* నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులో ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని తోటి విద్యార్థి గొంతు నులిమి చంపేశాడు. వివరాలు.. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష అనే యువతి నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. కాగా అనూష, విష్ణు కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా యువతి మరో యువకుడితో చనువుగా ఉంటోందని విష్ణు యువతిని అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే అనూషను మాట్లాడుకుందాం అని పిలిచి ఆమెతో గొడవకు దిగాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు పాలపాడు రోడ్డు గోవిందపురం మేజర్ కాలువ దగ్గర అనూషను గొంతు నులిమి దారుణంగా హత్య చేసి కాలువలోకి పడేశాడు. అనంతరం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితుడు విష్ణువర్ధన్ లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
* రోడ్డు ప్రమాదం ఘటనలో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైన కేసును రామగుండం పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద నిన్న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వర్తకులు, అన్నదమ్ములు కొత్త శ్రీనివాసరావు (55), రాంబాబు (45) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో వారి గుమస్తా గుండా సంతోష్, కారు డ్రైవర్ డి.సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రాజీవ్ రహదారిపై డివైడర్‌ను కారు ఢీకొనడంతోపాటు వంద అడుగుల దూరంలో ఉన్న సూచిక బోర్డు సిమెంటు గద్దెను బలంగా తాకి పక్కనున్న కాల్వలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే కొన ఊపిరితో ఉన్న రాంబాబు, గుండా సంతోష్, డి.సంతోష్‌లను 108 వాహనంలో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల వెంట సుమారు 5కేజీల 600 గ్రాముల బంగారం ఉందని బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే, 108 సిబ్బంది 3 కిలోల 300 గ్రాముల బంగారాన్ని ఎస్ఐ శైలజకు అప్పగించారు. వ్యాపారుల వద్ద ఉన్న మరో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న 108 డ్రైవర్ గుండా లక్ష్మారెడ్డి, ఎమర్జెన్సీ టెక్నీషియన్ తాజుద్దీన్ 2 కిలోల 300 గ్రాముల బంగారాన్ని దాచి పెట్టారు. తమకు 2కేజీల 300 గ్రాముల బంగారం దొరికిందని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 108 సిబ్బందిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. బంగారానికి సంబంధించిన అన్ని బిల్లులను పరిశీలించిన తర్వాతే బాధితులకు అప్పగిస్తామని సీపీ వివరించారు. ప్రమాదం నుంచి ఎంతో మందిని కాపాడిన 108 సిబ్బంది అత్యాశ వారికి చెడ్డపేరు వచ్చేలా చేసిందని సీపీ వ్యాఖ్యానించారు. అత్యవసర సేవలు అందించే సిబ్బంది అత్యాశకు పోకుండా మెరుగైన సేవలందించాలని సూచించారు.
* ఈక్వెడార్‌లోని జైళ్లలోని ఖైదీల మధ్య చెలరేగిన అల్లర్లలో 62 మంది మృతిచెందారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మొత్తం మూడు జైళ్లలో హింసాకాండ చెలరేగగా దక్షిణ క్యూకాలోని జైలులో 33 మంది, గుయాక్విల్ జైలులో 21 మంది, లాటాకుంగాలోని మరో జైలులో 8 మంది మరణించినట్లు జైళ్ల నిర్వహణ సంస్థ డైరెక్టర్ స్పష్టం చేశారు. సోమవారం ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తగా వారిని అదుపుచేసే క్రమంలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘర్షణలను అదుపుచేసేందుకు జైళ్లలో భారీగా బలగాలను మోహరించినట్లు తెలిపారు. కారాగారాల్లో ఆధిపత్యం కోసం రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగి, అదికాస్తా పరస్పర దాడులకు దారి తీసినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు.
* కర్నూలు శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.మునగలపాడులో రాములముఅనే మహిళ ఇంటి ముందు పసుపు కుంకుమ చల్లి, మనిషి తలపుర్రె, ఎముకలు, నిమ్మకాయలు పెట్టి దుండగులు క్షుద్రపూజలు చేశారు.ఉదయాన్నే ఇంటి ముందు పుర్రె, మనిషి ఎముకలు చూసి స్థానికులు వణికిపోయారు.వెంటనే ఇంటి యజమానిని అప్రమత్తం చేశారు..ఆమె కూడా భయబ్రాంతులకు గురయ్యారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించేపనిలో ఉన్నారు.ఆ ఇంటి యజమానితో పాటూస్థానికుల్ని ప్రశ్నిస్తున్నారు.ఎవరైనా కక్షగట్టి ఇలాచేశారా.. ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* కిడ్నాప్ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యఘట్కేసర్లో కిడ్నాప్ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థి(19)ని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.కిడ్నాప్ నాటకం వెలుగు చూసిన తర్వాత యువతి ఘట్కేసర్లోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది.వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.