Devotional

వాహన సేవలు అప్పుడు ప్రారంభమవుతాయి

వాహన సేవలు అప్పుడు ప్రారంభమవుతాయి

కోవిడ్ బాగా తగ్గుముఖం పట్టాక శ్రీవారి సేవలకు పరిమితంగా భక్తులను అనుమతించే ఆలోచన చేస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఈ నెల 19వ తేదీ తిరుమలలో రథ సప్తమి వాహన సేవలు నిర్వహిస్తామని అన్నారు.

తిరుమల అన్నయ్య భవనంలో శుక్రవారం ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తో పాటు వివిధశాఖల అధికారులతో చైర్మన్ సమావేశం నిర్వహించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టినందువల్ల భక్తుల సంఖ్య పెంచే అంశం, రథ సప్తమి ఏర్పాట్ల గురించి సమావేశంలో చర్చించారు.

అనంతరం చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ తిరుమల మాడ వీధుల్లో రథసప్తమి వాహన సేవలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

ఈ నెల 13 వ తేదీ చెన్నైలో కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణానికి శంఖుస్థాపన చేయిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత రాజధాని అమరావతి,

పరిపాలనా రాజధాని విశాఖపట్టణం లో ఏప్రిల్ లో మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని చైర్మన్ చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య పెంచినా దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేదాకా కోవిడ్ నిబంధనలు అమలు చేస్తామని అన్నారు.

చైర్మన్ నిర్వహించిన సమావేశంలో సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, సిఈ శ్రీ రమేష్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.