రేగుపండుని చూస్తే సర్వరోగాలకు భయం

శీతాకాలంలో విరివిగా వచ్చే పండ్లలో రేగుపండ్లు ముఖ్యమైనవి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే పండ్లు కూడా ఇవే.. అయితే రేగుపండ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్ మారిటియానా, నార్‌కెలి కల్, బెర్, బోరీ, బోర్, బెరి అని అనేక రకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. ఈ సీజన్లో పల్లెల్లో రేగు చెట్లు విరగకాస్తుంటాయి. దోరగా, ఎర్రగా పండిన రేగుపండ్లు నోరూరిస్తూ ఉంటాయి. మన దేశంలో అయితే తొంభై రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. రేగుపండులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాలా మంచిది. గొంతునొప్పిని, ఆస్తమా, కండరాల నొప్పిని తగ్గించే గుణం వీటిలో ఉంది. రేగు పండు గింజ చాలా గట్టిగా ఉంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
మహాభారత ఇతిహాసంలో.. భారతీయ నాగరికతలో హిందువుల పూజల్లోనూ పాలు పంచుకుంటున్న వృక్షజాతుల్లో బదరీ వృక్షం ఒకటి. భగవంతుడికి నివేదించే పండ్లలో రేగుపండు ఒకటి. రేగుపండును బదరీఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే.. పిల్లలకు పోసే భోగిపండ్లూ రేగిపండ్లే.. సూర్యభగవానుడికి రేగుపండ్లంటే ఇష్టమట.. రథసప్తమినాడు చిక్కుడు ఆకులతో పాటు రేగు ఆకులను కూడా తలపై పెట్టుకుని స్నానం చేస్తారు. వినాయకుడి పూజలోనూ రేగు ఆకులను సమర్పిస్తారు. బదరీనాథ్‌లో ఉన్న స్వామివారికి రేగుపండ్లంటే అమిత ఇష్టమట.. అందుకే ఆయనకు బదరీనారాయణుడనే పేరు వచ్చింది. అలాగే వ్యాసుడికి బాదరాయణుడనే పేరు బదరీ ద్వీపంలో పుట్టినందువల్లే వచ్చింది. తంత్ర శాస్త్ర గ్రంథాల్లో కూడా బదరీవృక్షం ప్రసక్తి ఉంది. ఈ చెట్టు పండులోనే కాదు, ఆకుల్లోనూ, బెరడులోనూ, చివరకు గింజల్లో కూడా ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు కనిపెట్టారు. నిజానికి భారతదేశంలో దీన్ని వైద్యంలో వినియోగించే పద్ధతి ఈనాటిది కాదు. పూర్వం నుండే వాడుకలో ఉంది. మందమతులుగా ఉన్న పిల్లలచేత రోజూ కాసిన్ని రేగుపండ్లు తినిపిస్తే వారి బుద్ధి వికసిస్తుందట. అలాగే దీని ఆకు పసరును పుండ్లు, వ్రణాలు వంటి వాటికి పై పూతగా వాడితే త్వరగా తగ్గిపోతాయిట. కొన్ని దేశాల్లో.. వీటి లేత ఆకులను కూరగా వండుకుని తింటారు. రేగుపండ్లతో పండ్లరసాలు, వడియాలు వంటి వంటకాలు కూడా చేస్తారు.
**ఔషధ గుణాలు
రేగుపండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉంటాయి. రేగుపండ్లలో సీమరేగు, గంగురేగు.. పండ్లు ప్రాచుర్యం పొందాయి. ఇవేకాక అందరికీ అందుబాటులో ఉన్న చిన్న రేగుపండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. రేగుపండ్లను తెలుగు రాష్ట్రాల్లో వడియాలు పెట్టుకోవడానికి, పచ్చడి చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అలాగే చైనా, కొరియా దేశాల్లో రేగుపండ్లను టీ చేసుకుని తాగుతారు. రేగుపండు నోటి పుండ్లనీ, గొంతుమంటనీ, కడుపులోని మంటనీ, ఆకలినీ తగ్గిస్తుంది. అందుకే ఈ పండు బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ప్రతి మనిషికి అవసరమయ్యే ఇరవై నాలుగు రకాల అమైనో ఆమ్లాలలో పద్దెనిమిది రకాలు రేగుపండ్ల ద్వారానే లభిస్తాయట. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మసౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. రేంగుపండు రక్తనాళాలను శుభ్రపరిచి గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. కాలేయాన్ని కాపాడటంలో కూడా రేగుపండు బాగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. అంతేకాదు ఈ పండు నరాల ఒత్తిడినీ, మొలల వ్యాధినీ తగ్గిస్తుంది. కండరాల పటుత్వాన్ని పెంచుతుంది. ఈ పండులో ఐరన్, ఫాస్పరస్‌లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. రేంగుపండులో జిగురుగా ఉండే గుజ్జు ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరుకు టానిక్‌లా పనిచేస్తుంది. వీటిని రక్తపోటు ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాలి. రేగుపండు నుండి తీసిన రసం క్యాన్సర్ కారక కణాలను తగ్గిస్తుందని ఇటీవల జరిపిన పరిశోధనల ద్వారా తెలిసింది. పుల్లగా ఉండే రేగుపండు తీసుకోవడం ద్వారా గర్భిణీల్లో వాంతులు, వికారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పండులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. రేగుపండు గింజలతో చేసే ఆయింట్మెంట్ కీళ్లనొప్పులకు మంచి ఔషధం. రేగుపండు పూలు, ఆకులూ ఇంట్లో పెట్టుకుంటే క్రిమి కీటకాలు రావు. ఈ పండ్లను అతిగా తింటే మాత్రం డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడును డయేరియాకు ఔషధంగా వాడతారు. రేగుపండ్లను తినడం వల్ల వాత, పైత్య, కఫ వ్యాధులు తగ్గుతాయి.
**వంద గ్రాముల రేగుపండ్లలో లభించే పోషకాలు:
కొవ్వు: 0.2 గ్రాములు
కాల్షియం: 25.6 మి.గ్రాములు
కేలరీలు: 79
ప్రొటీన్లు: 1.2 గ్రాములు
సోడియం: 3.5 గ్రాములు
ఫాస్పరస్: 26.8 మి.గ్రాములు
విటమిన్ ఎ: 10 మై.యూనిట్లు
విటమిన్ సి: 70 మి.గ్రాములు
పిండిపదార్థాలు: 20.2 గ్రాములు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com