అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల్లోని అధికారులు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు.
దీనితో పాటు వంటగ్యాస్‌కు రాయితీ ఇచ్చే బదులు ఎలక్ట్రిక్ వంట పరికరాలకు ఇవ్వాలని సూచించారు.
గో ఎలక్ట్రిక్ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ.. విద్యుత్‌ను ఉపయోగించి వంట చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.
ఇది వంటగ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో విద్యుత్ శాఖలో అధికారులంతా ఎలక్ట్రిక్ వాహనాలనే వాడేలా ఆదేశించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కోరారు.
పది వేల ఎలక్ట్రిక్ వాహనాలతో దిల్లీలో నెలకు 30 కోట్ల రూపాయల ఆదా చేయవచ్చని గడ్కరీ తెలిపారు.
మరోవైపు త్వరలో దిల్లీ నుంచి ఆగ్రా, జైపుర్‌కు ఫ్యూయల్సెల్ బస్ సేవలను ప్రారంభిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు.