గ్రహదోషాలు పోవాలంటే కార్తికేయుని ఆరాధించాలి

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో “శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి” గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగాతెలుసుకుందాము.
పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న “తారకా సురుడు” అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు. అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.లా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి. కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు “శూలం” మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి “శక్తి” అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి “సర్పరూపం” దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును “శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి”గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున “శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి” వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇటువంటి పుణ్యప్రదమైన “శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి” నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.
***పండుగ విశేషాలు
ఈనాడు ఉదయాన్నే స్నానం చేయటం, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. “సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి” అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్య మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో, షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ.తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది.ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి? అని అనేవారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి. మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీక్కుతినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది. ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గంథాలు పేర్కొంటున్నాయి.సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పుజలందుకోవటం జరుగుతుంది.
1. కృత్తికలు పెంచిన శివ పుత్రుడు.
తారకాసురుణ్ని సంహరించడానికి పార్వతీపరమేశ్వరులకు జన్మించినవాడు సుబ్రహ్మణ్యుడు. కార్తికేయుడు, కుమారస్వామి, స్కందుడు, శరవణభవుడు.. ఇలా ఎన్నో పేర్లు ఆయనకు. కుమారస్వామి కార్తిక శుద్ధ షష్ఠి నాడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కుమార సంభవం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పార్వతీపరమేశ్వరులు ఏకాంతంగా ఉండగా.. అగ్ని దేవుడు పావురం రూపంలో వారి మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన శివుడు తన దివ్య తేజస్సును అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. ఆ శివతేజాన్ని భరించలేని అగ్ని.. దానిని గంగా నదిలో వదిలిపెడతాడు. గంగ సైతం శివతేజాన్ని తట్టుకోలేక.. రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. ఆ తేజస్సులో నుంచి ఆరు ముఖాలున్న ఒక బాలుడు ఉదయించాడు. అతడే కార్తికేయుడు. ఆరుగురు కృత్తికలు ఆ బాలుడిని పెంచుతారు. తర్వాతి కాలంలో కార్తికేయుడు దేవతల సేనాధిపతి అయ్యాడు. సైన్యాధ్యక్షుడిగా వెళ్లి తారకాసురుణ్ని సంహరించిన మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకొంటారు. దేవసేనతో సుబ్రహ్మణ్యుడి కల్యాణం జరిగింది కూడా మార్గశిర శుద్ధ షష్ఠి నాడే అని భావిస్తారు. ఈ క్రమంలో ఆనాడు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
2. 15న కాలభైరవాష్టమి -అనుమతి తీసుకోవాల్సిందే.
కాలభైరవుడు సాక్షాత్తూ పరమశివుడి అవతారమే! ఆయన ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా చేసుకోవడం ఆనవాయితీ. కాలస్వరూపంగా భావించే భైరవుడు.. కాలం లాగానే తిరుగులేని వాడు. శివుడి హూంకారం నుంచి ఉద్భవించిన ఈ మహాకాయుడు బ్రహ్మ ఐదో శిరస్సును ఖండించినట్లుగా పురాణ గాథ. ఈయన వాహనం శునకం. కాశీ క్షేత్రపాలకుడిగా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. కాశీపురికి వచ్చే కొత్వాల్ కూడా తొలుత భైరవాలయానికి వెళ్లి ఆయన అనుమతి తీసుకొని విధుల్లో చేరడం అక్కడి ఆచారం.
3. 17 నుంచి శ్రీవారికి సుప్రభాత సేవ రద్దు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి నిత్యం తెల్లవారుజామున నివేదించే సుప్రభాత సేవను ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు తితిదే రద్దు చేయనుంది. ధనుర్మాసం నేపథ్యంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నివేదనను ప్రవేశపెట్టనుంది. ధనుర్మాసం ఘడియలు ఈనెల 16న సాయంత్రం 5.19 గంటలకు ప్రారంభమై జనవరి 14న పరిసమాప్తం కానున్నాయి. ఈ నెల రోజులపాటు అర్చకులు శ్రీకృష్ణస్వామివారికి తిరుప్పావై పారాయణంలోని ప్రవచనాలను ఏకాంతంగా నివేదిస్తారు.
