Kids

మీ పిల్లలకు రాయడం నేర్పిస్తున్నారా?

Are You Teaching Hand Writing To Kids - Telugu Kids News

చేతిరాత మూడు విధాలు.

1. చదివేవారికి అర్ధమయ్యేది.
2. వ్రాసినవారికీ, దేవుడికీ అర్ధమయ్యేది.
3. దేవుడికి మాత్రమే అర్ధమయ్యేది.

* పిల్లల్ని మొదటి కోవలో ఉంచడానికే ఈ ప్రయత్నం.
చేతివ్రాత నిపుణుడిని కాలిగ్రాఫర్ అంటారు. తెలుగు లిపి కాలిగ్రఫీకి ఆద్యుడైన మల్లిఖార్జునరావు ఈ విధంగా చెపుతున్నాడు: “క్షరం అంటే నాశనం. అ-క్షరం అంటే చావు లేనిది. మంచి చేతిరాత ఒక స్కిల్.

* అది ఆసక్తి+అభ్యాసాల కలయిక..!
గారాబం ఎక్కువైన పిల్లల్లో అందమైన చేతివ్రాత కనిపించదు. పిల్లలకు బొత్తాలు పెట్టుకోవడం; బూట్ల లేసులు కట్టుకోవడం; బ్యాగ్, బాక్స్ మూయడం వంటి పనులు తామే చేసుకొనే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. తద్వారా చేతి కండరాల కదలికలు మెరుగుపడతాయి. ముచ్చటైన చేతివ్రాతకి కావలసినవి మూడే. “వ్రాతలో మెలకువలు తెలుసుకోవటం, మొదట్లో కాస్త అభ్యాసం. అందంగా వ్రాయాలన్న పట్టుదల.”
ప్రపంచoలో దాదాపు అన్నిభాషల అక్షరాలూ ‘సున్నా’ ఆకారo ఆధారంగానే రూపొందాయి. అందమైన వ్రాతకోసం, ప్రతిరోజూ రెండు నిమిషాలు రెండు చేతులూ సాచి, మణికట్టు ముందుభాగం కదిలేలా కుడివైపుకు, ఎడమవైపుకు గుండ్రంగా తిప్పలి. తరువాత సింగిల్ రూల్ద్ కాగితం మీద కుడివైపుకు, ఎడమవైపుకు ‘సున్న’ ఆకారాన్ని అభ్యసించాలి. ఆ ఆకారం గుండ్రంగా వచ్చేవరకు పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి.
* వేగమూ, స్పష్టతా విలోమ నిష్పత్తిలో ఉంటాయి. వేగం ఎక్కువయ్యే కొద్దీ అక్షరాలు సొగసు కోల్పోతాయి. ఒద్దికగా పెట్టుకున్న కుచ్చిళ్ళకీ, హడావుడిగా కట్టుకున్న చీరకీ తేడా తెలిసిందే కదా. చేతివ్రాత మూడ్ పై ఆధారపడి ఉంటుంది. పరీక్షల్లో ఒకవైపు టెన్షన్. మరోవైపు టైమ్. అందుకే సమాధాన పత్రంలో మొదటి పేజీకి, మూడో పేజీకీ చెప్పలేనంత తేడా ఉంటుంది. పరీక్షల్లో వేగంగా వ్రాయాలి. వేగంగా వ్రాస్తూ కూడా అందంగా వ్రాయటం సాధ్యమే. కాస్త ప్రాక్టిస్ ద్వారా దీన్ని సాధించవచ్చు. నిదానంగా వ్రాసినా, ఎన్ని సార్లు వ్రాసినా, ఎంత వేగంగా వ్రాసినా ఒకే పరిమాణం, ఆకారం, ఒకే వంకర్లలో వ్రాయగలగాలి. ఇందుకోసం ప్రణాళికా బద్ధమైన అభ్యాసం అవసరం. అందమైన చేతిరాత కోసం బాగా ఇబ్బంది పెట్టే అక్షరాలను, కాపీ పుస్తకాల సాయంతో నేర్చుకోవాలి. తలకట్ల విషయం జాగ్రత్త వహించాలి. చేతిరాతలో ‘రిథం’ సాధించడానికి సారూప్యత గల అక్షరాలను విడిగా అభ్యసించాలి. అప్పుడు పరీక్షల్లో ఎంత వేగంగా వ్రాసినా వ్రాత పాడవడుదు.
అల్లరి తగ్గటానికి అందమైన వ్రాత ఒక మార్గం అంటే నమ్ముతారా?

* అక్షరో రక్షతి రక్షిత.
చేతిరాత మన మనస్తత్వానికి అద్దం. చేతిరాతలో చిన్న చిన్న మార్పులు చేసుకొని అభ్యసించడం ద్వారా మెదడులో తదనుగుణమైన మార్పులు సంభవిస్తాయి. దీనినే ‘గ్రాఫో థెరపీ’ అంటారు. అందంగా, ఒద్దికగా వ్రాసేవాళ్ళు సాధారణంగా కామ్ గా, తక్కువ హైపర్‌గా ఉంటారు. ఒకప్పుడు వ్రాత చూసి అది అబ్బాయిదో, అమ్మాయిదో చెప్పగలిగేవాళ్ళం. . అమ్మాయిల్లో కూడా నిలకడ తగ్గాక గుర్తించటం కష్టo అవుతోంది. వ్రాతకీ మనస్తత్వానికీ ఎంత దగ్గర సంబంధమో చెప్పటానికి ఇది చాలు. మీ పిల్లల వ్రాత మల్లిఖార్జునరావు నాలుగు మీటింగుల్లో మారుస్తాడు. మేము చూస్తూ ఉండగానే మా ఇంట్లో పిల్లల హాండ్-రైటింగ్ చాలా కొద్దిరోజుల్లోనే మారింది. ఈ విషయమై మరిన్ని వివరాల కోసం తెలియాలంటే www.handwritingtoday.com చూడండి.