నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. వి.ఆనంద ప్రసాద్ నిర్మాత. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. ‘‘రెండేళ్ల క్రితం ఓ విభిన్నమైన సినిమా చేద్దామనుకున్నప్పుడు చంద్రశేఖర్ ఈ కథ చెప్పారు. నేనిలాంటి విభిన్నమైన కథతో సినిమా చేయడం ఇదే తొలిసారి. నేనిందులో ఆదిత్య అనే ఓ ఉరిశిక్ష పడిన ఖైదీగా కనిపిస్తా. సినిమా 80శాతం జైలు వాతావరణంలోనే సాగుతుంది. నేనీ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డా. నా గత సినిమాలు ఒకెత్తయితే.. ఈ చిత్రం మరోకెత్తు. కల్యాణి మాలిక్ తన నేపథ్య సంగీతంతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు. ప్రియ, రకుల్ ఎంతో అద్భుతంగా నటించార’’న్నారు. ‘‘చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు.. తెలివితేటలతో తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకున్నాడన్నది చిత్ర కథాంశం. నితిన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన కెరీర్‌కు మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది ఓటీటీ వేదికగా ‘ఓ పిట్టకథ’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాలు విడుదల చేసి సక్సెస్ అయ్యాం. ఇప్పుడీ చిత్రంతో మా సంస్థ మరో మెట్టు పైకెక్కుతుంది. చంద్రశేఖర్ ఈ సినిమాని మలిచిన తీరు అద్భుతం’’ అన్నారు. ‘‘ఇంత మంచి కథతో తెలుగులో అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అంది నాయిక ప్రియా ప్రకాష్ వారియర్. ఈ కార్యక్రమంలో సాయిచంద్, కల్యాణి మాలిక్, అన్నే రవి తదితరులు పాల్గొన్నారు.
26న “చెక్”
Related tags :