4. భద్రాద్రి రాముడి వామన రూపం
ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా, భద్రాద్రి సీతారామ ఆలయంలో బుధవారం స్వామివారు వామనావతారంతో దర్శనమిచ్చారు. ఉత్సవ మూర్తుల్ని ఊరేగింపుగా మాడవీధుల్లోకి తేవడంతో, భక్తులు కోలాటాలతో స్వాగతం పలికారు. మిథిలా ప్రాంగణంలో
తీర్ధప్రసాదాల అనంతరం హారతులు అందించారు. స్వామి గురువారం పరశురామావతారంలో దర్శనమిస్తారు.
5. శబరిమలలో ఆంక్షలు తొలగించండి- కేరళ హైకోర్టు
శబరిమల ఆలయం వద్ద ఆంక్షలను ఎత్తివేయాలని పోలీసులను కేరళ హైకోర్టు ఆదేశించింది. అలాగే సన్నిధానం, ఇతర ప్రధాన ప్రాంతాల్లో భక్తులను అడ్డుకునేందుకు ఏర్పాటుచేసిన బారికేడ్లను ప్రతిరోజూ ఉదయం 11.30 గంటల తర్వాత తొలగించాలని జస్టిస్ రామచంద్ర మీనన్, జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. భక్తుల రద్దీకి అనుగుణంగా.. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
6. తిరుచానూరు బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజైన బుధవారం ఉదయం పంచమితీర్థం (చక్రస్నానం) నేత్రానందంగా సాగింది. తిరుమల నుంచి శ్రీవారి తరపున తీసుకొచ్చిన సారెతో పాటు అమ్మవారి జన్మదిన కానుకగా 1.74 కిలోల బంగారు కాసుల హారం, 776 గ్రాముల బంగారు కుంభహారతిని కానుకగా సమర్పించారు. అర్చకులు చక్రాత్తాళ్వార్లకు పుష్కరిణిలో మూడుసార్లు మునక వేయించారు. అనంతరం 2లక్షల మంది భక్తులు పద్మసరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ అమ్మవారు ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
7. కాశీ యాత్ర అలా చేస్తే.
ఏ తీర్థయాత్రకైనా పరమార్థం తనలో ఉన్న పరమాత్మను ఆ క్షేత్రంలోని దివ్యమంగళ విగ్రహరూపంలో దర్శించటమే. ఇలా దర్శించే ప్రయత్నంలో చేసే యాత్రలలో కాశీ-రామేశ్వరం-కాశీ సందర్శనను సంపూర్ణ యాత్రగా పెద్దలు చెప్పారు. కాశీ క్షేత్రం ఉత్తర భారతంలో (పై భాగంలో) ఉంటుంది. రామేశ్వరం దక్షిణ భారతంలో (కింది భాగంలో) ఉంది. ఉత్తర దిశ నుంచి దక్షిణానికి వచ్చి, మళ్లీ ఉత్తరానికి చేరితే.. ఒక ఆవృత్తి పూర్తవుతుంది. కనుక దీనిని సంపూర్ణ యాత్ర అన్నారు. కాశీ నుంచి నేరుగా రామేశ్వరానికి వెళ్లి. అక్కడి నుంచి మళ్లీ కాశీకి చేరుకోవడం మాత్రమే సంపూర్ణ యాత్ర కాదు. పూర్వం కాశీ క్షేత్రం నుంచి వరసగా యాత్రలు చేస్తూ దక్షిణాపథంలోని రామేశ్వరం చేరుకునేవారు. రామేశ్వరం నుంచి మళ్లీ మరో మార్గంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కాశీకి చేరుకునేవారు. ఇలా దేశంలోని ప్రముఖ క్షేత్రాలు దర్శించుకోవడం వల్ల దీనిని సంపూర్ణయాత్రగా పరిగణించేవారు. దీనికి ప్రతీకగా.. కాశీలోని గంగా జలం తెచ్చి రామేశ్వరంలోని సముద్రంలోనూ, రామేశ్వర తీరంలోని సైకతాన్ని (ఇసుక) తీసుకెళ్లి కాశీలోని గంగలో కలపడం ఆచారంగా వచ్చింది.
8. తెలుగు రాష్ట్రాల్లో వీరే సీఎంలుగా ఉండాలి
తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉంటేనే తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధిని సాధిస్తాయని సినీనటుడు సుమన్‌ అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్న ఆయన.. తెలంగాణలో తాను కోరుకున్నట్లుగానే తెరాస మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలుగు ప్రజలకు మేలు జరిగేలా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని కోరారు.
