Politics

కేసులకు భయపడకండి. నాలాగా ఉండండి.

కేసులకు భయపడకండి. నాలాగా ఉండండి.

తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా వెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలింగ్‌, జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మంగళవారం నేతలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఓటమి భయంతోనే హోంశాఖ మంత్రి నియోజకవర్గంలో వైకాపాకు మద్దతుగా పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త సునీల్‌ కుమార్‌, తెదేపా మండల అధ్యక్షుడిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తక్షణమే వారిని విడిచిపెట్టాలి’’ అని పేర్కొన్నారు. రామకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా దౌర్జన్యం చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘‘తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెదేపా బలపరిచిన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే ఉద్దేశంతో తుది జాబితా ప్రకటించకుండా ఎమ్మెల్యే ద్వారకానాథ్‌ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇందుకు ఎంపీడీఓ దివాకర్‌ రెడ్డి, ఎస్‌ఐ సహదేవి సహకరిస్తున్నారు’ అని చంద్రబాబు డిమాండ్‌చేశారు. ‘పొట్లపాలెం సర్పంచి అభ్యర్థి అదృశ్యంపై ఎందుకు కేసు నమోదు చేయలేదు. అభ్యర్థిని దాచారనే సమాచారంతో పోలీసుల సమక్షంలో పరిశీలనకు వెళ్లిన కొల్లు రవీంద్రపై మరోసారి తప్పుడు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు. బెయిల్‌పై విడుదలైన అచ్చెన్నకు ఫోన్‌ చేసి చంద్రబాబు పరామర్శించారు.
* వైకాపా విధ్వంస విధానాలతోనే విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పెంటకోటలో తెదేపా కార్యకర్త కాశీరాం బలవన్మరణానికి పాల్పడ్డారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
* ‘మంత్రి బాలినేని స్వగ్రామం కొణిజేడులో ప్రత్యర్థి అభ్యర్థులపై దౌర్జన్యం చేయించటం దుర్మార్గం’ అని ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు.