భద్రాద్రిలో ముక్కోటి వేడుకలు

భద్రాద్రి రామాలయంలో మూలవిరాట్ సోమవారం ముత్యాల వస్త్రాలంకృతమై ముత్తంగి రూపంలో దర్శనమిచ్చాడు. ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా దివ్య ప్రబంధ పారాయణం ఘనంగా నిర్వహించారు. స్వామివారు వరాహావతారంలో దర్శనం ఇవ్వడంతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఈ రూపంలో ఉన్న మూర్తికి తిరువీధిలో అడుగడుగునా నీరాజనాలు పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మంగళవారం నరసింహావతారంలో స్వామి దర్శనం ఉంటుందని ఈవో తాళ్లూరి రమేశ్బాబు తెలిపారు.
1.17 నుంచి శ్రీవారికి సుప్రభాత సేవ రద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి నిత్యం తెల్లవారుజామున నివేదించే సుప్రభాత సేవను ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు తితిదే రద్దు చేయనుంది. ధనుర్మాసం నేపథ్యంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నివేదనను ప్రవేశపెట్టనుంది. ధనుర్మాసం ఘడియలు ఈనెల 16న సాయంత్రం 5.19 గంటలకు ప్రారంభమై జనవరి 14న పరిసమాప్తం కానున్నాయి. ఈ నెల రోజులపాటు అర్చకులు శ్రీకృష్ణస్వామివారికి తిరుప్పావై పారాయణంలోని ప్రవచనాలను ఏకాంతంగా నివేదిస్తారు.
2. అచ్యుతాపురంలో గోటి తలంబ్రాల వరికోతలు
సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమికి కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో వాడే తలంబ్రాలకు విశిష్టత ఉండడంతో, గోటితో ఒలిచి అందించడం శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆనవాయితీ. నిర్వాహకుడు కల్యాణం అప్పారావు 8వ ఏడాది సాగిస్తున్న ఈ క్రతువులో భాగంగా, వరిధాన్యాన్ని భద్రాచలం తెచ్చి రాముడి పాదాల వద్ద ఉంచి, పూజించాక అచ్యుతాపురం తీసుకెళ్లి వరి నాట్లు వేశారు. తూర్పుగోదావరిజిల్లాకు చెందిన ఆ గ్రామంలో తలంబ్రాల వరికోత పనులు ఆదివారం విలక్షణంగా కొనసాగాయి. రాముడితో పాటు ఆంజనేయుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు వంటి వేషధారణల్లో భక్తులు వరిని కోసి శ్రీరామ నామాలను పఠించి సంబరం జరిపారు.
3. వైభవంగా తిరుచానూరు అమ్మవారి స్వర్ణ రథోత్సవం
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వర్ణ రథోత్సవం కనులపండువగా సాగింది. స్వర్ణరథంపై శ్రీమహాలక్ష్మీ రూపంలో కొలువుదీరిన అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అంతకుముందు అమ్మవారికి ఆలయంలో విశేష పూజలు నిర్వహించి ఉత్సవమూర్తిని వేంచేపుగా రథోత్సవ మండపానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.10 గంటల సమయంలో రథోత్సవాన్ని ప్రారంభించారు. తిరువీధుల్లో గంట పాటు స్వర్ణ రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. బంగారు రథాన్ని లాగేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనసేవలు జరగనున్నాయి.
4. ఓరుగల్లులో వైభవంగా శ్రీయాగం–హాజరైన చినజీయర్స్వామి
వరంగల్ నగరంలోని శ్రీవేంకటేశ్వరగార్డెన్స్లో శ్రీయాగం వైభవోపేతంగా కొనసాగుతోంది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో విశ్వశాంతి కోసం శ్రీయాగాన్ని నిర్వహిస్తున్నారు. వరంగల్లో గీతా ప్రచారక పరిషత్ స్థాపించి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నయాగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శనివారం ప్రారంభమైన యాగంలో భాగంగా రెండో రోజు ఆదివారం చతుస్థానార్చన, మూలమంత్రది హావనం, నక్షత్రేష్టిహవనం, పారాయణములు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహబాషణం చేశారు. సోమవారం యాగం పూర్తవుతుందని నిర్వాహకులు తెలిపారు.
5. కూర్మరూపుడికి భక్త నీరాజనం
రామాలయంలోని ముక్కోటి ఏకాదశి మహోత్సవాల రెండో రోజైన ఆదివారం దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. నామార్చనలతో రామయ్యకు ధూప దీపాలను సమర్పించి అభిషేకం జరిపారు. కూర్మావతారంలో దర్శనమిచ్చిన లక్ష్మణ సమేత సీతారామచంద్రులను తిలకించి భక్తజనులు పులకించారు. కోలాటాలు, భజనల నడుమ మిథిలా మండపానికి తోడ్కొని వెళ్లారు. సోమవారం వరాహావతారంలో స్వామి దర్శనం ఉంటుంది. ఈ నెల 17న తెప్పోత్సవం, 18న ఉత్తర ద్వార దర్శనం ఉంటాయి.