9. శంభుకుమారా.. వల్లీనాథా.. సుబ్రహ్మణ్యా
కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్యాణ వేడుకలకు షష్టి మహోత్సవాలకు సిద్ధమయ్యారు. కొలిచేవారికి కొంగు బంగారంగా నిలిచే సింగరాయపాలెం, చేవూరుపాలెం కూడలిలో వేంచేసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో వైభవోపేతంగా ఏటా నిర్వహించే షష్ఠి మహోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా మార్గశిర శుద్ధ పంచమి నుంచి మార్గశిర బహుళ విదియ వరకు 13 రోజులపాటు అత్యంత కనుల పండువగా షష్ఠి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వీటి కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎక్కడ రద్దీ ఉందో, ఎప్పటికప్పుడు పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టనున్నారు.
10.తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 16గంటల సమయం పడుతోంది. అలాగే మొత్తం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్‌స్లాట్‌ పొందిన భక్తుల దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కాగా… తిరుమల శ్రీవారిని నిన్న 72, 957 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.43 కోట్లని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
11. ఆన్ లైన్ లో వరసిద్ధుడి సేవా టిక్కెట్లు -జనవరి ఒకటి నుంచి అమల్లోకి. – తదితర ఆద్యాత్మిక వార్తలు
స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే సేవా టిక్కెట్ల విక్రయాన్ని కంప్యూటరీకరణ చేశారు. అలాగే సేవా టిక్కెట్లను పొందే భక్తులకు ఆధార్ను తప్పని సరి చేశారు. స్వామివారి సేవా, వసతి, ఇతర ఆలయ సేవలకు సంబంధించిన టిక్కెట్లను ఇకపై ఆన్లైన్ ద్వారా భక్తులు పొందే సౌలభ్యానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కరసరత్తు జరుగుతోంది. ఇదే ప్రక్రియపై ఇటీవల అమరాతిలో జరిగిన ప్రత్యేక సమావేశానికి ఆలయ ఈవో, సంబంధిత అధికారులు వెళ్లి వచ్చారు. భక్తులకు ఎంత మేరకు టిక్కెట్లు అవసరం ఉంటుందన్న దానిపై కరసత్తు ప్రారంభించారు.
**ఎంతో సులువు
ప్రస్తుతం స్వామివారి సేవా, వసతి, ఇతర సేవలకు సంబంధించిన టిక్కెట్ల కొనుగోలుకు భక్తులు స్వయంగా రావాల్సి ఉంది. రాష్ట్ర దేవాదాయశాఖకు సంబంధించి శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం, సింహాచలం వంటి ప్రధాన ఆలయాల్లో భక్తులకు ఇది వరకే ఆన్లైన్ సేవలను ప్రారంభించారు. ఇక్కడ అదే విధంగా కొనసాగించాలన్న దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు…. ఇక్కడి ఆలయ అధికారులు అందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో టిక్కెట్లను ఉంచడం వల్ల ఆలయ ఖ్యాతి మరింత పెరగనుంది. ప్రస్తుతం భక్తులు స్వయంగా వచ్చి టిక్కెట్ల కోసం ప్రయత్నించడం… సమయానికి అవి లభించకపోవడంతో పలువురు నిరాశగా వెనుతిరుగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ఆన్లైన్ సేవలను ప్రారంభించనున్నారు.
**30 శాతం మేరకు కేటాయింపు…
స్వామివారి భక్తుల కోసం ఎంత మేరకు టిక్కెట్లను ఆన్లైన్లో కేటాయించాలన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులకు 30 శాతం మేరకు టిక్కెట్లను కేటాయించడం వల్ల న్యాయం జరుగుతుందని తేల్చారు. ఉదాహరణకు.. స్వామివారి ఆలయంలో నిత్యం మూడు కాలాలు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఇందు కోసం ప్రత్యేక కాలానికి 25 టిక్కెట్లను విక్రయిస్తుంటారు. ప్రస్తుతం 30 శాతం మేరకు అంటే.. నిత్యం 9 టిక్కెట్లను ఆన్లైన్లో పెట్టనున్నారు. మిగిలిన 16 టిక్కెట్లను విక్రయ కేంద్రంలో భక్తులకు అందుబాటులో ఉంటాయి. స్వామివారికి సంబంధించి సుమారు 200 గదులున్నాయి. ఇందులో రోజుకు 60 గదులను ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు మేలు చేకూరనుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com