Politics

పోలీసుల మధ్య విభేదాలు. అఖిల కిడ్నాప్ కేసు నిందితులతో కుమ్మక్కు.

పోలీసుల మధ్య విభేదాలు. అఖిల కిడ్నాప్ కేసు నిందితులతో కుమ్మక్కు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో పోలీసుల పట్టు క్రమంగా సడలుతోంది. నిందితులందరినీ నాలుగైదు రోజుల్లో అరెస్టు చేస్తామంటూ పోలీస్‌ ఉన్నతాధికారులు నాడు ప్రకటించారు. ఈ కేసులో ప్రథమ ముద్దాయి మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె ఆదేశాలను పాటించిన వారిని మినహా సూత్రధారులు భార్గవరామ్, గుంటూరు శ్రీను, పాత్రధారులైన భార్గవరామ్‌ తల్లి కిరణ్మయి, భూమా అఖిల ప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డిలను పోలీసులు పట్టుకోలేదు. భార్గవ రామ్, శ్రీనులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్న ఉన్నతాధికారులు.. నెల రోజులు దాటినా వారి ఆచూకీని గుర్తించలేకపోయారు. వీరిద్దరితో పాటు పారిపోయిన నిందితులు సైతం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి సురక్షితంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

అఖిలప్రియ భర్త భార్గవరామ్, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల్లోని సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తెలిసింది. ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ అనంతరం నిందితులను పట్టుకున్నప్పుడు తామే అంతా చేశామంటూ రెండు ప్రత్యేక బృందాల్లో సభ్యులు ఉన్నతాధికారులకు చెప్పుకొని అభినందనలు అందుకున్నారు. అఖిల ప్రియ ఆచూకీతో సహా ఆమె అనుచరులు ఎక్కడున్నారన్న విషయాన్ని తెలుసుకుని పట్టుకున్నామని, పేరు మాత్రం వేరే బృందాల వారికి వచ్చిందని మరో బృందం సభ్యులు భావించారు. దీంతో అప్పటి నుంచి ఇతర నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలు సమాచారం సేకరిస్తున్నా…పరస్పరం సహకరించుకోవడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.

ఈ కిడ్నాప్‌ కేసులో నిందితులుగా ఉన్న కొందరు వ్యక్తులు తమను అరెస్టు చేయకుండా సమీకరణాలను ‘సరి’ చేసుకున్నట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా ఇస్తాం..దర్యాప్తు ప్రక్రియలో సహకరిస్తాం అంటూ పోలీసులకు చెప్పిన ఆ వ్యక్తులు అఖిల ప్రియ అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలను పరిశీలించి జైలుకు వెళ్లడం శ్రేయస్కరం కాదని అనుకున్నట్టు సమాచారం. దీంతో పక్క రాష్ట్రంలోని పోలీసులతో సంబంధాలున్న వారు.. హైదరాబాద్‌లో ప్రభావం చూపించే వారితో ‘మాట్లాడుకున్నట్టు’ తెలిసింది. మరికొందరు నిందితుల గురించి తామే సమాచారం చెబుతామని ఇందుకు ప్రతిగా పోలీస్‌ విభాగం తమకు సహకరించాలంటూ వారు అభ్యర్థించినట్టు సమాచారం. దీంతో సదరు వ్యక్తులు పోలీసు ‘గురి’ నుంచి తప్పించుకున్నారని తెలిసింది.