ఆదర్శప్రాయుడు యడ్లపాటి

నూరేళ్ళ ఎడ్లపాటి జీవితం…. కావాలి అందరికి ఆదర్శం…
రాజకీయ కురువృద్ధుడు శ్రీ యడ్లపాటి వెంకటరావు గారు ఈనెల 16 వ తేదీన 99 ఏళ్ళు నిండి 100 వ ఏట అడుగిడనున్నారు. 1919 డిసెంబర్ 16 వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అమృతలూరు మండలం బోడపాడులో ఓ రైతు కుటుంబంలో జన్మించారాయన.
**స్వగ్రామం – బాల్య స్మృతులు
మొదటినుంచీ ఆయనకు వ్యవసాయమంటే ప్రాణం. అందుకే ఆయనెప్పుడూ రైతు పక్షపాతి. ‘ భారతదేశం గ్రామ సీమలలోనే ఉంది’ అనే మహాత్మా గాంధీ సూక్తి అక్షర సత్యం అంటారాయన. గ్రామం సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందనీ, చితికిపోయిన గ్రామీణ రైతాంగ కుటుంబాల వారు పూలు అమ్మినచోటనే కట్టెలు అమ్మలేక పట్టణ ప్రాంతాలకు వలసపోయి కూలీలుగా జీవిస్తూ ఉండడం దారుణమని ఆయన వాపోతారు. తన బాల్యంలో తమ గ్రామంలో ఏ కులం వారైనా ఒకరితో మరొకరు కలిసి మెలిసి ఉండేవారనీ, ఏ కులం వారైనా అందరూ ఒకరినొకరు పేర్లు పెట్టి కాక వరుసలతో పిలుచుకునేవారనీ చెప్పి, తమ ఇంట్లోనే నాయీ బ్రాహ్మణులు, రజకులు మొదలైన సామాజికంగా వెనుకబడిన కులాలవారితో తరచు తాము సహపంక్తి భోజనాలు చేసేవాళ్లమని తన బాల్య స్మృతులను నెమరు వేసుకుంటారాయన. కార్తిక మాసంలో ఒకప్పుడు జరిగిన సామూహిక వనభోజనాల స్థానంలో ప్రస్తుతం జరుగుతున్న ‘కుల భోజనాల’ పట్ల ఆయన తన నిరసన తెలియజేస్తారు.
***న్యాయవాద వృత్తిలోంచి రాజకీయాల్లోకి
ప్రతిష్ఠాత్మకమైన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఆయన విద్యాబ్యాసం సాగింది. న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యాక ఆయన తెనాలిలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. యువకునిగా ఉండగానే రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారాయన. ప్రముఖ రైతునేత ప్రొఫెసర్ యన్. జి. రంగా గారి ప్రియ శిష్యులలో యడ్లపాటి ఒకరు. ఆయన రంగాగారితో పాటు 1951 లో కృషీకార్ లోక్ పార్టీ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ తరువాత 1967 లో సి.రాజగోపాలాచారిగారు స్థాపించిన స్వతంత్ర పార్టీలో ఆయన చేరారు. వేమూరు నియోజక వర్గం నుంచి 1967, 1972 ఎన్నికలలో స్వతంత్ర పార్టీ తరఫున శాసన సభ్యునిగా పోటీ చేసి గెలిచారు. 1972 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభంజనానికి తట్టుకోలేక గౌతు లచ్చన్న గారివంటి స్వతంత్ర పార్టీ నేతలు సైతం ఓడిపోయిన నేపథ్యంలో మొత్తం కోస్తా జిల్లాలనుంచి వెంకట్రావు గారు మాత్రమే వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి , రాయలసీమనుంచి బండారు రత్నసభాపతి గారు ఒక్కరే స్వతంత్ర పార్టీ శాసనసభ్యులుగా గెలవడం విశేషం. తరువాత భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి, వెంకట్రావుగారు 1978 అసెంబ్లీ ఎన్నికలలోనూ అదే వేమూరు నియోజకవర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. డా. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆయన ప్రణాళిక, న్యాయ శాఖా మంత్రిగా పనిచేశారు. తరువాత సివిల్ సప్లయిస్ శాఖా మంత్రిగా కొంతకాలం, వ్యవసాయ శాఖామంత్రిగా మూడేళ్లు పనిచేశారు. కీ. శే. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ ( APIDC ) అధ్యక్ష పదవి లభించింది. ఆ హోదాలో ఆయన అమెరికాలోని షికాగోలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( TANA – తానా) మహాసభలకు హాజరయ్యారు. అక్కడి పారిశ్రామిక వేత్తలతో పెట్టుబడుల సమీకరణ విషయమై చర్చలు జరిపారు. అమెరికాతోపాటు క్రొయేషియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాలలోనూ ఆయన పర్యటించారు. రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమలన్నీ సందర్శించి, వారి సహకారంతో చెరకు రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. అదే పదవిలో ఉండగా 1983 లో యన్టీఆర్ పిలుపు మేరకు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. వాస్తవానికి కాంగ్రెస్ నుంచి సంక్రమించిన ఎపిఐడిసి అధ్యక్ష పదవీకాలం అప్పటికి ఇంకా రెండేళ్లు మిగిలి ఉన్నా విలువలకు కట్టుబడి తెదేపాలో చేరే సందర్భంలో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ పదవీ పరిత్యాగం విషయాన్ని మెచ్చుకుంటూ ఎన్ టి ఆర్ తన ముత్యాల కోవల వంటి చేవ్రాతతో స్వయంగా తనకు ఏడు పేజీల లేఖ రాశారని తెలిపారాయన. ఆయన మొదటినుంచీ పార్టీ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆ నాటి నుంచీ నేటి వరకూ ఆయన తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాసపాత్రునిగా వ్యవహరిస్తూ, పార్టీ నిర్మాణంలో – ప్రత్యేకించి రైతు విభాగంలో- గణనీయమైన సేవలు అందిస్తున్నారు. తెదేపా ఆయనకు పార్టీలో అత్యంత గౌరవనీయమైన స్థానం కల్పించింది. తెదేపా హయాంలో ఆయన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, కర్షక పరిషత్ సభ్యునిగా పనిచేశారు. పార్టీ రైతు విభాగం ‘తెలుగు రైతు’ కు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గానూ పనిచేశారు. 1998 లో పార్టీ ఆయన్ని రాజ్య సభకు ఎంపిక చేసి గౌరవించింది. ఆయన ఆరేళ్లపాటు 2004 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ది. 13-12- 2001 నాడు ఢిల్లీ లోని భారత పార్లమెంటు భవనం మీద పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాయుధ దాడి చేసిన సందర్భంలో తాను పార్లమెంటు భవనంలోనే ఉన్నట్లు తెలిపి, ఆయన నాటి భయానక ఘటనను నాకు కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత నమ్మకపాత్రంగా కొనసాగుతున్న యడ్లపాటి వెంకట్రావు గారిని పార్టీలో అందరూ ‘పెద్దాయన’ అంటూ గౌరవంగా సంబోధిస్తుంటారు. ఆయన ఏ పదవిలో ఉన్నా, లేకున్నా పార్టీ అధ్యక్షుని మొదలు సామాన్య కార్యకర్త వరకూ అందరూ ఆయన మాటకు విలువిస్తారంటే అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. పార్టీ విధాన నిర్ణయాల్లో – ముఖ్యంగా రైతాంగ సమస్యలకు సంబంధించిన నిర్ణయాలలో- ఇంకా ఆయనమాట చెల్లుబడి కావడం విశేషం.