీఎల్‌ చేపట్టే వినూత్న ప్రొగ్రామ్‌లలో పాలుపంచుకోవడానికి స్టార్ట్‌పలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు బీడీఎల్‌ సీఎండీ సిద్ధార్థ మిశ్రా తెలిపారు.

*అమెజాన్ సీఈవో పదవి నుంచి తాను దిగిపోనున్నట్లు జెఫ్ బెజోస్ మంగళవారం ప్రకటిచిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో కొత్త సీఈవో ఎవరనే ప్రశ్న సర్వత్రా తలెత్తింది. అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలకు ఓ సమాదానం లభించినట్లైంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) చీఫ్ ఆండీ జస్పీనే అమెజాన్ సంస్థకు నూతన సీఈవో నియమించనున్నట్లు తెలుస్తోంది. జస్సీ 1997లో అమెజాన్‌లో చేరారు. ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ రంగంలోకి అడుగుపెట్టారు.