Sports

మూడో రౌండ్లోకి జకోవిచ్. ఇంటికి బోపన్న.

Djokovic Moves To Round Three In Aus Open 2021

సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో జకో 6-3, 6-7 (3-7), 7-6 (7-2), 6-3తో అమెరికా కుర్రాడు ఫ్రాన్సిస్‌ టియోఫోపై కష్టపడి గెలిచాడు. విపరీతమైన ఉక్కపోత వాతావరణంలో హోరాహోరీగా సాగిన ఈ సమరంలో మూడున్నర గంటల పాటు పోరాడి జకో విజయాన్ని అందుకున్నాడు. తొలి సెట్‌ నుంచే ప్రత్యర్థి నుంచి నొవాక్‌కు గట్టిపోటీ ఎదురైంది. జకోకు దీటుగా బలమైన సర్వీసులు, విన్నర్లు ఆడిన టియోఫో అతణ్ని బాగా ఇబ్బంది పెట్టాడు. తొలి సెట్‌ ఆరంభంలో 3-0తో నొవాక్‌ జోరు మీద కనిపించినా… టియోఫో 3-4తో పుంజుకున్నాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జకో.. అదే ఊపులో 6-3తో సెట్‌ గెలిచాడు. కానీ హోరాహోరీగా సాగిన రెండో సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లగా.. ఒత్తిడిని తట్టుకుంటూ టియోఫో సెట్‌ గెలిచి స్కోరు సమం చేశాడు. అయితే మూడో సెట్లో సీన్‌ రివర్స్‌ అయింది. ఈసారి టైబ్రేక్‌లో జకో గెలిచి మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ నాలుగో సెట్లో టియోఫోకు పెద్దగా అవకాశం ఇవ్వని జకో.. 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలిచాడు. ఈ పోరులో నొవాక్‌ 26 ఏస్‌లు కొట్టగా.. టియోఫో 23 కొట్టాడు. అయితే విన్నర్లలో ప్రత్యర్థి (49) కంటే జకో (56) ముందంజలో నిలిచాడు. ‘‘మ్యాచ్‌ చాలా క్లిష్టంగా సాగింది. పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. సూర్యప్రతాపం మధ్య సుదీర్ఘ ర్యాలీలు ఆడాల్సి వచ్చింది’’ అని మ్యాచ్‌ అనంతరం నొవాక్‌ అన్నాడు.

డబుల్స్‌లో భారత్‌కు చుక్కెదురైంది. స్టార్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న తొలి రౌండ్లోనే పరాజయం చవిచూశాడు. బోపన్న-బెన్‌ మెక్‌లాలెన్‌ జోడీ 4-6, 6-7 (0-7)తో కొరియా వైల్డ్‌కార్డ్‌ ద్వయం జీసంగ్‌ నామ్‌-మికు సంగ్‌ చేతిలో పరాభవం చవిచూసింది. తొలి సెట్‌ను పోరాడి చేజార్చుకున్న బోపన్న జోడీ.. రెండో సెట్‌ను టైబ్రేకర్‌ వరకు తీసుకెళ్లినా కీలక సమయంలో తడబడి మ్యాచ్‌ను కోల్పోయింది.