నేటి నుండి మోపీదేవిలో కళ్యాణోత్సవాలు-ఆధ్యాత్మికం

1. నేటి నుండి మోపీదేవిలో కల్యాణోత్సవాలు – తదితర ఆద్యాత్మిక వార్తలు
మోపిదేవిలో స్వయంభుగా వెలసిన శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మార్గశీర్షమాస కల్యాణోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ సహాయ కమిషనర్ ఎం.శారదాకుమారి మంగళవారం పేర్కొన్నారు. ప్రారంభరోజైన బుధవారం ఉదయం 11 గంటలకు స్వామివారిని పెండ్లికుమారుని ఉత్సవం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని వివిధ రకాల పూలు, మామిడి తోరణాలతో అలంకరించారు.13న గోపూజ, ఉదయం 11 గంటలకు స్వామి దివ్యకల్యాణ మహోత్సం, రాత్రి ఏడు గంటలకు స్వామివారు మయూర వాహనంపై ఆలయం నుంచి రావివారిపాలెం వరకు గ్రామోత్సవం చేస్తారన్నారు. ముగింపు రోజైన శుక్రవారం స్వామివారిని శేషవాహనంపై గ్రామోత్సవం చేస్తామన్నారు. కల్యాణాన్ని వేలాదిమంది భక్తులు తిలకించేందుకు వీలుగా ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదిక నిర్మించారు. ఇంతకుముందు ఆలయ ప్రాకార మండపంలో కల్యాణోత్సవాన్ని నిర్వహించేవారు. ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులందరూ వీక్షించేలా ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుద్దీప కాంతులతో అలంకరించారు.
2. వైభవంగా అమ్మవారి రథోత్సవం
చిత్తూరు జిల్లాలోని తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా అమ్మవారు అభయం ప్రసాదిస్తూ భక్తజనులను కటాక్షించారు. అంతకుముందు వేకువజామున 3 గంటలకు అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి విశేష పూజలతో ఆరాధించారు. ఉదయం 5 గంటల నుంచి 5.20 గంటల మధ్య శ్రీపద్మావతీ దేవిని రథంపై కొలువుదీర్చారు. ఉదయం 8.15 గంటలకు రథోత్సవం వేడుకగా ప్రారంభమైంది. తిరువీధుల్లో వేలాది మంది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. రాత్రి అమ్మవారికి అశ్వవాహనసేవ జరిగింది.
3. తిరుమలలో ‘ముక్కోటి’కి ప్రత్యేక పూజా క్రతువులు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 18న వైకుంఠ ఏకాదశి, 19న వైకుంఠ ద్వాదశి పర్వదినాల్లో ప్రత్యేక పూజాదికాలు నిర్వహించనున్నట్లు తితిదే తెలిపింది. 18న వేకువజామున 12.30 నుంచి 2 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం పూర్తి చేస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్వర్ణరథోత్సవం జరుగుతుంది. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సహస్రదీపాలంకరణ సేవ, అనంతరం తిరువీధుల్లో స్వామివారి విహారం ఉంటాయి. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. 19న ద్వాదశి పర్వదినాన స్వామివారి పుష్కరిణిలో తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు చేపట్టారు. ఆ రోజు ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య శ్రీచక్రత్తాళ్వార్లను ఊరేగింపుగా పుష్కరిణికి వేంచేపు చేసి చక్రస్నానం చేయించనున్నారు. ఆయా పర్వదినాల సందర్భంగా శ్రీవారికి కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. వేడుకల ఏర్పాట్లపై తిరుమల జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం అధికారులతో సమీక్షించారు.
*వేడుకగా శ్రీవారి ఆలయ శుద్ధి ఘట్టం
తిరుమల శ్రీవారి ఆలయ శుద్ధిలో భాగంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన క్రతువును తితిదే మంగళవారం వైభవంగా నిర్వహించింది. ఈ నెల 18న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తితిదే అధికారులు, సిబ్బంది కలిసి మందిరాన్ని శాస్త్రోక్తంగా పరిశుభ్రం చేశారు. స్వామివారికి వేకువజామున జరిగే కైంకర్యాలు పూర్తయిన తర్వాత ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య తిరుమంజనం జరిగింది. శ్రీవారి గర్భగుడి, కులశేఖరపడి, బంగారు వాకిలి ప్రాంగణాలను శుద్ధి చేసి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చూర్ణాన్ని ఆలయ గోడలకు పూశారు. ఆలయ ద్వారాలకు అలంకరించడానికి తిరుమల జేఈవో శ్రీనివాసరాజు పరదాలను శిరస్సుపై ఉంచుకుని ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా తీసుకెళ్లి స్వామి సన్నిధిలో అర్చకులకు అప్పగించారు.