6. సూర్యప్రభ వాహనంపై సిరులతల్లి
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. సూర్యప్రభపై అమ్మవారు త్రివిక్రమ అలంకరణలో శ్రీమహావిష్ణువు రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి చంద్ర ప్రభ వాహనసేవ వేడుకగా సాగింది. మంగళవారం ఉదయం 8.15 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది. రాత్రి అమ్మవారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బుధవారం ఉదయం 11.42 గంటలకు జరిగే పంచమీ తీర్థంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
7. హరుడికే అమ్మ అయిన అమ్మవ్వ
పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకుంది. ‘శివునికి అందరూ ఉన్నారు. కానీ అమ్మానాన్నా మాత్రం లేరు. చచ్చిపోయారో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో, ఆయనకూ అంత బాధే ఉండాలి. తల్లి వుంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు. తల్లి వుంటే తల జడలు కట్టనివ్వదు. అమ్మ వుంటే విషం తాగనిస్తుందా? అలా తోళ్లు కట్టుకొని తిరగనిస్తుందా? పాములు మెడలో వేసుకుని, వంటికి బూడిద పూసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? తల్లి వుంటే శివునికి తిరిపమెత్తుకు తిరిగే కర్మమెందుకు పడుతుంది? అనాథలా వల్లకాటిలో ఎందుకు తిరిగేవాడాయన?’ దాంతో ఆమెకు శివుడి మీద మాతృత్వ భావన కలిగింది. ‘అమ్మానాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మయినా, నాన్నయినా నేనే’ అని అనుకుంది. బెజ్జమహాదేవి శివలింగ మూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి, కాటుక బెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలూ స్వీకరించసాగాడు. ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది. ‘అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది’ అని ఏడ్చింది.
అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు. ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన కష్టానికి కుమిలిపోయింది. శివుడు పాలు, వెన్నా ఏమీ ముట్టకపోయేసరికల్లా ‘ఇక మాటలతో పనిలేదు బిడ్డా! నీ బాధ చూస్తూ నేను బతికి ఉండి మాత్రం ఏమి లాభం?’ అని తల నరుక్కోడానికి సిద్ధపడింది. ఆమె అవ్యాజ ప్రేమానురాగాలకు, నిష్కల్మష భక్తికి ఉబ్బు శంకరుడు మరింతగా ఉబ్బిపోయాడు. వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై ‘వరాలు కోరుకో’మన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి ‘‘కన్న ప్రేమకంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. నీవు నా కొడుకువు. నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు’’ అంది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది. భగవంతుడిని అదివ్వు, ఇదివ్వు అని కోరుకునేవారే కానీ, ఆయనకు అమ్మానాన్నా అయి, ఆలనాపాలనా చూసేవారెవరుంటా రు? అసలంతటి నిష్కల్మషమైన భక్తి ఎవరికి ఉంటుంది? అందుకే శివుడు ఆమెను అమ్మలా ఆదరించాడు. నాన్నలా తన గుండెలో నిలుపుకున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి.
