జగన్మాత నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి

భవానీ దీక్షల విరమణకు నాలుగో రోజు మంగళవారం దీక్షాధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి పరిసరాలు అరుణవర్ణంగా మారాయి. వేకువజామున 2 గంటల నుంచి జగన్మాత నామస్మరణతో దీక్షాధారులు గిరిప్రదక్షిణ చేసి క్యూలైన్లోకి ప్రవేశించారు. ఐదు ఏళ్ల చిన్నారి మొదలు వృద్ధులు, మహిళలు చలిని కూడా లెక్క చేయకుండా 8 కి.మీ. గిరిప్రదక్షిణ అమ్మ నామస్మరణ చేస్తూ పూర్తి చేశారు. కొంతమంది దీక్షాధారులు కలిసి గిరిప్రదక్షిణ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు 70 వేల మంది దీక్షాధారులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నేటితో దీక్షల విరమణ క్రతువు ముగుస్తుంది. అందువల్ల భవానీల తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నూతన ఆంగ్ల సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకొని భవానీ దీక్షాధారులతో పాటు సాధారణ భక్తులు కూడా జగన్మాత ఆశీస్సుల కోసం వచ్చి క్యూలైన్లో బారులు తీరారు. వీఐపీల కోసం ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేయడంతో సామాన్య భక్తులకు ఆటంకం లేకుండా వారు దర్శనం చేసుకున్నారు. 2.50 లక్షల లడ్డూల విక్రయం మంగళవారం 2.50 లక్షల లడ్డూ ప్రసాదాలను దేవస్థానం విక్రయించింది. నాలుగు రోజుల్లో 12 లక్షల లడ్డూలను తయారు చేశారు. ఇప్పటి వరకు 8.50 లక్షల లడ్డూ ప్రసాదాలను కౌంటర్లలో విక్రయించారు. చివరి రోజున భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని 3.50 లక్షల లడ్డూలను నిల్వ ఉంచారు. దీక్షల విరమణ ముగిసిన తరువాత కూడా భవానీ దీక్షాధారుల తాకిడి మరో రెండు రోజులు పాటు ఉంటుందని, వారికి అవసరమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా తయారు చేస్తామని అధికారులు తెలిపారు. నాలుగో రోజున 90 వేల అప్పాలను భక్తులకు పంపిణీ చేశారు. 22 వేల మంది భక్తులకు దద్దోజనం, కదంబం అందజేశారు. తాత్కాలిక కేశఖండన శాలలో 13 వేల మంది దీక్షాధారులు తలనీలాలు సమర్పించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
1. నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీ
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలు ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా బిర్లా మందిర్‌కు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. 2018కు ఘనంగా వీడ్కోలు పలికిన నగరవాసులు.. 2019కు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా వివిధ రంగాలకు చెందిన వారంతా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నగరవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ పెరిగింది.
2. ధనుర్మాస వైభవం
వేకువ జామునే ప్రతి ఇంటి ముంగిట కల్లాపి జిల్లి రంగు రంగుల రంగవల్లికలు దిద్ది ఆపై పేడతో రూపొందించిన గొబ్బెమ్మలు పెట్టి పసుపుపచ్చని తంగేడుపూలు అలంకరించి కనె్నపిల్లలు గొబ్బి పాటలతో, తప్పెటలతో చుట్టూ తిరుగుతూంటే ధనుర్మాసం ప్రవేశించిందని అర్థం. ఆ సమయంలో జియ్యరులు తలపై అక్షయపాత్రతో చిందులు వేస్తూ ప్రతి ఇంటి ముందర సందడిచెయ్యడం, జంగమయ్యలు గంటం తిప్పుతూ పాటలు పల్లవించడం ధనుర్మాసానికి స్వాగతించినట్లు సంకేతంగా నిలుస్తాయి.ఈ దృశ్యాలు దశాబ్దలకుముందు పల్లెలలో, పట్టణాల్లో కనువిందు చేసే కమ్మని దృశ్యాలు. మన సంస్కృతికి నిలువుటద్దాలు. భారతీయ సంస్కృతిలో ఒకవైపు ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తి, మరొకవైపు భౌతిక జీవన మాధుర్యాన్ని అందించే అద్భుతాలు సమ్మిళితమై ఉంటాయి. అన్నివర్గాలవారి అభిరుచులు, ఆప్యాయతలు పెనవేసుకుని ఉల్లాస, ఉత్సాహాలకు వెల్లివిరుస్తాయి..ఈ పర్వాలు, పండుగలు జ్యోతిష శాస్తప్రరంగా, తిథి, నక్షత్ర, ఋతువులను, గ్రహసంచారాన్ని ఆధారంచేసుకుని మన ప్రాచీన ఋషులు నిర్ణయించారు. ఏసమయంలో ఏఏ పర్వాలు, పండుగలు నిర్వహించాలో సవివరంగా చెప్పారు. అటువంటి పర్వాలలో ‘్ధనుర్మాసం’ ముఖ్యమైనది.
