WorldWonders

తెలంగాణాలో అంతరించిపోయిన రాబందులు

No Vultures To Be Seen In Telangana - Parsis Willing To Spend Crores

తెలంగాణలో రాబందులు అంతరించినట్టేనా? దక్షిణ భారతంలో రెండోది, రాష్ట్రంలో ఏకైక స్థావరమైన ఆసిఫాబాద్‌ జిల్లా పాలరాపుగుట్టపై కనుమరుగు అయ్యాయా? వీటిని ఇక జూపార్క్‌లోనే చూడాల్సి ఉంటుందా? క్షేత్రస్థాయి పరిస్థితులు వీటికి అవుననే సమాధానమిస్తున్నాయి. రెండు, మూడేళ్లక్రితం ఇక్కడ గరిష్ఠంగా 37 రాబందులు ఉండగా ఇప్పుడు ఒక్కటీ కన్పించట్లేదు. మహారాష్ట్రకు వలస వెళ్లాయని అటవీశాఖ వర్గాలు చెబుతున్నా.. ఇక్కడి రకం జాతులు అక్కడ లేవని, ఆర్నెళ్లుగా జాడ లేని రాబందులు పాలరాపుగుట్టపై మళ్లీ కనిపించే అవకాశాలు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని పరిరక్షించేందుకు ‘రాబందుల సంరక్షణ కేంద్రం’ ఏర్పాటు చేయాలని 2018లో రాష్ట్ర వైల్డ్‌లైఫ్‌ బోర్డు ప్రతిపాదించినా దానిపై నిర్ణయం జరగలేదు. ఆ ప్రతిపాదనని ఆమోదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో రాబందులు ఒకటి. పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షులివి. జంతువులు, పశువుల కళేబరాలు కుళ్లిపోయి వ్యాధులు ప్రబలకుండా రాబందులు వాటిని తింటూ మేలుచేస్తున్నాయి. పక్కనే నదులు, వాగులున్న గుట్టప్రాంతాలను రాబందులు నివాసంగా ఎంచుకుంటాయి. ప్రాణహిత, పెద్దవాగు కలిసే ప్రాంతం కావడం, ఆ పక్కనే 300 మీటర్ల ఎత్తులో పాలరాపుగుట్ట ఉండటంతో తెలంగాణలో ఈ ఒక్కచోటే అవి మనుగడ సాగించాయి. 1990ల్లో దేశావ్యాప్తంగా నాలుగు కోట్లకుపైగా రాబందులు ఉండేవి. 2005 నాటికి 90వేలకు, 2017 నాటికి ఈ సంఖ్య 19వేలకు పడిపోయింది. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ 2019 జులైలో వెల్లడించిన గణాంకాలు ఇవి. రాబందుల సంఖ్య దేశంలో విపరీతంగా తగ్గిపోతోందని ‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియా బర్డ్స్‌-2020’ నివేదిక కూడా చెప్పింది. డైక్లోఫినాక్‌ ఇచ్చిన పశువుల కళేబరాలు తినడం రాబందుల జాతి అంతరించడానికి ప్రధాన కారణం. పర్యావరణ మార్పులు, ఆవాసాలు తగ్గడం, ఆహారం దొరక్కపోవడం కూడా కారణాలుగా చెప్పవచ్చు.

రాబందుల సంఖ్య పెరిగేలా చూడండి.. ఎన్ని రూ.కోట్లయినా ఇస్తాం అంటూ పార్సీలు ముందుకు వచ్చారు. వారి ఆచారం ప్రకారం మనుషుల మృతదేహాన్ని ఎత్తైన గుట్టపై వదిలేసి వెళతారు. రాబందులు వచ్చి తినాలని కోరుకుంటారు. సికింద్రాబాద్‌లోని పార్శీగుట్టపై దశాబ్దాల క్రితం పెద్దసంఖ్యలో రాబందులు ఉండేవి. పాలరాపుగుట్ట పక్కన పెదవాగు నీటిని పరీక్షించాం. అవి స్వచ్ఛంగానే ఉన్నాయి. జులై, ఆగస్టులో భారీ వర్షాల తర్వాత ఇక్కడినుంచి రాబందులు మహారాష్ట్రకు వెళ్లాయి. వీటిని ట్రాకింగ్‌ చేసే విధానం మన వద్ద లేదు. నెలకో, మూడునెలలకో తిరిగి వస్తాయన్న నమ్మకం ఉంది.