8. భీమేశ్వరాలయంలో హుండీ ఆదాయం లెక్కింపు
పంచారామ క్షేత్రమైన సామర్లకోట కుమారారామ భీమేశ్వరాలయంలో కార్తీక మాసంలో హుండీల ద్వారా రూ.37,07,034 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో నారాయణమూర్తి తెలిపారు. సోమవారం ఆలయంలో హుండీల్లో ఆదాయం లెక్కించారు. దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో హుండీలను తెరిచారు. నవంబరు 11వ తేదీ నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు పూజా రుసుము, లక్షపత్రి పూజ, పులిహోర, దుకాణాలు, ఎంవో, పుస్తకాలు హుండీల ద్వారా ఆదాయం చేకూరింది. గత ఏడాది కార్తీక మాసంలో రూ.32,83,460 ఆదాయం రాగా ఈ ఏడాది సుమారు రూ.5 లక్షల ఆదాయం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కంటే జగదీష్మోహన్, ట్రస్టుబోర్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
9. 16 నుంచి వేంకటేశ్వర స్వామి ధనుర్మాసోత్సవాలు
రామాయంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ధనుర్మాస సహిత వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రామాయంపేట ఆలయ కమిటీ చైర్మన్ తోట లక్ష్మీపతి పేర్కొన్నారు. సోమవారం ఆలయ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. 16న ఆదివారం ఉత్సవాలను ప్రారంభించి పాశుర విన్నపం, తీర్ధప్రసాద వితరణ. 17న సోమవారం ఆస్థాన సేవ తదితర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. 18న మంగళవారం వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్బంగా స్వామివారి ఊరేగింపు, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పుర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
10.శబరిమలైకు ఆర్టీసీ అద్దె బస్సులు =కిలోమీటర్ల చొప్పున ఛార్జీల వసూళ్లు
రైళ్లు నాలుగునెలల ముందే నిండిపోయాయి. విమాన టికెట్లు సామాన్యుడికి అందుబాటులో లేవు.. కార్లు అద్దెకు తీసుకుని వెళ్లలేని పరిస్థితి.. ఎలాగైనా నిర్దేశించిన కాలంలోనే శబరిమలైకు వెళ్లాలి.. ఎలా అని తలలు పట్టుకోకండి. మీరు ఒక బృందంగా మారితే.. మిమ్ములను సురక్షితంగా తీసుకెళ్లి తీసుకురాడానికి ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉన్నాయని టీఎస్‌ఆర్టీసీ చెబుతోంది. మీకు అనువైన బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇంటికి వచ్చి తీసుకెళతామని చెబుతోంది. అనుభవజ్ఞులైన డ్రైవర్లను ఇందుకోసం కేటాయిస్తున్నట్టు కూకట్‌పల్లి డీవీఎం దేవదానం చెప్పారు.
*అద్దెలు ఇలా..
24గంటల్లో 480 కిలోమీటర్ల దూరం ప్రయాణం ఉండేలా అద్దెలు నిర్ణయించారు. ఇలా సూపర్‌లగ్జరీ బస్సు కావాలంటే కిలోమీటరుకు రూ.42 వసూలు చేస్తారు. డీలక్స్‌ బస్సులైతే రూ. 41, ఎక్స్‌ప్రెస్‌కు రూ.45 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇక మినీ ఏసీ(వజ్ర) బస్సులైతే.. ప్రతి కిలోమీటరుకు రూ.30తో పాటు 5శాతం జీఎస్‌టీ చెట్లించాల్సి ఉంటుంది.
*పూర్తి వివరాలకు..
కూకట్‌పల్లి డివీఎంను 99592 26148, బీహెచ్‌ఈఎల్‌ డిపో మేనేజర్‌ను 99592 26149, మియాపూర్‌ – 1 డిపో మేనేజర్‌ను 99592 26153 ఫోన్‌ నంబర్లలో సంప్రదిస్తే.. మీ ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సులను సమకూర్చడం జరుగుతుంది.
11.శ్రీనివాసుని కల్యాణం చూతము రారండి -చినజీయరు స్వామి పర్యవేక్షణలో 14న మహోత్సవం
అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీనివాసుని కల్యాణం 14న త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లల్లో భక్త బృందం నిమగ్నమైంది. వేలమంది దంపతులు ఇందులో పాల్గొనున్నారు. స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని ఖాళీ ప్రదేశంలో క్రతువు నిర్వహణకు వేదిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వేల మందికి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి పంచలోహాలతో తయారు చేసిన మూర్తులను అందజేస్తారు. చెన్నై నుంచి తెచ్చిన వాటిని సోమవారం ఆవుపాలతో శుద్ధి చేసి తుడిచిన తర్వాత వస్త్రాలు ధరింపజేస్తున్నారు. తర్వాత నామాలు పెట్టి సిద్ధం చేస్తున్నారు. పెద్దబజారులోని జీయరు నిలయంలో సుమారు వంద మంది మహిళలు ఈ కార్యక్రమంలో సేవలందిస్తున్నారు. కల్యాణానికి ముందుగా నిర్వహించే పసుపు కొమ్ములు రోట్లో వేసి రొకళ్లతో దంచడం.. ఆ తర్వాత నలుగు పెట్టడం ఇత్యాది సంప్రదాయ కార్యక్రమాలు సొంత ఇంట్లో కార్యక్రమం తరహాలో అందరూ కలసి శనివారం నుంచి నిర్వహిస్తున్నారు. బుధవారం ఎదురు నడవడం నిర్వహిస్తారు. అందులో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొంటారని కార్యక్రమ నిర్వహకురాలు భవనాశి మల్లిక ప్రసాదరావు తెలిపారు. తొలిరోజు 13న జీయరు నిలయం నూతన భవనం ప్రారంభిస్తారని మరుసటి రోజు శుక్రవారం కల్యాణం నిర్వహిస్తారని చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com