Politics

ఆ విషయం మా అన్ననే అడగండి-తాజావార్తలు

Sharmila Speaks On YS Jagan Support To Her Party

* నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ నే అడగండి అని ఆయన సోదరి షర్మిల వ్యాఖ్యానించారు. నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు..విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వాళ్లేనా?పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదు, అయినా మా అనుబంధాల్లో తేడా ఉండవు. మాటలు, అనుబంధాలు, రాఖీలు అన్నీ ఉంటాయి..నాకు విజయమ్మ మద్దతు ఉంది..జగన్ తో విభేదాలో, భిన్నాభిప్రాయాలో తెలీదు అని ఆమె పేర్కొన్నారు.

* వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను (పీఎస్‌యూ) నడపలేమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వాటి ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక సాయం అందించడం భారమని వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన బుధవారం మాట్లాడారు.

* అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ బైడెన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మాస్కులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అతి త్వరలోనే మాస్కుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇందుకు ఎంత ఖర్చు కానుంది, ఎలాంటి మాస్కులు అందిస్తారనే విషయంపై శ్వేతసౌధం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి 1-7 తరగతులకు సీబీఎస్‌ఈసీ విధానం అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, ‘నాడు-నేడు’ పనులు, విద్యాకానుకపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024 నాటికి పదోతరగతి వరకు సీబీఎస్‌ఈసీ విధానం అమల్లోకి తేవాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. విద్యాకానుకలో ఇంగ్లీష్‌, తెలుగు డిక్షనరీలను చేర్చాలని.. దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకూ డిక్షనరీలు ఇవ్వాలని చెప్పారు. అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల నాణ్యత, సర్వీసు బాగుండాలన్నారు.

* రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్ద ఛాలెంజ్‌గా మారిందని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ వ్యాఖ్యానించారు. సూరత్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ 27 స్థానాల్లో విజయం సాధించడంపై ఆయన స్పందించారు. గతంలో కాంగ్రెస్‌ గెలిచిన స్థానాలనే ఆప్‌ అభ్యర్థులు గెలుచుకున్నారన్నారు. ఆప్‌తో కాంగ్రెస్‌కు పెద్ద సవాల్‌ తప్ప భాజపాకు కాదన్నారు. బావ్లా సమీపంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.

* విద్యుత్‌ ఉత్పత్తితో పాటు బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణం పర్యావరణానికి హానికరమనే వాదనను కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తోసిపుచ్చారు. ఇవి వాస్తవానికి పర్యావరణానికి హాని కలిగిస్తాయో? లేదోననే విషయాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ‘నదీ పరివాహక ప్రాంతాలు, ఆనకట్టలు-సుస్థిరాభివృద్ధి’పై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్‌మంత్రి ఆర్‌కే సింగ్‌ ఈ విధంగా మాట్లాడారు.

* రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ బుధ‌వారం ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతెరాను ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు, గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్ పాల్గొన్నారు.ఈ కొత్త స్టేడియానికి న‌రేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్ట‌డం గ‌మ‌నార్హం. అహ్మ‌దాబాద్‌లోని ఈ స్టేడియాన్ని పున‌రుద్ధ‌రించిన విష‌యం తెలిసిందే.ల‌క్షా ప‌ది వేల సామ‌ర్థ్యంతో ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు సృష్టించింది. కాసేప‌ట్లోనే ఈ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య డేనైట్ ప్రారంభం కాబోతోంది.

* రేపు బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా కుప్పం చేరుకోనున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు.

* కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని వ్యవసాయ రంగంలో మరోసారి సత్తా చాటిన అనంతపురం జిల్లా

* దేశంలోని ఐదు రాష్ట్రాల్లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వెస్ట్ బెంగాల్ లో బిజెపి ఆట మొదలుపెట్టి కూడా చాలా కాలమైంది.అది విజయవంతంగానే సాగుతోంది.నేడు అస్సాంలో,బెంగాల్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు కూడా.అస్సాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఆట మొదలెట్టారు.తాజాగా, పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వేటుతో తమిళనాట ఆట ఊపందుకుంది.అందరూ ఊహించినట్లుగానే పుదుచ్చేరిలో కాంగ్రెస్,డిఎంకె సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. కూల్చేశారా? కూలిపోయిందా? అన్నది బహిరంగ రహస్యమే.దక్షిణాదిలో కాంగ్రెస్ పాలనలో వున్న ఏకైక రాష్ట్రమిదే. దీన్ని సైతం కాపాడుకోలేని బలహీనమైన దశలోనే కాంగ్రెస్ ఉంది. మొదటినుంచీ కాంగ్రెస్ కు పుదుచ్చేరి కంచుకోట. 2016నుంచే ఆ కోటకు బీటలు పడడం ప్రారంభమైంది.

* మంత్రి అప్పలరాజు సోదరుడు చిరంజీవి వీరంగం సృష్టించారు. దేవునళ్తాడుకు చెందిన జనసేన కార్యకర్త పద్మారెడ్డిని చితకబాదారు. ఫేస్ బుక్‌లో కొంతకాలంగా చిరంజీవి, పద్మారెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆగ్రహించిన మంత్రి సోదరుడు 30 మంది అనుచరులతో అర్ధరాత్రి పద్మారెడ్డి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. దాడిలో జనసేన కార్యకర్త పద్మారెడ్డి సహా పలువురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను శిక్షించాలని జనసేన నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

* కరోనా కారణంగా గత ఏడాది జరిగిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరుకాలేక చివరి అవకాశాన్ని కూడా కోల్పోయిన అభ్యర్థులకు మరో వెసులుబాటు ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. కరోనా కారణంగా అభ్యర్థులు పరీక్షలకు సరిగా సిద్ధం కాలేదని.. మరో అవకాశం ఇవ్వాలంటూ రచనాసింగ్ అనే సివిల్స్ అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2020లో చివరి ప్రయత్నం చేసిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ వేశారు. దీన్ని నేడు సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

* సాధారణంగా నేరస్థులు, దొంగలను పట్టుకోవడానికి.. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులకు ప్రభుత్వం జీపులు, ద్విచక్రవాహనాలు, తుపాకులు, లాఠీలు ఇస్తాయి. కానీ, పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో పోలీసులకు అక్కడి పోలీసుశాఖ వాటితో పాటు స్కేటింగ్‌ బూట్లు ఇవ్వడం విశేషం. నగర వీధుల్లో పారిపోయే దొంగలను సులువుగా పట్టుకోవడం కోసం కొందరు పోలీసులకు స్కేటింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వివరాల్లోకి వెళ్తే…..పాకిస్థాన్‌లోని కరాచీ నగర వీధులు నిత్యం జనసంచారంతో బిజీగా ఉంటాయి. గుంపులుగా జనాలు తిరుగుతుండటంతో చోరీలు.. అమ్మాయిలపై వేధింపులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలపై సమాచారం అందుకొని పోలీసులు అక్కడికి చేరుకోగానే దొంగలు, ఆకతాయిలు వీధుల్లో పరిగెడతారు. గుంపులు గుంపులుగా ఉండే జనాల మధ్య ఇట్టే తప్పించుకొని పారిపోతుండటంతో వారిని పట్టుకోవడం కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వారు అలా తప్పించుకోవడానికి వీల్లేకుండా కరాచీ పోలీసుశాఖ వినూత్న ఆలోచన చేసింది. స్కేటింగ్‌ బూట్లు ధరించి ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని వీధుల్లో దూసుకెళ్తూ.. వీధుల్లో పరిగెత్తే దొంగలను సులువుగా పట్టుకోవచ్చనే ఉద్దేశంతోనే స్పెషల్‌ సెక్యూరిటీ యూనిట్‌లోని 20 మంది పోలీసులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. నల్లరంగు యూనిఫాంతో తుపాకి, ఇతర ఆయుధాలు కలిగి ఉండే ఈ 20 మంది పోలీసులకు స్కేటింగ్‌ చేస్తూనే తుపాకి బయటకు తీసి గురిపెట్టగలిగేలా, దొంగలను అదుపులోకి తీసుకునేలా శిక్షణ ఇస్తున్నారు.