కరోనానే కాదు, ఏ విధమైన సూక్ష్మజీవి కారక అంటురోగాలు సోకకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. భౌతిక దూరం, చేతుల పరిశుభ్రత, కాసేపు వ్యాయామం.. మనల్ని రోగాల నుంచి దూరంగా ఉంచుతాయి. సాధారణ జలుబు వైరస్ నుంచి కోవిడ్ వైరస్ వరకు గుంపులుగా జనాలు ఉండే చోట, ఇరుకైన ప్రదేశాల్లో తొందరగా వ్యాప్తి చెందుతాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతున్న మాట. దీని ప్రకారం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది కసరత్తులు చేసే జిమ్‌లు ప్రమాదకరమేనని భావించవచ్చు. జిమ్‌లలో తేమ, వేడి గాలి అధికంగా ఉంటుంది. అలాగే కసరత్తులు చేసేటపుడు ఊపిరి ఎక్కువగా పీల్చడం, వదలడం, చేతులు, కాళ్లూ వేగంగా కదిలించడం వంటివి జరుగుతుంటాయి. వీటి కారణంగా ఇక్కడ గాలి స్థిరంగా కాకుండా కొంచెం కల్లోల స్థితిలో ఉంటుంది. వీటన్నింటిని వల్ల సామూహిక కసరత్తులు జరిగేటపుడు ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వ్యక్తి శ్వాస బలంగా వదిలితే అందులో నుంచి వైరస్ తుంపరలు అత్యంత వేగంగా వ్యాపిస్తాయి.
ఫలితంగా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుంది. ఒకవేళ జిమ్ వెలుపల పరీక్షలు చేసి లక్షణాలు ఉన్నవారిని అనుమతించకపోతే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఎలాంటి వ్యాధి లక్షణాలూ (అసింప్టమాటిక్) లేకున్నా కొందరిలో వైరస్ అంతర్లీనంగా ఉంటోందని, వారి ద్వారా ఇతరులకూ వ్యాపిస్తున్న విషయం తెలిసిందే! ఇటీవల దక్షిణకొరియాలోని ‘ఎమర్జింగ్ ఇన్‌ఫెక్షస్ డిసీజెస్’అనే జర్నల్‌లో కోవిడ్‌పై ఓ నివేదిక వెలువడింది. ఇందులో జిమ్‌లు, ఫిట్నెస్ కేంద్రాలు, డ్యాన్స్ క్లాసుల గురించి పేర్కొన్నారు. తొలుత ఇక్కడి ఫిట్నెస్ కేంద్రంలో వైద్యనిపుణులు పాజిటివ్ కేసును గుర్తించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఫిట్నెస్ కేంద్రాలను పరిశీలించగా అధిక శాతం మంది కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం జిమ్‌లు, ఫిట్నెస్ కేంద్రాల్లో కసరత్తులు చేయడంపై తమ పౌరులను హెచ్చరించింది. అమెరికా వైద్యులూ ఇదే విషయం చెబుతున్నారు. ‘పాజిటివ్ వ్యక్తి నుంచి వెలువడిన వైరస్ బిందువులు గాలిలో సుమారు 3 గంటల సేపు ఉంటాయి. జనసమూహం ఉన్న, చిన్న చిన్న ప్రదేశాల్లో ఈ బిందువులు వేగంగా విస్తరించి ఇతరులకు వ్యాధి సోకుతుంది. జిమ్‌లు ఇలాంటివే’ అని న్యూయార్క్‌లోని లెనాక్స్ హిల్ హాస్పిటల్ వైద్యడు డాక్టర్ గ్లట్టర్ వెల్లడించారు.
*** ఇవి గమనించండి..
* మీ ఆరోగ్యం, వయస్సును బట్టి.. సమూహం ఉండే, ఇరుకైన జిమ్‌లు మీకు సురక్షితమా కాదా అని అంచనా వేసుకోవాలి.
* వీలైతే జిమ్‌కు మీ సొంత వ్యాయామ సామగ్రి తీసుకెళ్లండి. చేతులను తరచూ శానిటైజ్ చేసుకోండి. ఇతరులు ఉపయోగించిన సామగ్రిని వాడేటపుడు కచ్చితంగా వాటిని రసాయనాలతో క్రిమిరహితం చేయండి.
* మీరున్న ప్రాంతంలో వైరస్ సమూహవ్యాప్తి దశకు చేరుకొని ఉంటే ఎక్కువ ప్రమాదమని గ్రహించాలి.
* భౌతిక దూరం మరవద్దు. కుదిరితే ఆరడుగుల దూరం పాటించండి.
* వ్యాక్సిన్ తీసుకునేంతవరకు ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.
ఇవన్నీ కష్టం అంటారా? అయితే జనసమర్థం లేని ఆరుబయట ప్రాంతాల్లో వర్కౌట్స్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ఇరుకుగా ఉండే జిమ్‌లతో పోలిస్తే ఆరుబయట వైరస్‌లు వేగంగా చలించలేవు. ఒకవేళ కొంతమంది బృందంగా వ్యాయామానికి వచ్చినా ఆరుబయట విశాల స్థలంలో ఆరడుగుల భౌతిక దూరం పాటించడం కూడా సులభమే. అయితే, ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల వైరస్ సోకదు అని కచ్చితంగా చెప్పలేం. కాకపోతే అవకాశాలు చాలా తక్కువ. జిమ్‌లోనైనా, బయటైనా ఫిజిషియన్ సలహమేరకే వర్కౌట్స్ చేయడం మంచిది. శరీరంలో వ్యాధినిరోధకత పెరగడానికి వ్యాయామం ప్రధానపాత్ర వహిస్తుంది. అయితే ఎవరికి వారు ఇష్టారాజ్యంగా పద్దతి, పాడు లేకుండా వ్యాయామాలు చేస్తే అనవసర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే వ్యాయామం మొదలు పెట్టే ముందు జనరల్ ఫిజిషియన్‌ను సంప్రదించి, మన శరీరంలో ఏదైన వ్యాధులు ఉన్నాయా అని పరీక్షించుకొవాలి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం..వయస్సు ఎక్కువగా ఉన్నవారిలో వ్యాయమం మొదలు పెట్టే ముందు పలు సమస్యలు తలెత్తుతాయి.
*** వీళ్లు దూరంగా ఉంటే బెటర్!
1. హృదయ సంబంధ వ్యాధుల నుంచి కోలుకుంటున్న వారు , దానికి సంబంధించిన మందులను వాడుతున్నవారు.
2. సిగరెట్ తాగేవారు, సిగరెట్ మానేసి కనీసం ఆరునెలలు కూడా గడవని వారు.. పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు.
3. రక్తపోటు(బీపీ)కి సంబంధించిన మందులు ఉపయోగిస్తున్నవారు.
4. శరీరంలో కొలెస్ట్రాల్(కొవ్వు) అధికంగా ఉన్నవారు.
అలాగని వీరు పూర్తిగా వ్యాయామానికి దూరం కాకుండా వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ ముందుగా శరీరాన్ని బలోపేతం చేసుకోవాలి. తర్వాత కావాలంటే జిమ్‌లో చేరవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.