మీ బిడ్డల భవితను మీరే నాశనం చేస్తున్నారు

ఐజెన్స్‌– 1995 తర్వాత పుట్టిన పిల్లలు. స్మార్ట్‌ ఫోన్‌ యుగంలో తమ కౌమార దశనంతా గడుపుతున్న మొదటి తరం బిడ్డలు. వీరు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సోషల్‌ మీడియాలో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం వంటి వ్యాపకాలకు వెచ్చిస్తున్న సమయం చాలా తక్కువ. ఈ జీవనశైలి పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ముందు తరాలవారితో పోల్చుకుంటే పలు జీవన నైపుణ్యాల్లో వారు వెనకబడి పోతున్నారని అమెరికాలోని శాండియాగో స్టేట్‌ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్‌ కన్సెల్టింగ్‌ ఫౌండర్‌ వైద్యురాలు జీన్‌ త్వెంగె చెప్పారు. వీటికి అదనంగా ఒంటరితనంతో పాటు ఇతర మానసిక సమస్యలకు లోనవుతారని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్‌ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై మరింత ప్రభావం చూపుతూ.. వారి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. జీన్‌ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరచి చెప్పింది. టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై ఈ పరిశోధకురాలు అధ్యయనం చేస్తున్నారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్‌ యుగం పిల్లల్లో మాససిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్‌ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్‌ త్వెంగె. ‘2011–12లో ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోయినట్టు భావిస్తుండటం వంటి లక్షణాలు గమనించాను. ఇవన్నీ డిప్రెషన్‌ లక్షణాలు. ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయి’అని జీన్‌ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు. మరోవైపు ఆలిఘర్‌ ముస్లిం యూనివర్సిటీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ కలసి జరిపిన అధ్యయనం ప్రకారం.. మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్‌ చేసుకుంటున్నారు. ఫోన్‌ చూసుకోకపోతే ఏదో మిస్‌ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
*** ఇవి గుర్తుంచుకోండి
రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్‌ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి, ఆనందానికి దోహదపడుతుంది.
అయితే డిజిటల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుందని ఆమె చెప్పారు.
మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు మాత్రమే సోషల్‌ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్‌ అవసరం లేదని భావిస్తే ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ఫోన్‌ మాత్రమే ఇవ్వాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com