Politics

తెదేపా లెక్కల్లో అస్సాం కూడా కలిపారా?

తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 38.74% స్థానాల్లో తమ మద్దతుదారులు విజయం సాధించారంటూ చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో స్థానాలే చెప్పారా? అసోం రాష్ట్రంలోనివి కూడా కలిపి చెప్పారా? ఎవరైనా వింటే నవ్విపోతారు’ అని ఎద్దేవా చేశారు. 3,244 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా 2,640 చోట్ల వైకాపా, 509 చోట్ల తెదేపా మద్దతుదారులు గెలుపొందారు. జగన్‌ నాయకత్వం, పనితీరుకు ఓటర్లు విజయం చేకూర్చారు. ఎన్నికలకు ఎప్పుడూ మేం సిద్ధమే.. కరోనా టీకాల కారణంగా రెండు మూడు నెలలు తర్వాత పెట్టమన్నాం. పురపాలక ఎన్నికలూ ఎన్నికల కమిషన్‌ ఇష్టం. మా చేతుల్లో లేదు. సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి.. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మంగళవారం నాటి విలేకర్ల సమావేశంలో 91% వైకాపా మద్దతుదారులే గెలిచారు.. ఇంకా రెండుమూడు శాతం పెరుగుతుందన్నా. దానికి భిన్నంగా రెండు మూడు శాతం తగ్గింది. దానికి మేమేం కాదనడం లేదే. మొదటి దశ ఎన్నికల కంటే మిన్నగా…..రెండు, మూడు, నాలుగో దశల్లోనూ విజయాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని వివరించారు. ఎమ్మెల్యేలు, వైకాపా మద్దతుదారులైన సర్పంచులతో కూడిన ఫొటోలను త్వరలోవిడుదల చేస్తా మన్నారు. జిల్లాలు, పార్టీల మద్దతుదారులు సర్పంచులుగా గెలిచిన జాబితాను విడుదల చేశారు.