ScienceAndTech

ఇండియాలో క్రిప్టో కరెన్సీ కష్టాలు

కొవిడ్‌ దెబ్బకు వ్యాపారాలు, ఉద్యోగాలు గల్లంతై ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. దాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు ప్రకటించిన భారీ ఉద్దీపన పథకాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, కరెన్సీ విలువ పడిపోయి, బ్యాంకింగ్‌ రంగం సుస్థిరతపైనా అనుమానాలు మొదలయ్యాయి. మంచి పెట్టుబడి సాధనాలు అనుకున్న బంగారం, షేర్ల ధరలూ ఒడుదొడుకులకు లోనయ్యాయి. వీటికన్నా బిట్‌కాయిన్‌, ఎథీరియం వంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టడం భద్రమనే భావన బలపడింది. ప్రపంచంలోని అతిసంపన్నులలో ఒకరైన టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తాను ఇప్పటికే బిట్‌ కాయిన్లలో 150 కోట్ల డాలర్లు మదుపు చేశానని వెల్లడించారు. అంతేకాదు తమ టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లకు బిట్‌ కాయిన్‌లో చెల్లింపులు స్వీకరిస్తాననీ ప్రకటించి బిట్‌ కాయిన్‌ ధర విపరీతంగా పెరగడానికి ప్రేరకులయ్యారు. ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి ఒక్కో బిట్‌ కాయిన్‌ ధర 34,67,000 రూపాయలకు (47,493 డాలర్లకు) చేరింది. ఈ సంవత్సరంలోనే ఈ ధర లక్ష డాలర్లను మించిపోతుందని మార్కెట్‌ పండితులు జోస్యం చెబుతున్నారు. ప్రపంచంలో చలామణీలో ఉన్న 6,000 పైచిలుకు క్రిప్టో కరెన్సీల మార్కెట్‌ విలువ ఇప్పటికే లక్షా 24 వేల కోట్ల డాలర్లను (90 లక్షల కోట్ల రూపాయలను) మించిపోయింది. వీటిలో ఒక్క బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ విలువే ఈ నెల రెండో తేదీకి 66,100 కోట్ల డాలర్లను (48.3 లక్షల కోట్ల రూపాయలను) అందుకొంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద చెల్లింపుల సంస్థ వీసా, అతిపెద్ద చిల్లర వర్తక సంస్థ వాల్‌మార్ట్‌ మార్కెట్‌ విలువలకన్నా ఎంతో ఎక్కువ. వీసా సంస్థ బిట్‌ కాయిన్‌ను డిజిటల్‌ బంగారంగా అభివర్ణిస్తూ, ప్రపంచవ్యాప్తంగా తన భాగస్వాములైన ఏడు కోట్ల వ్యాపారులు, సంస్థలు, బ్యాంకుల నుంచి బిట్‌ కాయిన్లు కొనుగోలు చేసే అవకాశాన్ని ఖాతాదారులకు కల్పించదలచింది.

క్రిప్టో కరెన్సీ పూర్తిగా ప్రైవేటు కరెన్సీ. రూపాయలు, డాలర్లు ప్రభుత్వాల పూచీకత్తుపై విడుదలయ్యే సాధికార కరెన్సీలు. మీ వద్ద 100 రూపాయల నోటు ఉంటే, ఆ కరెన్సీ కాగితం విలువకు సమానమైన వస్తుసేవలు కొనుక్కోవచ్చని రిజర్వు బ్యాంకు భరోసా ఇస్తుంది. రేపు అది విడుదల చేసే సాధికార డిజిటల్‌ రూపాయికీ అదే పూచీకత్తు లభిస్తుంది. కానీ, ప్రైవేటు ధనమైన క్రిప్టో కరెన్సీకి అలాంటి సార్వభౌమ భరోసా లేదు. ఇప్పటికే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా జరుపుతున్న చెల్లింపులు డిజిటల్‌ కరెన్సీ కావు. ఈ చెల్లింపులు మన బ్యాంకు ఖాతాల నుంచి జరుగుతాయి. మన ఖాతాలోని ధనాన్ని ఏటీఎం నుంచి కానీ, చెక్కుల రూపంలోగానీ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. క్రిప్టోకరెన్సీ విషయలో అది కుదరదు. మరి అలాంటి ప్రైవేటు కరెన్సీ వల్ల ఉపయోగమేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రభుత్వ విధానాల వల్ల కరెన్సీ విలువ పడిపోతోందని భావిస్తున్నవారు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే క్రిప్టోకరెన్సీలవైపు మొగ్గు చూపుతున్నారు. చిత్తానుసారం క్రిప్టోకరెన్సీ విలువను మార్చడానికి ఈ సాంకేతికతలో వీలుండదు. కానీ, క్రిప్టోకరెన్సీలు తమ సార్వభౌమాధికారానికి భంగకరమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే భారత ప్రభుత్వం బిట్‌ కాయిన్‌ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించి, రిజర్వు బ్యాంకు చేతులమీదుగా సాధికార డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టదలచినట్లు ఇటీవల విడుదలైన లోక్‌సభ బులెటిన్‌ తెలిపింది. బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం కోసం వేచివున్న 20 బిల్లుల్లో క్రిప్టోకరెన్సీ నిషేధ బిల్లూ ఒకటి.