ఆధునిక కాలంలో పట్టణాలు, నగరాలలోని ప్రజలు అపార్టుమెంట్ సంస్కృతికి, పాశ్చాత్య నాగరికతకు అలవడ్డం చేత ఈ చక్కని సమైక్య జీవన మాధుర్యాన్నిఅనుభవించలేని దుర్గతి ప్రాప్తమైంది. ఇప్పటికీ పల్లె ప్రాంతాల్లో ఈ సంస్కృతి సంప్రదాయాలు మసకబారిపోకుండా ఉండడం మన అదృష్టం. పండుగలు, వాటి వైభవాలు, వాటి వెనుకగల ఆధ్యాత్మిక విలువలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే ఈ మాసంలో గ్రామాలను దర్శించాలి.
‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు గీతాచార్యుడు. శ్రీకృష్ణపరమాత్మ మార్గశీర్షమాసం స్వరూపాన్ని తానే అనడంలోనే ఎంతో విశేషముంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనదని, ఎంతో మహిమాన్వితమైనదని ఆ మాటల్లో నిక్షిప్తపమయ్యాయి. జ్యోతిషశాస్త్ర రీత్యా రవి సంచారంతో ఈ మాసం ముడిపడి ఉంది. రవి మేషాది ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశిలో నివాసం ఉంటాడు. రవి ధనుస్సురాశిలో ప్రవేశించినప్పటినుండి తిరిగి మకరరాశిలో (మకర సంక్రాంతి ముందురోజు భోగి పండుగనాడు) ప్రవేశించేవరకు ధనుర్మాసంగా పరిగణనను పొందింది.కార్తికమాసం ప్రధానంగా శివపరంగా ఖ్యాతినార్జించుకుంది. మార్గశిర పుష్యమాసాలలో ఉండే ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు, అతని అనపాయినియైన లక్ష్మీదేవికి ఎంతో ప్రియం. విష్ణు సంబంధిత పర్వాలన్నీ ధనుర్మాసంలో సంభవించడం విశేషం. మార్గశిర గురు (లక్ష్మీ) వారాలలో ముతె్తైదువలు లక్ష్మీపూజలు చేస్తారు. విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.ఇవి ఒక ఎతె్తైతే ధనుర్మాసం వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేకమైనది. ధనుర్మాసవ్రతం పలు వైష్ణవ కుటుంబాల్లో ఆచరిస్తారు. శ్రీమహావిష్ణువును ‘మధుసూదనుడు’ అను పేర నెల రోజులపాటు షోడశోపచారాలతో అర్చిస్తారు. ఈ వ్రతం ఆచరించడంవల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.ధనుర్మాసంలోనే గోదాదేవి శ్రీరంగనాధుని భర్తగా పొందగోరి మార్గళి వ్రతాన్ని ఆచరించింది. స్నాన వ్రతమని, శ్రీవ్రతమని వ్యవహరించే ఈవ్రతాన్ని, ద్వాపరయుగంలో గోపికలు ఆచరించిన కాత్యాయినీ వ్రతంవలె వేకువనే లేచి తనను తాను గొల్లపడుచుగా భావించుకుని, తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగా, గొల్లకట్టుతో, గొల్లకొప్పుతో రంగనాథుని రోజుకొక పాశురము రచించి, దానిని మధురంగా గానం చేస్తూ, వాఙ్మవికగా శ్రీరంగనాథునికి అర్పించింది. మాసంపాటు ప్రతిరోజు పాడిన పాశురాలు తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధి పొందడమేకాక, తమిళుల ‘నాలాయిరం’ గ్రంథంలో చోటుచేసుకున్నాయి. ఈ ముప్పది పాశురాల గ్రంథం ‘తిరుప్పావై’ అన్న పేరును సంతరించుకుంది. ఇది దివ్య ప్రబంధమని పండితులు పేర్కొంటారు. ధనుర్మాసం కడపటిరోజున (్భగినాడు) గోదా రంగనాథుల కల్యాణం వైష్ణవాలయాల్లో దివ్యంగా జరుగుతుంది.