హైదరాబాద్ ప్రాంతీయ రింగ్‌రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించిందని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని శుక్రవారం ఆయన కలిశారు. అనంతరం నామా మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ 334 కిలోమీటర్ల రీజినల్ రింగ్‌రోడ్డు పనులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారన్నారు. ఈ రహదారి నిర్మాణంతో నాగ్‌పుర్-హైదరాబాద్-బెంగళూరు కారిడార్, పుణె-హైదరాబాద్-విజయవాడ కారిడార్ రహదారుల మధ్య అనుసంధానం పెరుగుతుందన్నారు. కోదాడ-ఖమ్మం 4 వరుసల రహదారికి కూడా కేంద్ర ఆమోదం తెలిపిందని నామా చెప్పారు. ఈ రహదారికి ఇప్పటికే భూ సేకరణ పూర్తయిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తారని అన్నారు. ఎన్.హెచ్. 167 అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు రహదారి విస్తరణకు కేంద్రం గతంలో రూ. 220 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఆ రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు మరో రూ. 65 నుంచి రూ. 70 కోట్లు వెచ్చిస్తే సరిపోతుందన్న స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయాన్ని నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. నామా వెంట మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ ఉన్నారు.
కోడాడ-ఖమ్మం మధ్య 4వరుసల రాదారి

Related tags :