పాల ఉత్పత్తిదారులను సంఘటితంచేసి సహకార సంఘాలను ఏర్పరచడంలో ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ అధ్యక్షునిగా వ్యవహరిస్తూ, 1976 లో నేషనల్ డెయిరీ డెవలప్ మెంటు బోర్డు నేతృత్వంలో, ఇండియన్ డెయిరీ కార్పొరేషన్ ఆర్థిక సాయంతో గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని వడ్లమూడిలో ‘సంగం డెయిరీ’ ని స్థాపించడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. గుజరాత్ లోని అమూల్ డెయిరీ తరువాత దేశంలో ఇదే అతిపెద్ద డెయిరీ కావడం విశేషంసరిగ్గా ఏడేళ్ల క్రితం, ఇదేరోజున శ్రీ యడ్లపాటి 92వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన రాసుకున్న ఆత్మకథ ‘నా జీవన గమనం’ ఆవిష్కరించబడింది. ఆయన జీవితపు వెలుగునీడలకు అద్దం పట్టే రచన అది. రైతులు ఆయనకు ఆరో ప్రాణం. ఆయన్ని ఎప్పుడు కదిలించినా రైతాంగం నేడు ఎదుర్కొంటున్న సమస్యలనే ఏకరవు పెడతారు. రైతుల నేటి దయనీయ స్థితి పట్ల, దేశంలో- ప్రతేకించి తెలుగు రాష్ట్రాలలో- నానాటికీ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యల పట్ల ఆయన తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతుల ఆలోచనా ధోరణిలోనూ మార్పురావాలంటారాయన. కాలం చెల్లిన సాగు పద్ధతులకు స్వస్తిచెప్పి, ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని వీలైన మేరకు ఆకళింపు చేసుకుంటూ, అధునాతన శాస్త్రీయ వ్యవసాయ రీతులలో సాగుకు రైతులంతా ముందుకు రావాలనేది ఆయన అభిమతం. నీటిని పొదుపుగా వాడుకుంటూ, చవకైన సేంద్రియ సాగు పద్ధతులు పాటిస్తూ, అధిక దిగుబడినిచ్చే వంగడాలతో రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకోవచ్చని సూచిస్తారాయన.ఇజ్రాయెల్ ప్రభుత్వ ఆహ్వానం మీద అక్కడికి వెళ్లి, అక్కడి నీటివినియోగం, ఆధునిక సాగు పద్ధతులను పరిశీలించి వచ్చిన కడప జిల్లా రాజంపేటకు చెందిన సహచర యం. యల్. ఏ.
శ్రీ బండారు రత్నసభాపతిని శ్రీ యడ్లపాటి ఒకప్పుడు తెనాలికి రావించి, తన ఇంటి ఆవరణలోనే జరిగిన ఒక పెద్ద రైతు సదస్సులో రత్నసభాపతి గారి ప్రసంగం ఏర్పాటు చేసి, తెనాలి ప్రాంత రైతులందరికీ ఆధునిక డ్రిప్, స్పింక్లర్ ఇరిగేషన్ పద్ధతుల గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు. అలాంటిది ఆయనకు రైతు సంక్షేమం పట్లగల శ్రద్ధ !!
కర్షక నేత ప్రొ. ఎన్.జి. రంగా గారి జీవితాశయమైన ‘ రైతు – కూలీ ప్రజారాజ్యం’ సాధనే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తే గ్రామాలకు వెనుకటి వైభవం, కళ తప్పక వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. చైనీస్ తమ గ్రామాలను అభివృద్ధి చేసిన నమూనాలో మన గ్రామాలను కూడా అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచిస్తారు. మాజీ రాష్ట్రపతి కీ.శే. అబ్దుల్ కలాం కలలుగన్న PURA ( Providing Urban facilities in Rural Areas ) ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు బదలాయించడం (Technology Transfer ) జరిగితే, గ్రామాలలో ఇక వెనకబాటుతనం అనేదే ఉండదనీ, గ్రామసీమలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయని ఆయన గట్టిగా నమ్ముతారు.
ఎన్టీఆర్ తో ఆయనకున్న అనుబంధం గొప్పది. తాను ‘తెలుగు రైతు’ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒకసారి శ్రీశ్రీ స్వదస్తూరితో ముద్రించబడిన ‘ మహాప్రస్థానం ‘ కావ్యాన్ని తీసుకెళ్లి బహుమతిగా ఆయనకిస్తే, ఆయన ఒక్కసారి ఆప్యాయంగా ఆ పుస్తకం కేసి చూసి, ఇక ఆశువుగా ‘మహాప్రస్థానం’ లోని గేయాలన్నీ ఒక్కొక్కటిగా అప్పజెప్పడం మొదలెట్టారట. ఎన్ టి ఆర్ అపూర్వమైన ధారణాశక్తి, సాహిత్యం పట్ల ఆయనకున్న ఆసక్తి, భాషమీద ఆయనకున్న అసాధారణమైన పట్టు చాలా అరుదైనవంటారు వెంకట్రావుగారు. మరీ ముఖ్యంగా
‘ పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలంపై హేమం పిండగ’, ‘ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోయ్’ అంటూ ఎన్ టి ఆర్ శ్రీశ్రీ గేయాలను ఆలపించిన తీరు తనను ఆకట్టుకుందని అంటారాయన. ఆరోజు సిబ్బందికి ఇక లోనికి ఎవ్వరినీ అనుమతించవద్దని చెప్పిన ఎన్ టి ఆర్ తాను స్వయంగా కొన్ని శ్రీ శ్రీ గేయాలు అనర్గళంగా పాడి వినిపించి, ఇంకొన్నింటిని తనచే పాడించుకుని విన్నారని చెపుతూ ఆ మహా మనీషితో తన లోతైన అనుబంధాన్ని ఒకసారి తిరిగి గుర్తుచేసుకున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయనది అరుదైన వ్యక్తిత్వమని, తనను ఆయనెప్పుడూ ‘పెద్దాయనా’ అంటూ గౌరవిస్తారని తెలిపారు. ‘డెల్టా రూప శిల్పి’ సర్ ఆర్థర్ కాటన్ ని ప్రజలు నేటికీ ఎలా మరచిపోలేదో మన రైతాంగం కూడా చంద్రబాబునూ అలాగే మరచిపోరన్నారాయన. ‘అపర భగీరథుని’ లా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కనీవినీ ఎరుగనిరీతిలో అతి వేగంగా పూర్తిచేసి, నదుల అనుసంధానాన్ని సాకారం చేసి, వృథాగా పోతున్న గోదావరి మిగులుజలాలను వినియోగంలోకి తేవడం ద్వారా కృష్ణా డెల్టాలో 12,000 కోట్ల రూపాయల పంటలను కాపాడి, మరోవైపు కృష్ణానది నీటితో రాయలసీమ ప్రజల దాహార్తిని, వారి సాగునీటి అవసరాలను కూడా తీర్చే యోచనను సాకారం చేసిన విజన్ కలిగిన ‘ఆధునిక ఋషి’ చంద్రబాబు అన్నారాయన. సగటు రాజకీయ నేతలకు భిన్నంగా, అలవాట్లకు అతీతంగా, ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే చంద్రబాబు పాలన ఈ దశలో రాష్ట్ర ప్రజలకు మరింతకాలం అవసరమన్నారాయన. ఎన్ టి ఆర్ చివరి దశలో తెదేపా లో జరిగిన అంతర్గత పరిణామాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆనాడు చంద్రబాబు సాధారణ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కఠినంగా వ్యవహరించి ఉండకపోతే ఈనాడు అసలు తెలుగుదేశం పార్టీయే అస్తిత్వంలో ఉండేదికాదన్నారాయన.ఆయన్ని నేను అడపాదడపా వారి ఇంటికి వెళ్లి కలుస్తూ ఉంటాను. ఈ వయసులో కూడా ఆయన నేను రాసిన పుస్తకాలనూ, పేపర్లలో నేను రాసే వ్యాసాలనూ ఎప్పటికప్పుడు ఆసక్తిగా చదువుతూ, నేను కలిసినప్పుడు గుర్తుపెట్టుకుని వాటిని ప్రస్తావించి మరీ, ఆ యా విషయాలమీద తన అభిప్రాయాలను నాతో పంచుకోవడం విశేషం. నా శ్రీమతి రాజ్యలక్ష్మి మూలంలో వెంకట్రావుగారి స్వగ్రామమైన బోడపాడుకే చెందిన యడ్లపాటి వారి ఆడపడుచు కావడంతో, ఆయన కనిపించినప్పుడల్లా ‘మా అమ్మాయి ఎలా ఉంది ?’ అంటూ కుశల పరామర్శ చేస్తారు. ( రాజ్యలక్ష్మి తాతగారు కీ. శే. యడ్లపాటి పోతయ్యగారు, ఆయన ఐదుగురు సోదరులు ఎనభై ఐదు ఏళ్ళ క్రితం బోడపాడు నుంచి ముందుగా వ్యవసాయం కోసం కృష్ణా జిల్లా చల్లపల్లి సమీపంలోని లక్ష్మీపురానికి వెళ్ళగా, ఆ తరువాత 1950 ప్రాంతాలలో ఆ ఐదుగురు అన్నదమ్ములలో ఇద్దరి సంతానం వ్యవసాయ రీత్యా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కృష్ణానగర్ క్యాంప్ కు వెళ్లి అక్కడే స్థిరపడడం జరిగింది. రాజ్యలక్ష్మి తాతగారు -తల్లి తండ్రి- కీ. శే. దావులూరి బుచ్చయ్య గారు కూడా వెంకట్రావుగారి బంధువర్గంలోనివారే. ఆయన బోడపాడుకు సమీప గ్రామమైన యలవర్రు గ్రామానికి చెందిన వారు.) వ్యక్తిగతంగా నా పట్ల, నా రచనల పట్ల ఉన్న అభిమానానికి తోడు, వారి ఆత్మీయ పరామర్శకు ఈ సన్నిహిత బంధుత్వం కూడా కొంత కారణమని నేను భావిస్తాను. నేను కలిసినప్పుడల్లా నిజామాబాద్ జిల్లాలో యడ్లపాటి వారున్న గ్రామాలను ఒకసారి చూసిరావాలనే అభిలాషను నా దగ్గర వ్యక్తపరుస్తారాయన.ఈనెల 5 వ తేదీ ఆయన నాకు స్వయంగా ఫోన్ చేసి తాను ఈ డిసెంబర్ 16 వ తేదీన 100 వ ఏట అడుగిడుతున్నానని తెలిపి ఆరోజు ఉదయం 9 గంటలకు తమ ఇంట జరిగే జన్మదినోత్సవానికి తప్పక రమ్మని నన్ను ఆహ్వానించారు. ఈరోజు ( డిసెంబర్ 14 వ తేదీ) ఆయన్ని కలిసేందుకు వెళ్ళినప్పుడు, ఆయన యథాప్రకారం కుశల పరామర్శలు చేసి, 16 వ తేదీ ఉదయం తాను 99 వ ఏట ప్రవేశిస్తున్నాననీ, ఆరోజు ఉదయం 9 గంటలకు తమ ఇంటిలోనే జరిగే జన్మదినోత్సవానికి ‘మా అమ్మాయి’ ని కూడా తీసుకుని, తప్పక రమ్మని నన్ను ఆహ్వానించారు. వెళ్ళినప్పుడల్లా చేతిలో చెయ్యివేసి ఆయన ఆప్యాయంగా మాట్లాడే తీరు నాకెంతో నచ్చుతుంది. ఆయన ఏ ఆహారం తీసుకుంటారో కానీ, ఈ వయసులోనూ ఆయన అరచేతులు ఎప్పుడూ రక్తవర్ణంలో, చల్లగా, ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఆజానుబాహుడైన ఆ స్ఫురద్రూపిని అలాగే చూస్తూ ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. గత ఏడాది ఓసారి ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు దాదాపు గంటకు పైగానే ఆయనతో మాట్లాడుతూ అక్కడ గడిపాను. ఎప్పట్లాగే ఏది మాట్లాడినా పూసలో దారం లాగా రైతు సంక్షేమం అంశం మీదనే ప్రధానంగా మా సంభాషణ సాగింది. అప్పుడు ప్రత్యేకించి నేను ఆయన అసాధారణమైన జ్ఞాపక శక్తికి ఆశ్చర్య చకితుడనయ్యాను. తెలుగు, ఇంగ్లీషు భాషలలో రైతుల గురించి కవులు రాసిన సాహిత్యమంతా ఆశువుగా ఆయన నోటివెంట వెలువడింది. ముఖ్యంగా ‘తెనుగు లెంక’ తుమ్మల సీతారామమూర్తి గారి కవితలను వారు ఆసక్తిగా, కర్ణపేయంగా, గడగడా వినిపించారు.
ఆ సాహిత్యం ఏ వయస్సు వారికైనా కంఠతః రావడమే ఒక ఆశ్చర్యకరమైన విషయమైతే, ఈ ముదిమి వయస్సులోనూ ఆయన ఆ పద్యాలను అక్షరం పొల్లుపోకుండా గుర్తుకు తెచ్చుకోవడం, వాటిని రాగయుక్తంగా ఆలపించడం మరింత సంభ్రమకరమైన విషయం. ఆయన సాహిత్యాభిలాషకూ, అసాధారణమైన ఆయన జ్ఞాపకశక్తికీ మనసులోనే నమోవాకాలు సమర్పించాను. ‘ ఎందుకో తెలియదు గానీ బాపట్ల సమీపంలోని అప్పికట్లలోనే రైతు సాహిత్యం వెలయించిన గొప్ప రైతు కవులు ఉద్భవించారు. ఇందుకు కారణం ఏమై ఉంటుందండీ ? ’ అని ఆయన్ని ఆసక్తిగా అడిగాను నేను. దానికాయన వెంటనే బదులిస్తూ, ‘ అదేమీ లేదండీ – తుమ్మలగారి స్వస్థలం కావూరు. ఆయన ఉద్యోగరీత్యా వచ్చి, అప్పికట్లలో స్థిరపడ్డారంతే ! కొసరాజు రాఘవయ్య చౌదరి గారు తప్పితే రైతాంగ సమస్యలపై కవిత్వం రాసిన కవులు అప్పికట్లకు చెందినవారు ఇంకెవరైనా ఉన్నారా ?’ అన్నారాయన ఆసక్తిగా. నేను వెంటనే స్పందిస్తూ, ‘అదేమిటండీ ! మీరు ఇనగంటి పున్నయ్య చౌదరి గారి ‘రైతు కన్నీరు’ లఘు కావ్యం చదవలేదా ? పూర్తిగా ఛందోబద్ధంగా, హృదయంగమంగా రాసిన ఆ చిరు కావ్యంలోని పద్యాలు చదువుతూ ఉంటే ఎవరికైనా నాటి రైతుల దుస్థితికి కళ్ళు చెమరుస్తాయి. ఒకప్పుడు ప్రొఫెసర్ రంగా గారు తన సభలన్నిటిలో ముందుగా పున్నయ్య చౌదరి గారి ‘రైతుకన్నీరు’ నుంచి పద్యాలు పాడించకుండా తన ప్రసంగం ప్రారంభించేవారు కాదంటారు. అంత గొప్ప కవి మీ దృష్టికి రాకపోవడం నిజంగా చిత్రంగానే ఉంది’ అన్నాన్నేను. ఆయన వెంటనే ‘అలాగా ! ఎందుకో పున్నయ్య చౌదరి గారిని గురించి నాకు బొత్తిగా గుర్తుకే రావడంలేదు. మీ దగ్గరుంటే ‘రైతుకన్నీరు’ కాపీ నాకు కూడా ఒకటి ఇస్తారా ? నాకు కూడా చదవాలని కుతూహలంగా ఉంది,’ అన్నారు ఆసక్తిగా. నా దగ్గర ఆ పుస్తకం ఉన్నదనీ, త్వరలో వెతికి తీసుకొచ్చి ఇస్తాననీ చెప్పాను. ఆ తరువాత ఇంకోసారి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం తీసుకెళ్లి వారికి ఇచ్చాను. ఈ వయస్సులోనూ ఆయన పుస్తకాలు, దినపత్రికలు శ్రద్ధగా చదువుతారు. నేను రాసిన పుస్తకాలన్నీ ఆయన చదివినా నా ‘కూరగాథలు’ పుస్తకం వెంకట్రావు గారు ఆసక్తిగా ఆసాంతం చదివారు. నా మరో పుస్తకం ‘ మా కేరళ యాత్ర’ ను ఆయన అదేపనిగా మెచ్చుకున్నారు. ఆ పుస్తకం చదివిన ప్రతివారూ తప్పక కేరళ వెళ్లితీరాలనుకునే విధంగా నా రచనా శైలి ఉన్నదంటూ, తాను కేరళలో లోగడ చూసిన ప్రదేశాలను ఆ పుస్తకం మరోసారి గుర్తుచేసిందని ప్రశంసించారు. ఆయన సహృదయానికి నేనాయనకు ధన్యవాదాలు తెలిపాను. శ్రీ యడ్లపాటి వెంకట్రావు గారు మరింతకాలం ఆరోగ్యంగా జీవించి, రైతాంగానికి తన విలువైన సేవలను అందించగలరని ఆశిస్తూ, ఎల్లుండి జరగనున్న వారి 100 వ జన్మదినోత్సవం సందర్భంగా బంధుమిత్రులు అందరి తరఫునా వారికి ముందుగానే నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com