అదేవిధంగా ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ వలె, మాణిక్యవాచకులు పాడిన ‘తిరువెంచావై’ పాటలు పరమశివుని నాయకునిగా భావించి భక్తి శృంగారములు మేళవించినవి అని కంచి మహాస్వామి వారన్నారు.‘తిరుప్పావై’ పాశురాలను వైష్ణవ దేవాలయాలలో సుప్రభాత సమయంలో గానం చేస్తే, ‘తిరువెంచావై’ పాటలను శివాలయాల్లో సుప్రభాత సమయంలో గానం చేయడం ధనుర్మాసంలోని ప్రత్యేకత.శైవ, వైష్ణవ దేవాలయాల్లో ‘తిరువెంచావై’, ‘తిరుప్పావై’ పాటలను ఉషఃకాలంలో ధనుర్మాసమంతా అందరూ గానం చేయాలని కంచి మహాస్వామివారు పలు సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేసేవారు.ధనుర్మాసవ్రతమును ముతె్తైదువులు ‘మార్గళి’వ్రతాన్ని కనె్నపిల్లలు, తెలుగు ప్రాంతాల్లో మార్గశిర లక్ష్మీవారపు నోములు ఆచరిస్తూ ధన్యత పొందుతున్నారు. ఆరోగ్యరీత్యా వేకువన స్నానం చేయడం, ఆయా వ్రతాల్లో చెప్పినవిధంగా చేసిన నివేదనలు మంచి ఆరోగ్యాన్ని ప్రస్తావిస్తాయని ఆయుర్వేద శాస్త్రం అంటున్నది.అత్యంత పవిత్రమైన, భక్తిదాయకమైన ధనుర్మాసంలో శివకేశవుల ఆరాధన శ్రేయోదాయకం, మోక్షదాయకం.
3. దుర్గమ్మ సేవలో డీజీపీ ఠాకూర్‌
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం అమ్మవారి దర్శనం కోసం డీజీపీ దంపతులు ఇంద్రకీలాద్రికి రాగా, వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి కోటేశ్వరమ్మ, ట్రస్టు బోర్డు సభ్యుడు పద్మాశేఖర్‌రావు స్వాగతం పలికారు. ఆలయ ప్రధానార్చకుడు దుర్గాప్రసాద్‌ ఆలయ మర్యాదలతో దర్శనం చేయించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వదించారు. ట్రస్టు బోర్డు సభ్యుడు పద్మశేఖర్‌రావు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. పశ్చిమ ఏసీపీ కె.సుధాకర్‌, సీఐ కాశీవిశ్వనాథ్‌ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
4. కనులారా తిరుమలేశుని దర్శనం
ఆంగ్ల నూతన సంవత్సరం తొలిరోజైన జనవరి ఒకటిన శ్రీవారి దర్శనం భక్తకోటికి సంతృప్తికరంగా లభించింది. సామాన్య భక్తులకే తితిదే అధిక ప్రాధాన్యమిస్తూ.. వచ్చిన వారందరికీ స్వామివారి దర్శనాన్ని కల్పించింది. మంగళవారం వేకువజామున తిరుప్పావై నివేదన అనంతరం ధనుర్మాసం కైంకర్యాలు జరిగాయి. అర్ధరాత్రి 1.30 నుంచి 2.50 గంటల వరకు ప్రముఖులకు కేటాయించారు. ఆ తర్వాత సర్వదర్శనాన్ని ప్రారంభించి అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు కొనసాగించారు. నిర్దేశించుకున్న సమయం కంటే గంటన్నర ముందుగానే ధర్మదర్శనం ప్రారంభమైంది. జనవరి ఒకటిన శ్రీవారి ఆశీస్సులు అందుకోవాలని విచ్చేసిన యాత్రికులు అందరికీ స్వామి దర్శనం లభించింది. సాయంత్రం 6 గంటల సమయానికి 70 వేల మంది దర్శించుకున్నారు. శీఘ్రంగా స్వామి దర్శనం లభిస్తుందన్న సమాచారంతో.. మధ్యాహ్నం తర్వాత స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు, శ్రీవారి ఆర్జిత సేవలను బుధవారం నుంచి తితిదే పునరుద్ధరించనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డలతో పాటు తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను కూడా అందుబాటులోకి తేనుంది.
