Politics

జైలుకు కేసీఆర్

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపించి జైలుకు పంపడం ఖాయమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ అన్నారు. ఆరేళ్లుగా సీఎం కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి రాష్ట్రంలోని అక్రమ సంపాదన బదిలీ అవుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తాయన్న భయంతోనే దిల్లీ వెళ్లినప్పుడల్లా మోదీ, అమిత్‌షాలకు ఆయన మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నగరపాలక ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ బలోపేతంపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని తరచూ భాజపా నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ మాట్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి అవి ఎందుకు చేరడంలేదని ఠాగూర్‌ ప్రశ్నించారు. దిల్లీలో దోస్తీ-గల్లీల్లో కుస్తీలా తెరాస-భాజపా వ్యవహరిస్తూ ఉండటం వల్లే సీఎం అవినీతి మోదీ ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి సరైన శిక్ష పడాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.