4. నరసింహావతారంలో భద్రాద్రి రాముడు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడ్ని దర్శించుకున్న భక్తులు ప్రణమిల్లారు. అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధన జరిపి నామార్చనలు చేశారు. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా నరసింహావతారంలో స్వామి దర్శనం ఇవ్వడంతో ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ రూపంలో ఉన్న మూర్తి తిరువీధి సేవలో పూజలు అందుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. నేడు వామనావతారంలో దర్శనం ఇస్తారు.
5. తిరుమల సమాచారం
ఈ రోజు బుదవారం
*12.12.2018*
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: *14C° – 26C°*_
నిన్న *68,698* మంది
శ్రీవారి భక్తులకి కలియుగ
దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
వారి దర్శనభాగ్యం కలిగినది,
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో అన్ని
గదులు భక్తుల తో నిండినది,
స్వామి దర్శనం కోసం బైట
వేచి యున్నారు,
శ్రీవారి సర్వదర్శనానికి
సుమారు *18* గంటల
సమయం పట్టవచ్చును,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.43* కోట్లు,
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు,
*అమ్మవారి బ్రహ్మోత్సవాలు
పంచమీతీర్థం
(ఉ: 11.42 గంటల కి )
ద్వజావరోహణం
(రా: 9.30 గంటల కి )
*తిరుపతి స్థానిక ఆలయ
*సమాచారం(సా: 05 కి):
నిన్న *21,570* మంది
భక్తులకి తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన
భాగ్యం కల్గినది,
నిన్న *4,827* మంది
భక్తులకి శ్రీనివాసమంగాపురం
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర
స్వామి వారి దర్శన భాగ్యం
కల్గినది,
నిన్న *10,470* మంది
భక్తులకు శ్రీ గోవిందరాజ
స్వామివారి దర్శన భాగ్యం
కలిగినది,
నిన్న *1,313* మంది
భక్తులకు అప్పలాయగుంట
శ్రీ పసన్న వేంకటేశ్వర
స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది,
6. నేడు శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన డిసెంబరు 12వ తేదీ బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను పంప‌నున్నారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.ఈ సంద‌ర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టి, శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపడతారు. ఆ త‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలవుతుంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ‌తారు. అక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పిస్తారు.
7. తలనీలాల ఆదాయం బాగు
భక్తులు సమర్పించిన తలనీలాలను బహిరంగ ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించగా దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి రూ.41.12 లక్షల ఆదాయం మంగళవారం లభించింది. తమిళనాడుకు చెందిన ఎంఎస్కే ఎంటర్ప్రైజెస్ (కారైకూడి) సంస్థ తలనీలాలను దక్కించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆన్లైన్లో ఇప్పటికి నాలుగు సార్లు వేలం నిర్వహించగా దేవస్థానానికి రూ.5 కోట్ల వరకు ఆదాయం లభించిందని తెలిపారు. భవానీ దీక్షలు రానున్న తరుణంలో నిల్వ ఉన్న తలనీలాలను వేలం వేసినట్లు చెప్పారు. రెండో రకం తలనీలాలు కిలో ధర రూ.21,210, మూడో రకం ధర రూ.6,210 పలికింది. ఆన్లైన్లో పాడిన సరకును గుత్తేదారు ప్రతినిధులకు అప్పజెప్పామని అధికారులు తెలిపారు. రెండో రకం 106 కిలోలను విక్రయించగా రూ.22.48 లక్షలు, మూడో రకం 300 కిలోలు విక్రయించగా రూ.18.63 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఏఈవో తిరుమలేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ భాస్కర్, సూపరింటెండెంట్లు హేమదుర్గాంబ, డి.వి.వి సత్యనారాయణ, సెక్యూరిటీ అధికారులు నర్సింహరావు, రాఘవయ్య పాల్గొన్నారు.
8. మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్ సతీమణి
శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతీమణి శోభా మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం అమీర్‌పేటలోని కనకదుర్గ అమ్మవారికి కేసీఆర్ సతీమణి శోభా, కుటుంబ సభ్యులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 88 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com