Health

మానసిక శక్తికి భుజంగాసనం

Bhujangasanam for mental strength and stability-tnilive-మానసిక శక్తికి భుజంగాసనం

ఆధునిక యుగంలో ఉద్యోగాలన్నీ దాదాపు కంప్యూటర్‌తో చేసేవే.. గంటల తరబడి కంప్యూటర్‌ల ముందు కూర్చుని తదేకంగా కంప్యూటర్‌పై కూర్చోవడం వల్ల స్పాండిలైటిస్, నడుంనొప్పి, మెడనొప్పి వంటి రకరకాల జబ్బులు వస్తున్నాయి. దానితో పాటు పని ఒత్తిడి. ఫలానా లక్ష్యాన్ని సమయంలో లోపల పూర్తిచేయాలనే నిబంధనలు మానసిక ఒత్తిడిని కలుగజేస్తాయి. ఇలాంటివాటన్నింటికీ సరైన ఉపాయం భుజంగాసనం. సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అనీ, ఆసన అంటే వ్యాయామం అని అర్థం. భుజంగాసనం చాలా సులువైన వ్యాయామరీతిగా చెప్పవచ్చు. ఈ ఆసనం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందడానికిగాను దీని గురించిన వివరాల పట్ల శ్రద్ధ వహించాలి. విరామస్థితిలో ఉన్నపుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నించాలి. ఈ ఆసనం వేసేటప్పుడు వెనె్నముక కండరాలు ఒత్తిడికి గురికాకూడదు. అలాగే ఆసనాన్ని త్వరత్వరగా, ఉన్నట్లుండి వేయడానికి ప్రయత్నించకూడదు. భుజంగాసనాన్ని శలభాసనం, ధనురాసనాలతో కలిపి వేయాలి. ఈ మూడు ఆసనాలు కలిపి త్రయంగా ఏర్పడతాయి.ఈ మూడు ఆసనాలు పరస్పరం అనుసంధానమై ఉంటాయి. భుజంగాసనానికి వ్యతిరేక భంగిమలు హలాసనం, పశ్చిమోత్తాసనంగా రూపు దాలుస్తాయి. సాధారణంగా భుజంగాసనం రెండు రకాలుగా ఉంటుంది. అవి సాధారణం, సంక్లిష్టం. ముందుగా మకరాసనంలో విశ్రాంతిగా ఉండాలి. తరువాత కాలి మడమల బొటనవేళ్లను కలిపి ఉంచి బోర్లా పడుకోవాలి. చుబుకాన్ని నేలకు ఆనించాలి. ఈ సమయంలో అరికాళ్లు పై వైపునకు తిరిగి ఉండాలి. మోచేతులను వంచి అరచేతులను ఆఖరి పక్కటెముక పక్కగా ఉంచాలి. తరువాత మోచేతులను దగ్గరగా ఉంచాలి. చేతులపై ఎక్కువ బలాన్ని ఉంచకూడదు. ముందుగా తలను పైకెత్తుతూ తాచుపాము పడగెత్తినట్లు శరీరాన్ని నెమ్మదిగా పైకెత్తాలి. ఈ సమయంలో నాభిస్థానం నేలకు అంటీ అంటనట్లుగా ఉంచాలి. తరువాత తిరిగి మకరాసనంలోకి రావాలి. ఈ ప్రక్రియ త్వరత్వరగా కాకుండా చాలా నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ చేయాలి. భుజంగాసనం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రుతుక్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు ప్రత్యేకించి భుజంగాసనం లబ్ది చేకూరుస్తుంది.అండాశయం,మూత్రాశయానికి సంబంధించిన పలు సమస్యలను ఈ ఆసనం నివారిస్తుంది.గర్భసంచిని, చుట్టుపక్కల ఉన్న కటి పా ంతాలను ఇది క్రమబద్ధంగా పనిచేలా చూస్తుంది. ఈ ఆసనం వేసినప్పుడు పొత్తికడుపు భాగంలో ఒత్తిడి బాగా పెరగడం వల్ల ఇది జరుగుతుంది.మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.స్వల్ప రక్తపోటుతో బాధపడుతున్నవారు భుజంగాసనాన్ని వేయడం ద్వారా రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది.పెద్దపేగు, పొట్టలోని వాయువును భుజంగాసనం వెలుపలకు నెడుతుంది. మెడ, వీపుకు సంబంధించిన అన్ని రకాల నొప్పులకు భుజంగాసనం దివ్యంగా పనిచేస్తుంది.కంప్యూటర్ ఉద్యోగస్థులు, ఐటీ ఉద్యోగస్థులు, వైట్ కాలర్ ఉద్యోగస్థులకు భుజంగాసనం మంచి వ్యాయామం. ఈ ఆసనం వారి నొప్పులను తగ్గించడమే కాకుండా వారి శారీరక, మానసిక పటుత్వాన్ని పెంచుతుంది. అందుకే తప్పనిసరిగా రోజూ భుజంగాసనం వేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.