నేడు సుబ్బులక్ష్మి వర్థంతి-TNI కధనం

ఆమె……
గళం…………………….. సుమధురం!
స్వరం…………………….కోయిల కూజితం!
సంకీర్తనం………………..మధురాతి మధురం!
గమకం…………………..రసరమ్యం!
భక్తిగీతం…………………ఆధ్యాత్మిక ప్రవాహం!
భజగోవిందం……………భక్త పరవశం!
సాయి కీర్తనం…………..హృదయ పులకితం!
సుప్రభాతం……………. దేశానికే శుభోదయం!
విష్ణు సహస్ర నామం……కైవల్య పథం!
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించారు. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా ‘కుంజమ్మ’ అని పిలిచేవారు. తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బులక్ష్మిగారు తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగారు. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉన్నారు. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ఆల్బమ్ అందించారు.సుబ్బులక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బులక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే….తన గురువు, మార్గదర్శి, ‘ఆనంద వికటన్’ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ గారితో 1940 లో ఆమె ప్రేమవివాహం. ఆ వివాహంతో మరో ముఖ్యమైన మలుపు… ‘ సేవాసదనం’ సినిమా ద్వారా సుబ్బులక్ష్మిగారుసినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బులక్ష్మిగారు సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించారు. 1940 వ సంవత్సరంలో ‘శకుంతలై’ అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించారు. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన ‘మీరా’ చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మిగారి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. ‘మీరా’ సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. గాయనిగా సుబ్బులక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ గారి కృషి ఎంతో ఉంది.సుబ్బులక్ష్మిగారు శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించారు. భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు.కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలను, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా సుస్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి గారి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మిగారు తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజనపాడుతూ అందులోనే అమె పరవశురాలవుతారు. “ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుపూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు” అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు.ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి గారు. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మి గారిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందారు.పద్మభూషణ్, పద్మవిభూషణ్,సంగీతకళానిధి,కాళిదాస సమ్మాన్,రామన్ మెగసెసే అవార్డులను అందుకున్నారు. ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గారుతన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, ఛేదించని రికార్డులు, రివార్డులు ఎన్నో…ఎన్నెన్నో… తన సొంతం చేసుకున్నారు.ఆమె ఎక్కని ‘శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బులక్ష్మి గారి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి.ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ‘సుప్రభాత ‘ గీతమై, ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ’ నిత్యస్తోత్రమై, ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన-పరవశింపచేసినకర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా కనుమరుగై పోయింది.అయినా, ఆమె గానామృత ఝరి మాత్రం విశ్వమున్నంత కాలం ప్రపంచమంతటా ప్రవహిస్తూనే ఉంటుంది.ఆ ప్రవాహ హోరు వీనులవిందుగా,మనసును పరవశింపచేస్తూ,ఆధ్యాత్మిక భావనలలో ముంచెత్తుతూ,మారుమోగుతూనే ఉంటుంది.ఆ సంగీత సామ్రాజ్ఞిని మనకుసదా-సర్వదా… ప్రాతఃస్మరణీయురాలు-చిరస్మరణీయురాలు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com