Politics

వైకాపాకు 1259 తెదేపాకు 918

వైకాపాకు 1259 తెదేపాకు 918

తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తెదేపా సైనికులు ప్రాణాలు ఎదురొడ్డి అనేక స్థానాల్లో ఘన విజయం సాధించారని ఆ పార్టీ పేర్కొంది. మంగళవారం రాత్రి 11 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం.. 918 చోట్ల తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలిచారని వారు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలతో వైకాపా పతనం ప్రారంభమైందంటూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమా, అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘షర్మిల పార్టీ పెట్టిన మూహూర్తమో, ఏమో గానీ మంగళవారం నుంచి వైకాపా పతనం ప్రారంభమైంది. తొలిదశలో 500కు పైగా ఏకగ్రీవాలు సాధించామని వైకాపా నేతలు ప్రచారం చేసుకుంటున్నా.. అందులో 150 వరకు అసత్యాలే. మాపార్టీ మద్దతుతో గెలిచిన వారందర్నీ తెదేపా కార్యాలయంలో ప్రదర్శనకు పెట్టగలం. వైకాపా ఆ ధైర్యం చేయగలదా? గ్రామాల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు ఈ తొలిదశ ఎన్నికల్లో సుస్పష్టమైంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. ఆ పార్టీ ఇంకా 40 నెలలు అధికారంలో ఉంటుందని తెలిసినా… భయపడకుండా తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 900కి పైగా స్థానాల్లో తెదేపాను ప్రజలు గెలిపించారు. అమరావతి చుట్టుపక్కల రెండు జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలో రూ.10-12 కోట్లు ఖర్చుపెట్టారు. తెదేపా సర్పంచి గెలుస్తుంటే.. నిద్రొస్తోందని అధికారులు వెళ్లిపోయారు. కొన్ని చోట్ల కరెంటు తీసేసి.. కొన్ని చోట్ల తలుపులు మూసేసి.. ప్రకటించని ఫలితాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న కార్యకర్తలకు నాయకులు సెల్యూట్‌’ అని పేర్కొన్నారు.