* తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరో అవార్డు లభించింది. దేశంలోనే ఉత్తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా కేటీఆర్ నిలిచారు. ఈ మేరకు స్కోచ్ గ్రూప్ మంత్రి కేటీఆర్ ప్రశంసాపత్రం అందించింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఈయర్ అవార్డు స్కోచ్ గ్రూప్ ప్రకటించింది. మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే అత్యుత్తమ సీఎంగా స్కోచ్ అవార్డు అందించిన విషయం తెలిసిందే.
* నటి శ్రీ సుధ విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును గుద్దిన దుండగులు హత్యాయత్నానికి ఒడిగట్టారని ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడుపై తనకు అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు సహజీవనం చేసి శ్యామ్ కె.నాయుడు మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనను బెదిరించాడని, దీంతో తనకు అతడి వల్ల ప్రాణహాని ఉందంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
* హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఓ మహిళ ఆస్తిని ఆమె తండ్రి వారసులూ పొందవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.సెక్షన్ 15(1)(డీ) ప్రకారం ఆస్తిని పొందేందుకు మహిళ తండ్రి వారసులు అర్హులే అని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.వారిని పరాయివారిగా పరిగణించలేమని తెలిపింది.జగ్నో అనే ఓ మహిళ వేసిన కేసుపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈ విధంగా తీర్పు వెలువరించింది.జగ్నో భర్త షేర్ సింగ్ 1953లో మరణించారు. భర్త మరణం తర్వాత ఆమె తన పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన తమ్ముడి కుమారులకు ఇచ్చారు.అయితే జగ్నో తన సొంత వాళ్లకు ఈ ఆస్తిని పంచుకోవడాన్ని షేర్ సింగ్ అన్నదమ్ముల వారసులు సవాల్ చేశారు.ఈ కేసుపై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం భర్త మరణం అనంతరం ఆస్తి జగ్నో పేరిట ఉంది కనుక తన తండ్రి వారసులకు ఈ ఆస్తిని ఇవ్వడం తప్పు కాదని స్పష్టం చేసింది.
* గుంటూరు నగర మేయర్ టీడీపీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర పేరు ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఉన్న అభ్యర్థుల వివరాలపై నేతలు చర్చించారు. పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు డివిజన్లలోని అభ్యర్థిత్వాలపై ఉన్న సందిగ్ధతపై చర్చించినట్లు సమాచారం. శుక్రవారం ఆయా డివిజన్లలో పోటీచేసిన అభ్యర్థులను పిలిపించాలని నిర్ణయం తీసుకున్నారు. వార్డులవారీగా అభ్యర్థులపై సమావేశంలో టీడీపీ నేతలు చర్చించారు.
* దేశంలో పేదరికాన్ని నిర్మూలించి అద్భుతం చేసి చూపించామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు.అతి తక్కువ కాల వ్యవధిలోనే కోట్లాది మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు పేర్కొన్నారు.తద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక తార్కాణంగా నిలిచామంటూ హర్షం వ్యక్తం చేశారు.కాగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పేదరిక నిర్మూలనకై కృషి చేసిన గ్రామీణాధికారులను జిన్‌పింగ్ సత్కరించారు.మెడల్స్ ప్రదానం చేసి, వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయం. హ్యూమన్ మిరాకిల్(మానవుడు సృష్టించిన అద్భుతం).తక్కువ సమయంలోనే ఎన్నో కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం’’అని పేర్కొన్నారు.
* తెలంగాణలో కోవిడ్ 19 కేసులపై హైకోర్టు విచారణ జరిపింది. కోవిడ్ 19 కేసులపై బులెటిన్ నిలిపేయడంపై పిటిషనర్ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.అయితే కోవిడ్ 19 బులెటిన్ ప్రతిరోజు ఇవ్వాల్సిందే అని వైద్య, ఆరోగ్యశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అలాగే కరోనా సెకండ్ వేవ్ మొదలైంది అని ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అని హైకోర్టు సూచించింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.కాబట్టి ఇక్కడ పబ్లిక్ గ్యాధరింగ్స్ పై ఆంక్షలు విధించాలి అని అలాగే 50 ఏండ్లు పైబడిన వారు వాక్సిన్ తీసుకునేలా ప్రచారం చేయాలి. ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించాలి అని పేర్కొంది.
* ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు..కొత్తగా నిన్న ఒక్క రోజు 16,738 కరోనా కేసులు.138 మరణాలు నమోదు.దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914.మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,56,705.
* కెనరా బ్యాంక్ డబ్బులను స్వాహ చేసిన మేనేజర్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ఆరో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పునిచ్చింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహాలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం… కెనరా బ్యాంక్ దిల్‌సుఖ్‌నగర్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా వి.భాస్కర్‌రావు 2007 మార్చి–1 నుంచి మే–31 వరకు పని చేశారు. అదే బ్యాంక్‌లో ఏటీఎం నిర్వహిస్తున్నారు. సదరు ఏటీఎం సైతం మేనేజర్ భాస్కర్‌రావు ఆధీనంలో ఉండేది. అప్పుడు ఏటీఎంలో మూడు నెలలుగా రూ.10,34,500 నగదు తక్కువగా చూపించింది. విషయాన్ని గమనించిన బ్యాంక్ ఉన్నతాధికారులు డిపార్టుమెంటల్ ఎంక్వైరీతో పాటు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రాంచ్ మేనేజర్ భాస్కర్‌రావు నిధులు నిర్వర్తించే సమయంలో మోసపూరితంగా డబ్బులు స్వాహా చేశారని తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో అభియోగ పత్రాలను నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పునిచ్చారు.
* ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికేం గాయాలేం కాలేదని తెలుస్తోంది. సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా పర్యటనలో ఆమెకు ఈ ప్రమాదం సంభవించింది.
* ఏపీలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా అభ్యర్థిగా అవకాశం దక్కడం ఆనందంగా ఉందని ఎండీ కరీమున్నీసా తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు సీఎం జగన్ రాష్ట్రంలో అండగా ఉన్నారని చెప్పేందుకు నిదర్శనం తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమేనని అన్నారు. పార్టీతో నడిచినవారికి తగిన గుర్తింపు వైఎస్సార్‌సీపీలో ఉంటుందని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్రంలో ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
* మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్మాణాలపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని చెప్పారు. అమరావతిలోని 29 గ్రామాలు రాష్ట్రంలో అంతర్భాగమేనని అన్నారు. భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేయడానికి రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాయలంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.