Politics

రేపు తేలనున్న ఏపీ భవిత

2019 Indian election counting begins tomorrow - tnilive politics - రేపు తేలనున్న ఏపీ భవిత

హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరు ముగిసింది. అంతకు మించిన ఉ త్కంఠ రేపుతున్న 42 రోజుల నిరీక్షణకూ మరో 24 గం టల్లో తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లో అమితాసక్తి కలిగిస్తున్న ఎన్నికల ఫలితాల వెల్లడికి ఎన్నికల సంఘం(ఈసీ) రంగం సిద్ధం చేసింది. గురువారం ఉద యం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 34 కేంద్రాల్లో 55 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. లెక్కింపు ప్రక్రియలో భాగంగా కౌంటింగ్‌ హాల్లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల కోసం చెరో 14 టేబుళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లు ఈవీఎంలలో డిజిటల్‌గా వేసిన ఓట్లను… ఎన్నికల సిబ్బంది భౌతికంగా లెక్కించనున్నారు. ఈ సారి ఈవీఎంలతోపాటు వీవీప్యాట్‌లు కూడా లెక్కించబోతున్నారు.గతంలో ఈవీఎంల లెక్కింపుతోనే ఫలితాలు వెల్లడయ్యేవి. ఈ సారి వీవీప్యాట్ల లెక్కింపు అనంతరమే ఫలితాలు అధికారికంగా వెల్లడించనున్నారు. దీంతో అధికారికంగా ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతిపదికగా వీవీప్యాట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ముందుగా ఈవీఎంలను లెక్కించిన తర్వాత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా లాటరీ తీసి ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్ల లెక్కింపు చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేల మంది ఈ లెక్కింపు ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 15 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రత కల్పిస్తున్నారు. అభ్యర్థులు, పాసులు కలిగిన సిబ్బంది, మీడియాను మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల వద్దకు అనుమతిస్తారు.
**ఓట్లను ఇలా లెక్కిస్తారు?
కౌంటింగ్‌ కేంద్రాల్లోనూ మూడు అంచెలుగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గం వారీగా పోలింగ్‌ కేంద్రాలను అనుసరించి ఓట్లు లెక్కించనున్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 నుంచి 15 టేబుళ్ల వరకూ ఏర్పాటు చేయనున్నారు. ఈ 14 టేబుళ్లపైనా 14 ఈవీఎంలు ఉంచి ఓట్లు లెక్కిస్తారు. రౌండ్ల వారీగా చేపట్టే ఈ లెక్కింపు ప్రక్రియలో పోలింగ్‌ కేంద్రాలను బట్టే 18 నుంచి 20 రౌండ్ల వరకూ ఉండనున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇదే తరహాలో ఏర్పాట్లు చేశారు.యోజకవర్గాల వారీగా ఈవీఎంలను టేబుళ్లపై చేర్చిన అనంతరం రిటర్నింగ్‌ అధికారి, ఎన్నికల పరిశీలకుడి నేతృత్వంలో అభ్యర్థులు, వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలకు సంబంధించిన సీళ్లను తొలగిస్తారు. పోలింగ్‌ సమయంలో బ్యాలెట్‌ యూనిట్లలో వేసిన ఓటు కంట్రోల్‌ యూనిట్‌లోనే నమోదవుతుంది. మూడు విభాగాలుగా ఉన్న ఈవీఎంలో… కంట్రోల్‌ యూనిట్‌నే లెక్కింపు కోసం వినియోగిస్తారు. ఈ కంట్రోల్‌ యూనిట్‌ సీళ్లను తొలగించిన అనంతరం వెనుకవైపున ఉన్న స్విచ్‌ ఆన్‌ చేయగానే బీప్‌ శబ్దంతో ఈవీఎం ప్రారంభం అవుతుంది. ఇందులో తొలుత ఎంత మంది అభ్యర్థులకు ఓట్లు నమోదయ్యాయో ఆ వివరాలను కంట్రోల్‌ యూనిట్‌ వెల్లడిస్తుంది. తదుపరి బ్యాటరీ ఎంత వరకూ పని చేస్తుందన్న వివరాలను తెలియజేస్తుంది.తర్వాత లెక్కింపు సిబ్బంది రిజల్ట్‌ బటన్‌ను నొక్కితే ఆ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రంలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నారో తెలియజేసి అనంతరం మొత్తం ఎన్ని ఓట్లు నమోదయ్యాయో ఈవీఎంలు తెలియజేస్తాయి. 14 టేబుళ్లపైనా ఈ తరహా ప్రక్రియ పూర్తి అయ్యాక తొలిరౌండ్‌ పూర్తయినట్లుగా ప్రకటిస్తారు. రౌండ్ల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటిస్తారు.
**తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు
ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు, 60 వేల సర్వీస్‌ ఓట్లు ఉన్నాయి. 8:30 గంటలకు ఈ లెక్కింపు ప్ర క్రియ పూర్తయినా కాకపోయినా ఈవీఎంల ఓట్ల లెక్కింపును మొ దలు పెట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఒకేసారి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల సమయానికి ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో స్పష్టత రానుంది. అయితే వీవీప్యాట్ల లెక్కింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండడంతో తుది ఫలితాన్ని ప్రకటించడం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఈసీ స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున, అలాగే పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదేసి చొప్పున వీవీప్యాట్లను లెక్కించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 1750 వీవీప్యాట్లను లెక్కించనున్నారు. ఈ ప్ర క్రియ పూర్తి చేసి విజేతను ప్రకటించడానికి అర్ధరాత్రి అవుతుంది.
** నిరంతర అప్‌డేట్‌
ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద రౌండ్లవారీగా ఫలితాలు తెలియజేయడానికి కౌంటింగ్‌ కేంద్రానికి 300 మీటర్ల దూరంలో ఎన్నికల సంఘం డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయనుంది. ప్రతి రౌండ్‌కు ఎవరు ఆధిక్యంలో ఉన్నారో తెలియజేయనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్దే కాకుండా ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో, సీఈవో ఆంధ్ర వెబ్‌సైట్‌లో, సువిధయాప్ లో కూడా ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అప్‌లోడ్‌ చేయనుంది.
**కౌంటింగ్‌ సిబ్బందికి డ్రస్‌ కోడ్‌
ఈ సారి ఎన్నికల ప్రక్రియలో సిబ్బందిని గుర్తుపట్టేందుకు ప్రత్యేకంగా డ్రస్‌కోడ్‌ అమలు చేస్తున్నారు. స్ట్రాంగ్‌రూము నుంచి కౌంటింగ్‌ కేంద్రంలోకి ఈవీఎంలను తరలించే సిబ్బందికి డ్రస్‌కోడ్‌ ఉంటుంది. దీనివల్ల ఎవరు ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు తరలిస్తున్నారో, ఎవరు పార్లమెంటు ఈవీఎంలను తరలిస్తున్నారో గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు… కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ వీడియో చిత్రీకరణ చేయనున్నారు.