5. సంవత్సరాదిన విశేష పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరాదిన పలు ప్రాంతాలవారు ఆయనను దర్శించుకున్నారు. కొత్త ఏడాది తొలిరోజునే స్వామి జన్మనక్షత్రం స్వాతి, ఏకాదశి పర్వదినం కలిసిరావడంతో విశేష పూజలు నిర్వహించారు. బాలాలయ మహామండపంలో లక్ష పుష్పార్చన చేపట్టారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చించారు.
6.అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు
కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామిని 50 ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్నారు. కేరళలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్లు లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో తాము అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నట్లు కోజికోడ్‌ జిల్లాకు చెందిన బిందు(42), కనకదుర్గ(44) అనే ఇద్దరు మహిళలు వెల్లడించారు. ‘‘మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మేం పంబ చేరుకున్నాం. అక్కడి నుంచి ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిదానానికి వచ్చాం. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదు. కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేదు’’ అని మహిళలు చెబుతున్నారు. కాగా.. వీరిద్దరూ హడావుడిగా శబరిమల ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వీరు నిజంగా దర్శనం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు ఈ ఘటనపై అయ్యప్ప దర్శ సేన నాయకుడు రాహుల్‌ ఈశ్వర్‌ స్పందించారు. మహిళలు దర్శనం చేసుకున్నారంటే నమ్మకం కలగడం లేదని, ఒకవేళ వాళ్లు రహస్యంగా వెళ్లినట్లు తెలిస్తే మాత్రం మేం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల మహిళలు ప్రవేశించకుండా దశబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గతేడాది సెప్టెంబరు 28ను సుప్పీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుతో కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు. తీర్పు నేపథ్యంలో గతంలో కొందరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు భద్రత కల్పించినప్పటికీ భక్తులు మహిళలను ఆలయంలోకి వెళ్లనివ్వలేదు.ఈ క్రమంలో డిసెంబరు 18న బిందు, కనకదుర్గలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో పంబ నుంచి సన్నిధానానికి కిలోమీటరు దూరంలో ఉన్న మారకూటం వరకు చేరుకున్నారు. అయితే అక్కడ భక్తులు వీరిని అడ్డుకోవడంతో ఆ సమయంలో పోలీసులు వారిని వెనక్కి పంపించారు. తాజాగా నేడు తెల్లవారుజామున వీరిద్దరూ అయ్యప్పను దర్శించుకున్న వీడియో బయటకు వచ్చింది.
7. తెరుచుకున్న శబరిమల ఆలయం
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం సంచలనానికి దారి తీసింది. దీంతో ప్రధాన అర్చకుడి నిర్ణయం మేరకు బుధవారం ఉదయం శబరిమల ఆలయాన్ని మూసివేసి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. దాదాపు గంట పాటు ఆలయ ద్వారాలు మూసివేశారు. సంప్రోక్షణ తర్వాత శబరిమల ఆలయాన్ని తెరిచి భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతినిచ్చారు.బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ఈరోజు తెల్లవారుజామున 3:45 గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. ఇటీవల వీళ్లు ఒకసారి ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. అప్పుడు అయ్యప్ప భక్తులు వీరిని అడ్డుకున్నారు. నిన్న మహిళా సంఘాలు కేరళ వ్యాప్తంగా మానవహారం నిర్వహించిన తర్వాత ఇప్పుడు పోలీసులు, ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కొందరు యూనిఫాంలో ఉన్న పోలీసులు, మఫ్తీ పోలీసులు వారిని స్వయంగా ఆలయ గర్భ గుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు.
8. తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 4 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 95,736 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com